పల్లెలపై పన్నుల భారం!

ABN , First Publish Date - 2021-10-02T04:33:40+05:30 IST

కరోనా మహమ్మారి ప్రజల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఎంతోమంది ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. పంట చేతికొచ్చినా.. కరోనా కారణంగా కొనేవారు లేక రైతులు దిగులు చెందుతున్నారు. ఈ తరుణంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. పనుల్న భారం మోపేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతోపాటు ట్రూఆప్‌ చార్జీల పేరుతో కరెంట్‌ బిల్లులు బాదేస్తున్నారు. పట్టణాల్లో ఆస్తిపన్ను, చెత్తపన్ను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు పల్లెల వంతు వచ్చింది. గ్రామ పంచాయతీల్లో ప్రజలపై పన్నుల భారం మోపనుంది.

పల్లెలపై పన్నుల భారం!
బూర్జపాడు గ్రామ పంచాయతీ

- ప్రతి ఇంటికీ 5 శాతం పెంపునకు సన్నాహాలు

(ఇచ్ఛాపురం రూరల్‌)

కరోనా మహమ్మారి ప్రజల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఎంతోమంది ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. పంట చేతికొచ్చినా.. కరోనా కారణంగా కొనేవారు లేక రైతులు దిగులు చెందుతున్నారు. ఈ తరుణంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. పనుల్న భారం మోపేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతోపాటు ట్రూఆప్‌ చార్జీల పేరుతో కరెంట్‌ బిల్లులు బాదేస్తున్నారు. పట్టణాల్లో ఆస్తిపన్ను, చెత్తపన్ను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు పల్లెల వంతు వచ్చింది. గ్రామ పంచాయతీల్లో ప్రజలపై పన్నుల భారం మోపనుంది. ప్రతి ఇంటిని పన్ను పరిధిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆస్తి పన్నును మరో 5 శాతాన్ని పెంచనుంది. కొత్త పన్నులు అమలైతే సుమారు రూ.6 కోట్ల దాకా పంచాయతీ ఖజానాకు జమ కానుంది. జిల్లాలో 1196 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం పన్నుల ద్వారా ఏటా సుమారు రూ.15.24 కోట్లు వసూలు అవుతున్నాయి. ఇప్పుడు 5 శాతం పన్నుల పెంపుతో పాటు శాటిలైట్‌ ద్వారా సర్వే చేయడం వల్ల ప్రతి ఇల్లు పన్ను పరిధిలోకి వస్తుంది. ఆ ఇల్లు విస్తీర్ణం ఎంత ఉందో నమోదవుతుంది. ఒకవేళ ఇప్పటికే పన్ను వేస్తున్నా, కొలతలు ఎక్కువ ఉంటే అదనపు పన్ను విధిస్తారు. ఇక ఖాళీ స్థలాల వివరాలు కూడా తెలిసిపోతాయి. 


పక్కాగా.. మ్యాపింగ్‌ :

జగనన్న శాశ్వత భూరక్ష పేరుతో ఇప్పటికే ప్రభుత్వం భూముల సర్వే చేస్తోంది. ప్రతి ఊరులో భూముల వివరాలు సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తుంది. ఇందులో భాగంగానే గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులను టెక్నాలజీ సాయంతో సర్వే చేస్తారు. గ్రామంలో ఏ ఇల్లు ఎంత విస్తీర్ణంలో ఉంది?, ఖాళీ స్థలాలు, పంచాయతీ ఆస్తులను గుర్తిస్తారు. వీటన్నింటినీ మ్యాపింగ్‌ చేస్తారు. పన్ను పరిధిలోకి రాని ఇళ్లను గుర్తిస్తారు. ఒకవేళ పన్ను విధించినా విస్తీర్ణంలో తేడా ఉంటే ఆ తేడాను సరి చేస్తారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 5.85లక్షల గృహాలు ఉన్నాయి. కార్యదర్శులు పన్ను వసూలు చేస్తున్నారు. సర్వే పూర్తయితే ప్రతి ఇల్లు పన్ను పరిధిలోకి వస్తుంది. దీంతో పంచాయతీలకు ఆస్తి పన్ను రాబడి పెరుగుతుంది. 


భూరక్షతో శాటిలైట్‌ సర్వే.. : 

జగనన్న భూరక్ష పథకం ద్వారా ప్రతి గ్రామంలో శాటిలైట్‌  సర్వే చేస్తాం. ఇళ్ల కొలతలు, స్థలాల వివరాలు తెలుస్తాయి. ప్రతి ఒక్కరికీ ప్రాపర్టీకార్డు అందిస్తాం. అతని ఇళ్లు, స్థలాల విలువ ప్రాపర్టీ కార్డులో ఉంటుంది. దీంతో ఏదైనా అవసరమైనప్పుడు బ్యాంకుల ద్వారా రుణం పొందవచ్చు. పంచాయతీలకు పన్నులు సకాంలో వసూలైతే ఆ నిధులను అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తాం.

- రవికుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి

Updated Date - 2021-10-02T04:33:40+05:30 IST