చెల్లెలు మృతికి కారణమయ్యాడనే.. అమ్మనబ్రోలు యువకుడి హత్య

ABN , First Publish Date - 2020-11-01T11:08:56+05:30 IST

చెల్లెలు ఆత్మహత్యకు కారణమయ్యాడనే పగతోనే యువకుడిని ఆమె అన్న హత్యచేసినట్లు పోలీసులు వెల్లడించారు.

చెల్లెలు మృతికి కారణమయ్యాడనే.. అమ్మనబ్రోలు యువకుడి హత్య

నిందితుడి అరెస్టు

వివరాలను వెల్లడించిన ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌


ఒంగోలు(క్రైం), అక్టోబరు 31: చెల్లెలు ఆత్మహత్యకు కారణమయ్యాడనే పగతోనే యువకుడిని ఆమె అన్న హత్యచేసినట్లు పోలీసులు వెల్లడించారు. రెండు రోజుల క్రితం నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో యలమందయ్య అనే యువకుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో  నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గతనెల 29వ తేదీ ఉదయం అమ్మనబ్రోలులోని కుమ్మరికుంట వద్ద కాటూరి యలమందయ్య అనే యువకుడు హత్యకు గురయ్యాడు.


మోటారుబైక్‌పై మంచినీరు తెచ్చుకునేందుకు వెళ్లిన అతడిని నిందితుడైన జె.పంగులూరు మండలం బూదవాడకు చెందిన తేళ్ల కోటేశ్వరరావు కత్తితో పొడిచి హత్యచేసి పరారయ్యాడు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని డీఎస్పీ వివరించారు. తేళ్ల కోటేశ్వరరావు తన చెల్లెల్ని అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన గురజాల ఎలీషాకు ఇచ్చి ఏడేళ్ల క్రితం వివాహం చేశారు. ఎలీషా, యలమందయ్య స్నేహితులు. దీంతో ఎలీషా భార్యపై యలమందయ్య లేనిపోని మాటలు చెప్పి వారి మధ్య మనస్పర్థలు వచ్చేలా చేశాడు. దీంతో ఈ ఏడాది మార్చిలో ఎలీషా భార్య ఆత్మహత్య చేసుకుంది. తన చెల్లెలు మృతికి కారణం యలమందయ్యే అని కోటేశ్వరరావు పగ పెంచుకున్నాడు. హత్య చేసేందుకు పథకం రూపొందించాడు. గత నెల 29న మోటారుబైక్‌పై యలమందయ్య మంచినీరు తెచ్చుకునేందుకు కుమ్మరికుంట వద్దకు వెళ్లాడు.


ముందుగానే అతడి కదలికలను పసిగట్టిన కోటేశ్వరరావు బావి పరిసర ప్రాంతంలో కాపుకాచి యలమందయ్యపై తన వెంట తెచ్చుకున్న కత్తితో 17 పోట్లు పొడిచి హత్య చేసి పరారయినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అత్యంత వేగవంతంగా స్పందించారన్నారు. హత్యకు వినియోగించిన కత్తి, దుస్తులను తన స్వగ్రామమైన బూదవాడ శివారు ప్రాంతంలో పడవేసి శనివారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లేందుకు సిద్ధమవగా ఒంగోలు రూరల్‌ సీఐ పి.సుబ్బారావు, ఎన్‌జీపాడు ఎస్‌ఐ శశికుమార్‌ తన సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారని చెప్పారు. ఈ సందర్భంగా సిబ్బందికి డీఎస్పీ అభినందనలు తెలిపారు.

Updated Date - 2020-11-01T11:08:56+05:30 IST