కోబ్రా కమాండో విడుదల కోసం ప్రార్థిస్తున్నా: ఒమర్ అబ్దుల్లా
ABN , First Publish Date - 2021-04-08T19:47:49+05:30 IST
మావోయిస్టుల చెరలో ఉన్న సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ క్షేమంగా విడుదల కావాలని కోరుతూ..
శ్రీనగర్: మావోయిస్టుల చెరలో ఉన్న సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ క్షేమంగా విడుదల కావాలని కోరుతూ ప్రార్థనలు చేస్తున్నట్టు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. జమ్మూకి చెందిన రాకేశ్ సింగ్ మన్హాస్... శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్లకు చిక్కిన విషయం తెలిసిందే. నక్సలైట్లు జరిపిన ఈ మెరుపుదాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా... మరో 30 మందికి పైగా గాయపడ్డారు. కాగా మావోయిస్టులకు చిక్కిన రాకేశ్ సింగ్ విడుదలపై ఇప్పటికీ సందిగ్ధం కొనసాగుతోంది. ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే జవానును విడుదల చేస్తామని మావోయిస్టులు ఇప్పటికే ఓ లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లో ట్విటర్లో స్పందిస్తూ... ‘‘రాకేశ్ సింగ్ మన్హాస్ క్షేమంగా విడుదల కావాలనీ, సాధ్యమైనంత త్వరగా తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవాలని ప్రార్థనలు కొనసాగిస్తున్నాం...’’ అని ఆయన పేర్కొన్నారు.