మన విశాఖ నాడు... నేడు

ABN , First Publish Date - 2021-03-08T05:22:32+05:30 IST

ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఒకప్పుడు నామమాత్రమైన ఓ గ్రామం. దీనిని మునిసిపాలిటీగా మార్పు చేసేందుకు అప్పటి బ్రిటిష్‌ పాలకులు యత్నించినా... అభివృద్ధికి అవసరమయ్యే పన్నుల వసూలు సాధ్యం కాదనే వాదనతో వాయిదా వేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో 1861 ఫిబ్రవరి 9న భీమిలి మునిసిపాలిటీ ఏర్పాటు కాగా, అంతకుముందే విశాఖను మునిసిపాలిటీగా మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అనుకోని అవాంతరాలతో నాలుగేళ్లు ఆలస్యంగా ఏర్పాటు చేశారు.

మన విశాఖ నాడు... నేడు
1950 నాటి విశాఖ బీచ్‌రోడ్డు

1865లో మునిసిపాలిటీగా అవతరణ 

 ఐదుగురు సభ్యులతో పాలకవర్గం

1884లో ఆరు వార్డులుగా విభజన 

1920లో తొలిసారి ఎన్నికలు 

1979లో కార్పొరేషన్‌గా మార్పు 

2005లో జీవీఎంసీగా రూపాంతరం 

 

 ఎటు చూసినా జనం... అంబరాన్ని తాకే ఆకాశహార్మ్యాలు... సువిశాలమైన వీధులు... సేద తీరేందుకు పార్కులు, పర్యాటకులను కట్టిపడేసే బీచ్‌ అందాలు... నగరానికి మణిహారంగా భారీ పరిశ్రమలు... ఇదీ మనం ప్రస్తుతం చూస్తున్న విశాఖ మహా నగరం. ఈ స్థాయికి చేరేందుకు ఎందరి కృషి ఉందో... ఎన్నేళ్లు పట్టిందో... ఈ తరానికి పూర్తిగా తెలియని పరిస్థితి. గ్రేటర్‌ విశాఖ ఎన్నికల నేపథ్యంలో మునిసిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి, జీవీఎంసీగా రూపాంతరం చెందే వరకు జరిగిన పరిణామాలను ఒకసారి అవలోకనం చేస్తే....


భీమునిపట్నం (రూరల్‌), మార్చి 6:  ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఒకప్పుడు నామమాత్రమైన ఓ గ్రామం. దీనిని మునిసిపాలిటీగా మార్పు చేసేందుకు అప్పటి బ్రిటిష్‌ పాలకులు యత్నించినా... అభివృద్ధికి అవసరమయ్యే పన్నుల వసూలు సాధ్యం కాదనే వాదనతో వాయిదా వేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో 1861 ఫిబ్రవరి 9న భీమిలి మునిసిపాలిటీ ఏర్పాటు కాగా, అంతకుముందే విశాఖను మునిసిపాలిటీగా మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అనుకోని అవాంతరాలతో నాలుగేళ్లు ఆలస్యంగా ఏర్పాటు చేశారు. 


