ఒమైక్రాన్‌ వ్యాప్తిపై 5 రోజుల పరిశీలనకు కేంద్ర కమిటీ రాక

ABN , First Publish Date - 2021-12-27T14:16:58+05:30 IST

రాష్ట్రంలో కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తిపై పరిశీలన జరిపేందుకు కేంద్ర కమిటీ సభ్యులు ఆదివారం రాత్రి చెన్నైకి వచ్చినట్టు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల ‘ఒమైక్రాన్‌’

ఒమైక్రాన్‌ వ్యాప్తిపై 5 రోజుల పరిశీలనకు కేంద్ర కమిటీ రాక

                            - నేటి నుంచి అధికారులతో చర్చలు


చెన్నై: రాష్ట్రంలో కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తిపై పరిశీలన జరిపేందుకు కేంద్ర కమిటీ సభ్యులు ఆదివారం రాత్రి చెన్నైకి వచ్చినట్టు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల ‘ఒమైక్రాన్‌’ కేసులు బయటపడటంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆరోగ్యశాఖ అధికారులతో ఆ వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో రెండు రోజుల ముందు చర్చలు జరిపారు. వైద్యనిపుణుల కమిటీ సూచనలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత ‘ఒమైక్రాన్‌’ కేసులు అధికంగా ఉన్న తమిళనాట పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని పంపనున్నట్టు ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. ఆ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖకు చెందిన వైద్యనిపుణులు డాక్టర్‌ వినితా, డాక్టర్‌ పర్పుసా, డాక్టర్‌ సంతోష్‌కుమార్‌, డాక్టర్‌ దినేష్‌బాబుతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సభ్యులు ఐదురోజులపాటు బసచేసి, రాష్ట్రంలో ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తిపై, ఆ వైరస్‌ నిరోధానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలు గురించి, ముందస్తుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైరస్‌ బాధితులకు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేకవార్డులు, సమకూరుస్తున్న వైద్యపరికరాల సదుపాయాలు గురించి పరిశీలన జరుపనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లపై కమిటీ సభ్యులు అధ్యయనం చేయనున్నారు. జనవరి మూడు నుంచి 15-18 యేళ్లలోపు వారికి టీకాలు వేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు గురించి కమిటీ సభ్యులు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జే రాధాకృష్ణన్‌తో చర్చలు జరుపున్నారు. అదే సమయంలో కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో భేటీ అవుతారని తెలుస్తోంది.

Updated Date - 2021-12-27T14:16:58+05:30 IST