అప్పులు అధికమై... బతుకు భారమై..

ABN , First Publish Date - 2020-10-17T21:05:24+05:30 IST

ఆర్థిక సమస్యలను చూసి భయపడ్డారో... బిడ్డలకు భారమ వుతున్నామని బాధ పడ్డారో... వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అందరితో కలివిడిగా ఉండే ఆ జంట..

అప్పులు అధికమై... బతుకు భారమై..

ఉరి వేసుకొని వృద్ధ దంపతుల ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యమే కారణం


విజయనగరం(ఆంధ్రజ్యోతి): ఆర్థిక సమస్యలను చూసి భయపడ్డారో... బిడ్డలకు భారమ వుతున్నామని బాధ పడ్డారో... వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అందరితో కలివిడిగా ఉండే ఆ జంట.. ఇంతలోనే విగతజీవులుగా మారడాన్ని చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. విజయ నగరం జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. మద్దిల రాము (67), ఆయన భార్య సీత (60) స్థానిక బలిజివీధిలో ఉంటున్నారు. శుక్రవారం ఇంట్లోని ఫ్యాన్లకు వేర్వేరుగా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. రాము స్థానికంగా ఉండే ఓ వస్త్ర దుకాణంలో పనిచేసేవారు. అనారోగ్యం కారణంగా రెండేళ్ల నుంచి ఇంటి వద్దనే ఉంటున్నారు. సీత స్థానిక మహిళలతో కలిసి చీటీల పాట నిర్వహించేవారు. వీరికి చిన్ని, రవి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ వస్త్ర దుకాణాల్లో పని చేస్తున్నారు. 


వీరికి వివాహాలు జరగగా కుటుంబాలతో నివాసముంటున్నారు. రెండేళ్లుగా అనారోగ్యంతో రాము బాధ పడుతుండడంతో వైద్య ఖర్చులు, ఇంటి అవసరాలకుగాను సీత చీటీల నగదును వినియోగించింది. చీటీలు కట్టిన వారు ఒత్తిడి చేయడంతో కుమారులు కొందరికి కొంతమొత్తం చెల్లించారు. మిగిలిన వారికి కొద్దిరోజుల్లో ఇచ్చేందుకు సమ్మతించారు. అటు భర్త అనారోగ్యం... ఇటు ఆర్థిక ఇబ్బందులు వెంటాడడంతో పాటు కుమారులకు భారమవుతున్నామని భార్యాభర్తలు మనస్థాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో దంపతులు ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇంట్లో వేర్వేరు ఫ్యాన్‌లకు చీరలతో ఉరి వేసుకొని అఘాయిత్యానికి పాల్పడ్డారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. తల్లిదండ్రుల మృతదేహాల వద్ద కుమారులు చిన్ని, రవి కన్నీమున్నీరయ్యారు. మృతదే హాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుమారులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - 2020-10-17T21:05:24+05:30 IST