లక్ష ఇళ్ల పథకానికి శ్రీకారం

ABN , First Publish Date - 2022-02-01T18:15:20+05:30 IST

రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు అందుబాటులోకి తెచ్చేందుకు సంబంధిత చట్టాలకు కొన్ని సవరణలు అవసరం ఉందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అభిప్రాయపడ్డారు. నగరంలో సోమవారం ఆయన

లక్ష ఇళ్ల పథకానికి శ్రీకారం

- చట్టాలకు కొన్ని సవరణలు అవసరం: సీఎం

- అర్హులకు తాత్కాలిక పట్టాల ప్రదానం 


బెంగళూరు: రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు అందుబాటులోకి తెచ్చేందుకు సంబంధిత చట్టాలకు కొన్ని సవరణలు అవసరం ఉందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అభిప్రాయపడ్డారు. నగరంలో సోమవారం ఆయన రాజీవ్‌గాంధీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా లక్ష ఇళ్ల ప థకానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఇదే సందర్భంగా మహిళలు, దివ్యాంగులు, పౌరకార్మికులకు తాత్కాలిక పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజధానితో సహా పెద్ద పెద్ద నగరాలలో చట్టబద్ధంగా లే అవుట్‌లు అభివృద్ధి కావడం లేదన్నారు. హడావుడిగా ఏర్పాటు చేస్తున్న పలు లే అవుట్‌లలో మౌలిక సదుపాయాలు నామమాత్రంగా ఉంటున్నాయన్నారు. ప్రత్యేకించి ఇలాంటి లే అవుట్‌లలో రెవెన్యూ స్థలాలు కల్గిన ప్రజలు ఇళ్లు నిర్మించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నగర ప్రదేశాలలో ప్రజలకు వసతి కల్పించడం ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారిందన్నారు. ప్రస్తుత స్థితిలో దీన్ని ఒక సామాజిక సవాల్‌గా ఆయన అభివర్ణించారు. దశలవారీగా లక్ష ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామన్నారు. తొలిదశలో 46 వేల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని, మిగిలిన 64వేల ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రెండోదశలో ఉంటుందన్నారు. నిరుపేదలకోసం శాటిలైట్‌ టౌన్‌షి్‌ప నిర్మాణంపై దృష్టి సారించాలని, మౌలిక సదుపాయాలతో సహా టౌన్‌షి్‌పలు ఏర్పాటు చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వసతి విప్లవం ప్రారంభమైందని పేర్కొన్న సీఎం తమ ప్రభుత్వ హయాం లో 4 లక్షల గ్రామీణ ఇళ్లు, నగర ప్రదేశాలలో లక్ష ఇళ్ల పథకం, ఇతర ప్రాంతాలలో బలహీనవర్గాలు, దళితులకు మురికివాడలలో 97వేల పక్కాఇళ్ల నిర్మాణం వంటివి ఏకకాలంలో సాగుతున్నాయన్నారు. లక్ష ఇళ్ల నిర్మాణం విజయవంతం కావడంతో త్వరలోనే మరో లక్ష ఇళ్ల నిర్మాణానికి కసరత్తు చేస్తున్నామన్నారు. వసతిశాఖ మంత్రి వీ సోమణ్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు ఇచ్చిన హామీ ప్రకారం 46,499 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే 6 వేల ఇళ్లు వందశాతం పూర్తయ్యాయన్నారు. మునిసిపల్‌ వ్యవహారాలశాఖ మంత్రి ఎంటీబీ నాగరాజ్‌, బీడీఏ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌, మౌలిక సదుపాయాల అభివృద్ధిశాఖ అదనపు ముఖ్యకార్యదర్శి బీహెచ్‌ అనిల్‌కుమార్‌, వసతిశాఖ ప్రధాన కార్యదర్శి జే రవిశంకర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బసవరాజ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-01T18:15:20+05:30 IST