Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒక్కేసి పువ్వేసి చందమామ..

జిల్లావ్యాప్తంగా భక్తిప్రపత్తులతో సద్దుల బతుకమ్మ
తీరొక్క పూలను పేర్చి బతుకమ్మల ముస్తాబు
పసుపు, కుంకుమలతో గౌరమ్మకు ప్రత్యేక పూజలు
ఆకట్టుకున్న మహిళలు, యువతుల కోలాటాలు
స్థానిక చెరువులు, కుంటలలో నిమజ్జనం
ఎమ్మెల్సీ కవిత మెట్టినింట బతుకమ్మ సందడి
ఆటపాటలతో అంబరాన్నంటిన సంబురాలు
ముగిసిన పూల పండగ

నిజామాబాద్‌ కల్చరల్‌, అక్టోబరు 13: ‘ఒక్కేసి పువ్వేసి చందమామ..’, ‘రామ రామనే ఉయ్యాలో.. రాముని సీతమ్మ ఉయ్యాలో..’, ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోలు.. నీ బిడ్డ దొరసాని’ అంటూ జిల్లావ్యాప్తంగా మహిళలు బుధవారం సద్దుల బతుకమ్మను జరుపుకున్నారు. పది కాలాల పాటు చల్లగా చూడమని కోరుకుంటూ బతుకమ్మలను స్థానిక చెరువులు, కుంటలలో నిమజ్జనం చేశారు. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన పూల పండగ.. చివరి రోజైన సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని మహిళలు ఆటపాటలతో నిర్వహించుకున్నారు. బతుకమ్మను తొమ్మిది అంతరాలుగా వివిధ రకాల పూలతో పేర్చి.. అందులో గౌరమ్మను ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతియేటా ఇలానే మా చేత పూజలు నిర్వహించుకుని మమ్మల్ని పాడి పంటలతో సంతోషంగా ఉండేటట్లు ఆశీస్సులు అందజేయమని వేడుకుంటు గౌరమ్మను ఆరాదించారు. అమ్మకు ప్రీతికరమైన ఐదు రకాల సద్దులను నైవేద్యంగా సమర్పించుకుని ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి, పుచ్చుకున్నారు. ఆ తర్వాత బతుకమ్మ బతుకమ్మ వెళ్లిరావమ్మ అంటూ బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేశారు. దీనిలో భాగంగా జిల్లాకేంద్రంలోని బొడ్డెమ్మ చెరువు, నీలకంఠేశ్వర ఆలయం, నాగారం బతుకమ్మ కుంట, వినాయక్‌నగర్‌లోని వినాయకుల బావి, పూలాంగ్‌, పద్మానగర్‌లోని వాగు, వాసవీ కన్యకాపరమవేశ్వరి ఆలయం, హమాల్‌వాడి సాయిబాబా ఆలయం, నగరేశ్వరీ ఆలయం, పెద్దరాంమందిర్‌, శ్రీనగర్‌లోని బాలహనుమాన్‌, ఎల్లమ్మగుట్టలోని ఎల్లమ్మ దేవాలయంతో పాటు  ఆయా గ్రామాల్లోనూ మహిళలు పెద్దఎత్తున బతుకమ్మ ఆటలు ఆడి గౌరమ్మను పూజించారు.
మెట్టినింట బతుకమ్మ ఆడిన కవిత
నిజామాబాద్‌ అర్బన్‌: మెట్టినిల్లు నిజామాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం నగరంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో గల తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మొదట గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం కుటుంబ సభ్యులు, స్థానిక మహిళా నాయకుతో కలిసి కవిత బతుకమ్మను పేర్చారు. అనంతరం పెద్దఎత్తున హాజరైన మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. ఈ సందర్భంగా కమిత మాట్లాడతూ  బతుకమ్మకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచూర్యం ఉందని, అందుకు నిరంతరం మరింత కృషి చేస్తామన్నారు. ఈ నెల 23న దుబాయిలో బతుకమ్మ పండగపై ప్రత్యేక కార్యక్రమా లు నిర్వహించ తలపెట్టామని, దీనికి ఆస్కార్‌ విజేత ఏఆర్‌.రెహమాన్‌ హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు బతుకమ్మ పండగను జరుపుకోడానికి కోర్టుకు వెళ్లామని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. దీనిలో భాగంగా బతుకమ్మను అధికారికంగా జరపడం, బతుకమ్మ చీరల పంపిణీ, తంగేడు పువ్వును రాష్ట్ర పువ్వుగా గుర్తించడం.. ఇవన్నీ ఆడ బిడ్డల కు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. అలాగే, ఏఆర్‌.రెహమాన్‌ రూపొందించిన బతుకమ్మ పాట ద్వారా ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండగపై మరోసారి చర్చ జరిగిందన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్‌ సభ్యురాలు సుదం లక్ష్మి, మేయర్‌ దండు నీతూకిరణ్‌, కలెక్టర్‌ సతీమణి మనీషా, సీపీ కార్తికేయ సతీమణి, జడ్పీ చైర్మన్‌ సతీమణి అనసూయ, మహిళా ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.
 స్పీకర్‌, మంత్రి, ప్రముఖుల శుభాకాంక్షలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని, జిల్లా మహిళలు అందరికీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను తెలిపారు. బతుకమ్మను ఉమ్మడి జిల్లా ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని, దేశంలో పూల ను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండగ అని వారు కొనియాడారు. వీరితో పాటు ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి, డీ.శ్రీనివాస్‌, ఎంపీ అర్వింద్‌,  ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్త, జీవన్‌రెడ్డి, షకీల్‌అమిర్‌, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌, వీజీగౌడ్‌, జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, మేయర్‌ నీతూకిరణ్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయతో పటు పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులు ప్రజలకు బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement
Advertisement