ఆమె గెలుపులో మనవాడు..!

ABN , First Publish Date - 2021-07-25T05:31:59+05:30 IST

మీరాబాయి చాను..ఇప్పుడా పేరు విననివారూ..

ఆమె గెలుపులో మనవాడు..!
చానూకి శిక్షణలో తంబి

ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మీరాబాయి చాను

ఫిజియాలజి ఎగ్జామినర్‌గా జిల్లా వాసి తంబి


ఏలూరు(ఆంధ్రజ్యోతి): మీరాబాయి చాను..ఇప్పుడా పేరు విననివారూ, తెలియనివారూ ఈ దేశంలో ఎవరూ ఉండకపోవచ్చు. టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో రజత పతకం కైవసం చేసుకుని భరత మాత మెడలో అలంకరించిన మణిపురి మణిపూస ఆమె. విశ్వవిజేతగా నిలిచిన ఆమె గెలుపులో పెదవేగి మండలం వంగూరు గ్రామానికి చెందిన తంబి కూడా భాగమయ్యారు. ఒలింపిక్‌ విజేత మీరాబాయి చానూకు ఫిజియాలజి ఎగ్జామినర్‌గా ఉంటూ అడుగడుగునా ఆమెకు పరీక్షలు పెట్టి శరీర ధర్మాలను పసిగట్ట్టి, శక్తిసామర్థ్యాలను సానబెట్టిన గురుతర శాస్త్రవేత్త మన తంబి. ప్రతి క్రీడాకారుకీ ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఒలింపిక్స్‌కు వెళ్లే అంతర్జాతీయ క్రీడాకారుల విషయంలో అది మరీ కీలకం. ఒక కిలో బరువు పెరిగినా, అరకిలో బరువు తగ్గినా ప్రమాదమే!


అందుకోసం మొత్తం ఆరు విభాగాల నిపుణులు కలిసి పనిచేయాలి. వారందరికీ తగిన సమాచారం ఇచ్చేది మాత్రం ఫిజియాలజి శాస్త్రవేత్తలే. క్రీడలను బట్టి ఎప్పటికప్పుడు వారికి తగిన పరీక్షలు పెడుతూ ఉంటారు. బరువు ఆధారంగా జరిగే వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో ఈ పరీక్షలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. అందుకే మీరాబాయి చానూను ఆయన నీడలా కాచుకుంటూ వచ్చారు. 49 కిలోల విభాగంలో పోటీ పడేందుకు తగిన సామర్థ్యాలను సాధించడంలో తోడ్పాటు నందించారు. పటియాలా నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ స్పోర్ట్స్‌ పటియాలా విభాగంలో ఫిజియాలజి సైంటిస్టుగా ఉన్న తంబి ఆమె శక్తిసామర్థ్యాలను గుర్తించారు. కోచ్‌కు తెలియజేసి తగు సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. అందుకు తగినట్లుగానే శిక్షణ సాగింది. ఆమె ఒలింపిక్స్‌ పతకాన్ని సాధించింది. 


వంగూరు నుంచి టోక్యో వరకూ ..

వంగూరుకు చెందిన మెడబాల నకులుడు, నాగమణి దంపతులకు తంబి జన్మించారు. స్థానిక పాఠశాలలో విద్య నభ్యసించిన ఆయన ఏలూరు సీఆర్‌ఆర్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఆశ్రం వైద్య కళాశాలలో శరీరధర్మశాస్త్రం (ఫిజియాలజీ)లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2013లో ఎయిమ్స్‌ ఎంట్రన్స్‌లో ఫిజియాలజీ విభాగంలో ఫస్టు ర్యాంకు సాధించారు. 2014లో యూపీఎస్సీ ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో జూనియర్‌ సైంటిస్టుగా నియమితులయ్యారు. అప్పటి నుంచి పటియాలా నేషనల్‌ అకాడమీలో విధులు నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2021-07-25T05:31:59+05:30 IST