ఆ బడికి ఆయనొక్కరే దిక్కు!

ABN , First Publish Date - 2021-10-29T04:51:54+05:30 IST

ఆ బడికి ఆయనొక్కరే దిక్కు!

ఆ బడికి ఆయనొక్కరే దిక్కు!
ఉపాధ్యాయులను నియమించాలని దండం పెట్టి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న విద్యార్థులు

  • 100 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు
  • 6 నుంచి 10 తరగతులకు బోధన 
  • పట్టించుకోని ఉన్నతాధికారులు 
  • వికారాబాద్‌ జిల్లా కడ్మూర్‌ జడ్పీ పాఠశాల దుస్థితి


పూడూరు: అది జిల్లా పరిషత్‌ పాఠశాల.. అందులోని 100 మంది విద్యార్ధులకు ఒక్కడే ఉపాధ్యాయుడు.. ప్రభుత్వం, ఉన్నతాధికారులు విస్మరించినా తాను మాత్రం బాధ్యతను భుజానికెత్తుకున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులను ఆయనే బోధిస్తున్నారు. ఎంతో ఓపిక, సంయమనం, శ్రద్ధ, అంకితభావంతో విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అత్యవసరమై ఆయన సెలవు పెడితే  పక్క గ్రామంలోని పాఠశాల టీచరే దిక్కు... లేదంటే ఇక ఆ రోజు పాఠశాల మూతే. ఇదీ వికారాబాద్‌ జిల్లా పూడూరు మండల పరిధిలోని కడ్మూర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాల పరిస్థితి. ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మాత్రమే ఉండగా, గతంలో వాలంటీర్లతో బోధన కొనసాగింది. అయితే కరోనా విజృంభణతో పాఠశాలలు మూసివేసి, తిరిగి పునఃప్రారంభించిన అనంతరం వాలంటీర్లను తిరిగి కేటాయించలేదు. దీంతో ఉన్న ఒక్క ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య అన్ని తరగతులకు బోధించాల్సి వస్తోంది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దాదాపుగా అన్ని తరగతుల్లో 100 మంది విద్యార్థులుండగా ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య అన్ని తరగతుల్లో అన్ని సబ్జెక్టులను తానే బోధిస్తున్నారు. ప్రతి సబ్జెక్టుకు ఓ టీచర్‌ ఉండాల్సి ఉండగా, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని కోరుతున్నారు. 

అందరికీ ఒకే గదిలో బోధన 

మా పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో విద్యార్థులందరినీ ఒకేగదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్ధుల సందేహాలు తీర్చేందుకు ఆయనకు సమయం చాలడం లేదు. అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులుంటే సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. 

- విఘ్నేశ్‌, విద్యార్థి 8వ తరగతి  

ఉపాధ్యాయులను నియమించాలి

కరోనాకు ముందు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితో పాటు వాలంటీర్లు పాఠాలు బోఽధించేవారు. కానీ ఇప్పుడు వాలంటీర్లు, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నష్టపోతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఉపాధ్యాయులను నియమించాలి.  

-మల్లేశ్‌, కడ్మూర్‌ గ్రామస్థుడు 

Updated Date - 2021-10-29T04:51:54+05:30 IST