మునిసిపాలిటీ ఏర్పాటు వెనుక యత్నాలు

మద్రాసు ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో 1858లో వలంటరీ మున్సిపల్‌ అసోసియేషన్‌గా విశాఖను ఏర్పాటు చేశారు. కానీ పూర్తిస్థాయి మునిసిపాలిటీగా గుర్తించలేదు. ఆ కాలంలో విశాఖపట్నం చిన్న కుగ్రామం. పన్నులు వసూలు చేసి, వచ్చిన ఆదాయం ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నది ఆలోచన. అయితే దీనికి కొన్ని అడ్డంకులు ఎదురవడంతో వాయిదా వేశారు. 1865లో మునిసిపాలిటీ హోదా దక్కిన అనంతరం పాలకవర్గ సభ్యులుగా అధికారులు వ్యవహరించేవారు. జిల్లా కలెక్టర్‌ ఎక్స్‌ అఫీషియో అధ్యక్షుడిగా, ముగ్గురు ప్రభుత్వ అధికారులు పరిపాలకులుగా నియమితులయ్యారు. రెండేళ్లు ఈ విధానంలోనే కొనసాగిన తరువాత మునిసిపాలిటీ ఆఫ్‌ వైజాగ్‌ పటం పేరుతో మార్పు చేశారు. అప్పటికి ఇందులో కేవలం ఐదుగురు సభ్యులుండేవారు. టౌన్‌హాల్‌ను మునిసిపల్‌ కార్యాలయంగా మార్పు చేసేందుకు నిర్ణయించారు. అయితే సభ్యులంతా ఇంగ్లీషు అధికారులే ఉండేవారు. మొదటిసారిగా సీ.ఎక్రీం చైర్మన్‌గా, ఎం.వి.ముర్రే వైస్‌చైర్మన్‌గా వ్యవహరించేవారు. మిగిలిన వారిలో ఐఎన్‌ ట్రేడర్‌, అచారంపూర్‌, ఎంఎంఏ అదేవర్‌లు సభ్యులు. వీరంతా విశాఖపట్నానికి ఏమేమి అవసరమో గుర్తించి, సమకూర్చేవారు. 1884లో పాలకవర్గాన్ని ఏర్పాటుచేసే విషయంలో కొన్ని మార్పులు చేశారు. పట్టణాన్ని ఒకే ప్రాంతంగా పరిపాలించడం కష్టమని భావించిన అధికారులు మొత్తం ఆరు వార్డులుగా విభజించారు. ప్రతి వార్డులో ఒక ప్రజాప్రతినిధి ఉండాలని, వారే వార్డు బాగోగులు చూసుకోవాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రజాప్రతినిధులను అధికారులే నియమించేవారు. ఆ తరువాతి కాలంలో వార్డు ప్రజాప్రతినిధి పేరును కౌన్సిలరుగా నామకరణం చేసి వార్డు ప్రజలే కౌన్సిలరును ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.


1920లో పూర్తిస్థాయి ఎన్నికలు

విశాఖ మునిసిపాలిటీగా 1920లో మొదటిసారి ఎన్నికలు నిర్వహించి, ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకున్నారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ప్రజలే నేరుగా ఎన్నుకోవాలన్న నిర్ణయాన్ని కూడా అప్పుడే తీసుకున్నారు. నగరాన్ని 20 వార్డులుగా విభజించి, ప్రతివార్డుకు ఒక కౌన్సిలరు ఉండేలా మార్పుచేశారు. ఆ సమయంలో టౌనుహాల్‌లో సమావేశ మందిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి ఎన్నికైన సభ్యులంతా ప్రతినెలా సమావేశం నిర్వహించి, నగరాభివృద్ధికి ఏయే పనులు చేపట్టాలో నిర్ణయించుకుని, అధికారులతో అమలు జరిపించేవారు. ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు నిర్వహించి కౌన్సిలర్లను ఎన్నుకునే పద్ధతిని అప్పుడే ప్రశేపెట్టారు. అనంతరం 1979లో విశాఖ మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా స్థాయి పెంచారు. 50 వార్డులను ఏర్పాటు చేశారు. గాజువాక మునిసిపాలిటీ, మరో 32 గ్రామాలను విలీనం చేసి విస్తరించారు. మొత్తంగా ఆరుజోన్లు ఏర్పాటు చేశారు. 2005లో గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)గా రూపాంతరం చెందింది. 2007లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 263.31 చదరపు మైళ్లతో విస్తరించి ఉన్న జీవీఎంసీని మధురవాడ, ఆశీల్‌మెట్ట, సూర్యాబాగ్‌, జ్ఞానాపురం, గాజువాక, వేపగుంట, భీమిలి, అనకాపల్లి  జోన్‌లుగా విభజించారు. దీని పరిధిలో 98 వార్డులున్నాయి.  




Updated Date - 2021-03-08T05:22:32+05:30 IST