శారదా నదిలో పడి వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2022-08-09T06:57:45+05:30 IST

మండలంలోని జుత్తాడ గ్రామానికి చెందిన వృద్ధురాలు కరణం చినతల్లి(66) శారదానదిలో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందింది.

శారదా నదిలో పడి వృద్ధురాలి మృతి
కరణం చినతల్లి(ఫైల్‌)


చోడవరం, ఆగస్టు 8: మండలంలోని జుత్తాడ గ్రామానికి చెందిన వృద్ధురాలు కరణం చినతల్లి(66) శారదానదిలో ప్రమాదవశాత్తూ పడి  మృతిచెందింది. ఆదివారం ఉదయం ఆమె బహిర్భూమికి శారదానది ఒడ్డుకు వెళ్లింది. ప్రమాదవశాత్తూ కాలు జారి నదిలో పడి గల్లంతయ్యింది. అయితే వృద్ధురా లు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యు లు గ్రామంలోనూ, చుట్టుపక్కల గ్రామాల్లో వెతికారు. అయితే మంగళవారం సాయంత్రం వృద్ధురాలి మృతదేహం భోగాపురం గ్రామ సమీపంలోని శారదానదిలో తేలడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, చినతల్లిగా గుర్తించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మంగళవారం సాయంత్రం నదిలోని చినతల్లి మృతదేహం బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇసుక గుంతలే కారణమా?

శారదా నదిలో చినతల్లి మృతికి కారణం నది ఒడ్డున విచ్చలవిడిగా తవ్విన ఇసుక గుంతలే కారణమని గ్రామస్థులు భావిస్తున్నారు. బహిర్భూమి కోసం వెళ్లిన చినతల్లి తొలుత ఇసుక గుంతలో పడిపోగా, ఆ తరువాత నదిలో పెరిగిన ప్రవాహ ఉధృతితో కొట్టుకుపోయి మృతిచెంది ఉండవచ్చని అంటున్నారు. నదిలో ఇసుక తవ్వకాలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.  

Updated Date - 2022-08-09T06:57:45+05:30 IST