జిల్లాలో కొనసాగుతున్న కొవిడ్‌ వాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-04-11T06:48:11+05:30 IST

జిల్లావ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా పలువు రు ప్రముఖులు టీకాలు వేయించుకున్నారు.

జిల్లాలో కొనసాగుతున్న కొవిడ్‌ వాక్సినేషన్‌
కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయిం చుకుంటున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కేతేపల్లి / నకిరేకల్‌ / నార్కట్‌పల్లి /  కొండమల్లేపల్లి / చిట్యాల రూరల్‌ / మర్రిగూడ, ఏప్రిల్‌ 10 : జిల్లావ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా పలువు రు ప్రముఖులు టీకాలు వేయించుకున్నారు. కేతేపల్లి పీహెచ్‌సీలో 30మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్నాక కొంతసేపు డాక్టర్‌ పర్యవేక్షణలో ఉన్నారు. నార్కట్‌పల్లి, చిట్యాల మండలంలోని వెలిమినేడు పీహెచ్‌సీలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాప్తి మళ్లీ తిరగడబడుతున్న నేపథ్యంలో జిల్లాలోని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అందరూ కొవిడ్‌ టీకా వేయించుకోవాలని సూచించారు. కొండమల్లేపల్లి పీహె చ్‌సీలో 85మందికి కొవిడ్‌ టీకాలు వేశారు. మండల పరిధిలోని 45 ఏళ్లు వయస్సు పైబడిన వారు కరోనా టీకాలు వేయించుకోవాలని ఎంపీడీవో బాలరాజురెడ్డి కోరారు. మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి కరోనా టీకా వేయించుకున్నారు.
కరోనాతో ఇద్దరి మృతి 
చింతపల్లి / చౌటుప్పల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 10 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనాతో శనివారం ఇద్దరు మృతిచెందారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో కరోనాతో శనివారం వృద్ధుడు మృతి చెందాడు. చింతపల్లి మండలంలోని కొర్రమాన్‌సింగ్‌ తండాకు చెందిన వృద్ధుడు(65) అతని భార్య, కుమార్తె, మనువడికి ఈ నెల 1న జ్వరం, జలుబుతో బాధపడుతూ చింతపల్లి పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో వృద్ధుడు, అతడి భార్య, మనువడికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో పీహెచ్‌సీ వైద్యుడు ముగ్గురికి మందులు ఇచ్చి పంపాడు. వృద్ధుడు తన పొలం వద్ద ఉన్న ఇంట్లో ఉంటూ మందులు వాడుతున్నాడు. వృద్ధుడికి శనివా రం అకస్మాత్తుగా ఆయాసం రావడంతో 108లో  హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణానికి చెందిన వ్యక్తి(50) కరోనా వైరస్‌ సోకి మృతిచెందాడు. కరోనా మందుల వాడకంలో చేసిన నిర్లక్ష్యంతోనే వెంకటేష్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి బార్య, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.

Updated Date - 2021-04-11T06:48:11+05:30 IST