రక్తం పారిన నేలపై....అభివృద్ధి జాడలు

ABN , First Publish Date - 2022-07-03T04:40:48+05:30 IST

నాడు రక్తవర్ణంగా మారిన మారిన నేల నేడు పచ్చదనంతో కళకళలాడుతూ.. అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది.

రక్తం పారిన నేలపై....అభివృద్ధి జాడలు
ములకలచెరువు మండలంలోని చౌడసముద్రం గ్రామం

రైతు కూలీ సమన్వయ సంఘం ఏర్పడిందిక్కడే...

హింసాత్మకంగా మారిన ఉద్యమం 

గాల్లో కలిసిన ఎన్నో ప్రాణాలు

నేడు పరుచుకున్న పచ్చదనం... అభివృద్ధి బాటలో పయనం


ఆ గ్రామం పేరు చెబితే అందరికీ హడల్‌. అది 1982వ సంవత్సరం. దాడులు...బాంబుల పేలుళ్లు... తుపాకీ తూటాల చప్పుళ్లు... భారీగా ఆస్తుల ధ్వంసం... ఇళ్లు తగలబెట్టుకోవడం... నిత్యం గొడవలతో ఎప్పుడేం జరుగుతుందోనని భయం..భయం. ఆ గొడవలు...బాంబులు.. వేట కత్తుల ధాటికి ఎందరో బలయ్యారు. భూమి...భుక్తి కోసం ప్రారంభమైన రాడికల్‌ ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. మరెందరో ఇళ్లు.. .భూములు వదులుకుని వలసబాట పట్టారు. నాడు రక్తవర్ణంగా మారిన మారిన నేల నేడు పచ్చదనంతో కళకళలాడుతూ.. అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. 


ములకలచెరువు, జూలై 2 : ములకలచెరువు మండలంలో చౌడసముద్రం గ్రామం ఉంది. ఇక్కడ 700లకు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ గ్రామంలో 1978లో రాడికల్‌ ఉద్యమం ప్రారంభమైంది. రాడికల్‌ ఉద్యమానికి వ్యతిరేకంగా దేశంలోనే మొట్టమొదటగా 1982లో రైతు కూలీ సమన్వయ సంఘం ఇక్కడే ఏర్పడింది. రాడికల్‌, రైతు కూలీ సమన్వయ సంఘం మధ్య జరిగిన దాడులు, ప్రతి దాడులతో ఈ ప్రాంతం అట్టుడికిపోయింది. ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పట్లో శాసనమండలి సభ్యుడు ఎ.వి.ఉమాశంకర్‌రెడ్డి, పుట్టా వెంకటరమణప్పలతో పాటు ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు ఈ పోరాటంలో తనువు చాలించారు. భారీ స్థాయిలో ఆస్తులు ధ్వంసమయ్యాయి. అంతస్థాయిలో రక్తం ఏరులై పారిన గ్రామం నేడు అభివృద్ధి బాటలో పయనిస్తోంది. ప్రజల ఆలోచనావిధానంలో మార్పు వచ్చింది. బాంబు పేలుళ్లు, తూటాల శబ్ధాలతో మార్మోగిన గ్రామం నేడు అభివృద్ధి వైపు అడుగులు వేసింది. కక్షలు వీడిన జనం ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి చెందిన యువతీ యువకులు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.


అభివృద్ధి బాటలో పయనం

రక్తం పారిన నేల అభివృద్ధి బాటలో పయనించింది. గత 15 ఏళ్లుగా క్రమేణా అభివృద్ధి చెందుతోంది. చౌడసముద్రంలో పదేళ్ల క్రితం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ఉర్దూ పాఠశాలలు ఏర్పాటు చేశారు. అలాగే ఆరోగ్య ఉపకేంద్రం, పశు వైద్యశాల ఉన్నాయి. మూరుమూల ప్రాంతమైన ఈ గ్రామంలో సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఉంది. బ్యాంకు రుణాలతో పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం పెరిగింది. వ్యవసాయ రుణాలు తీసుకుని రైతులు వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. దోస, కర్భూజా, టమోటా, దానిమ్మలతో పాటు పలు రకాల ఉద్యానవన పంటలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇక్కడి రైతులు ఇతర గ్రామాల్లో భూములను కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నారు. రోడ్లు బాగుపడ్డాయి. మొహరం ఇతర పండుగలను కలిసిమెలసి సంతోషంగా జరుపుకుంటున్నారు. 


అభివృద్ధికి అధిక ప్రాధాన్యత

- ఎ.వి.లక్ష్మీదేవమ్మ, మాజీ ఎమ్మెల్యే, తంబళ్లపల్లె

రాడికల్స్‌, వారి ప్రత్యర్థుల మధ్య జరిగిన దాడుల్లో శాసనమండలి సభ్యుడిగా ఉన్న నా భర్త ఏవీ ఉమాశంకర్‌రెడ్డిని పోగొట్టుకున్నా. తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికై రెండు పర్యాయాలు అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చా. చౌడసముద్రం గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాను. పాఠశాలల ఏర్పాటు, రహదారులు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పించా. అభివృద్ధి జరగడంతో ప్రజల్లో మార్పు వచ్చింది. 


మా కష్టం పగవారికి కూడా వద్దు

- పుట్టా శేఖర్‌గుప్తా, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌, చౌడసముద్రం  

హత్యలు, ప్రతీకార హత్యలతో అందరం తీవ్రంగా నష్టంగా నష్టపోయాం. అప్పట్లో జరిగిన గొడవల్లో రైతు కూలీ సమన్వయ సంఘం అధ్యక్షుడిగా ఉన్న మా నాన్న పుట్టా వెంకటరమణప్ప కాల్పుల్లో చనిపోయారు. మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సులో వస్తుంటే చంపేశారు. ఆ సమయంలో మా కుటుంబం పడిన ఆవేదన, కష్టం పగవారికి కూడా రాకూడదు. హింసతో సాధించేది ఏమీ లేదు. రెండుసార్లు మా కుటుంబ సభ్యులు సర్పంచులుగా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేశారు. 



Updated Date - 2022-07-03T04:40:48+05:30 IST