జనవరిలో ఒమైక్రాన్‌ తీవ్రరూపం

ABN , First Publish Date - 2021-12-25T17:27:50+05:30 IST

రాష్ట్రంలో జనవరి నెలాఖరుకు ఒమైక్రాన్‌ తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని కొవిడ్‌ సాంకేతిక కమిటీ హెచ్చరించింది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమైక్రాన్‌ ఇప్పటికే పలు దేశాలను బెంబేలెత్తిస్తోందని

జనవరిలో ఒమైక్రాన్‌ తీవ్రరూపం

                   - రాష్ట్ర కొవిడ్‌ సాంకేతిక కమిటీ హెచ్చరిక


బెంగళూరు: రాష్ట్రంలో జనవరి నెలాఖరుకు ఒమైక్రాన్‌ తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని కొవిడ్‌ సాంకేతిక కమిటీ హెచ్చరించింది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమైక్రాన్‌ ఇప్పటికే పలు దేశాలను బెంబేలెత్తిస్తోందని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ సుదర్శన్‌ బల్లాళ్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలోని పలు రాష్ట్రాలలో ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఒకేరోజు 12 కేసులు రావడం ఆలోచించే విషయమన్నారు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో తీవ్రప్రభావం చూపుతోందని ఇదే పరిస్థితి భారత్‌లోనూ చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువన్నారు. రాష్ట్రంలో జనవరి ఆఖరుకు కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. వాస్తవానికి నవంబరు, డిసెంబరులోనే మూడో విడత కొవిడ్‌ వస్తుందని అంచనా వేశామని అయితే పలు జిల్లాల్లో జీరోలు కొనసాగడం ఆశించదగిన అంశమన్నారు. వ్యాక్సినేషన్‌పై ప్రజలు చైతన్యవంతులయ్యారన్నారు. ఒమైక్రాన్‌ తీవ్రతపై వైద్య నిపుణులు అశ్విన్‌ కులకర్ణి మాట్లాడుతూ కొవిడ్‌ తొలివిడతతో పోలిస్తే ఒమైక్రాన్‌ వేగవంతంగా ప్రబలుతుందని, అయితే తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది చెప్పలేమన్నారు. దక్షిణాఫ్రికాలో కేసులు పెరిగినా రోగం తీవ్రత సాధారణంగా ఉందన్నారు. తొలి రెండు విడతల తరహాలో ఒమైక్రాన్‌ పరిణామం ఉంటుందా.. లేదా.. అనేది ఇప్పుడిప్పుడే చెప్పలేమన్నారు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. 

Updated Date - 2021-12-25T17:27:50+05:30 IST