Odisha: స్కూలు ఫీజు కట్టలేదని లైబ్రరీలో విద్యార్థుల లాకప్

ABN , First Publish Date - 2022-08-24T22:21:47+05:30 IST

స్కూలు ఫీజు కట్టలేదనే కారణంగా విద్యార్థులను లైబ్రరీలో అక్రమంగా నిర్బంధించిన

Odisha: స్కూలు ఫీజు కట్టలేదని లైబ్రరీలో విద్యార్థుల లాకప్

భువనేశ్వర్: స్కూలు ఫీజు కట్టలేదనే కారణంగా విద్యార్థులను (School children) లైబ్రరీలో అక్రమంగా నిర్బంధించిన (Detention) ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అమానుష చర్య వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా పిల్లల తల్లిదండ్రులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వరుస ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ పాఠశాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి (CEO), వైస్ ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌పై కేసులు నమోదు చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ (Bhubaneswar)లోని అపీజయ్ పాఠశాల (Apeejay)లో మంగళవారంనాడు ఈ ఘటన చోటుచేసుకుంది. లైబ్రరీలో ఐదు గంటల సేపు నిర్బంధంలో ఉంచారనే కారణంగా నిందితులపై ఐపీసీ సెక్షన్ 342, 34, జువనైల్ జస్టిస్ యాక్ట్‌లోని సెక్షన్ 75 కింద పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.


అపీజయ్ పాఠశాలలో 3 నుంచి 9వ తరగతి చదువుతున్న 34 మంది విద్యార్థులను వారి టీచర్లు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకూ నిర్బంధంలో ఉంచారని పిల్లల తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్కూలు నుంచి ఇంటికి తిరిగివచ్చిన తన కుమారుడు ఎంతో డిప్రెషన్‌తో కనిపించినట్టు 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. ''పాఠశాలలో పరీక్ష రాసిన తర్వాత తనతో పాటు 33 మంది విద్యార్థులను ఒక రూమ్‌లోకి టీచర్లు తీసుకువెళ్లినట్టు మా అబ్బాయి చెప్పాడు. ఫ్యాన్లు ఆపేసి, కారణం కూడా చెప్పకుండా అక్కడే కూర్చోబెట్టారు. స్కూలుకు సుమారు 100 మీటర్ల దూరంలో నేను ఉన్నారు. వాళ్లు నాకు ఫోన్ చేసి చెప్పి ఉండొచ్చు. సాయంత్రమే నేను ఫీజు కట్టేశాను. స్కూలు యాజమాన్యం చేసిన పని క్రిమినల్ చర్య అనే విషయం నాకు తెలిసినందున నేను మా అబ్బాయి కోసం స్కూలుకు వెళ్లలేదు'' అని వారు తెలిపారు. మరో పేరెంట్ మాట్లాడుతూ, తన కుమార్తె 4వ తరగతి చదువుతోందని, ఫీజు బకాయిల విషయమై తనకు ఈనెల 15న ఇ-మెయిల్ వచ్చిందని, స్కూలు నుంచి పాప ఇంటికి వచ్చిన తర్వాతే వాళ్లని నిర్బంధించిన విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. యాజమాన్యం చేసిన పని తప్పని, సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకువెళ్తానని అన్నారు.


కాగా, తొమ్మిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి తండ్రి మాట్లాడుతూ, సోమవారమే పిల్లవాడి ఫీజు కట్టేసినప్పటికీ తన కుమారుడిని స్కూలులో నిర్బంధించారని వాపోయారు. ఇలాంటి శిక్షలు ఉంటాయని స్కూలులో చేర్చుకునేటప్పుడు తమతో చెప్పలేదని, మరో ఏడాదిలో పదో తరగతి పరీక్షలు ఉన్నందున అబ్బాయిని వేరే పాఠశాలలో చేరుస్తానని చెప్పాడు.  మరో విద్యార్థి తల్లి మాట్లాడుతూ, పాఠశాలలో 900 మంది స్టూడెంట్లు ఉన్నారని, కేవలం 30 మంది ఫీజులు బకాయి పడినంత మాత్రాన వారిపై ఇంత దాష్టీకం ప్రదర్శిస్తారా అని మండిపడింది. కోవిడ్ సమయంలో ఒడిశాలోని అన్ని ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు తగ్గించినప్పటికీ అపీజయ్ పాఠశాల మాత్రం ఫీజులు తగ్గించలేదని, ఈ ఏడాది 15 శాతం ఫీజులు కూడా పెంచారని వాపోయింది. ఐదు గంటల నిర్బంధంలో తమ పిల్లవాడు యూరిన్ వెళ్లేందుకు కూడా అనుమతించలేదని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు.


తల్లిదండ్రుల ఫిర్యాదులు నమోదు 

విద్యార్థుల తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌లను రికార్డు చేసుకున్నట్టు భువనేశ్వర్ డీసీపీ ప్రతీక్ సింగ్ తెలిపారు. ఘటన జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజ్‌ను తనిఖీ చేస్తామని, లైబ్రెరియన్, ఇతర టీచర్ల స్టేట్‌మెంట్లు రికార్డు చేసి, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, వైస్ ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించనున్నామని చెప్పారు.


భగ్గుమన్న బాలల హక్కుల చైర్‍‌పర్సన్

ఐదు గంటల సేపు 34 మంది విద్యార్థులను నిర్బంధంలో ఉంచిన ఘటనపై ఒడిశా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ సంధ్యాబాటి ప్రధాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా భయంకరమైన నేరమని, దీనిపై ఫిర్యాదు నమోదైతే కమిషన్ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. స్కూలు అధికారులు దోషులని తేలితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ ఘటనను పేరెంట్స్ సంస్థ ఒడిశా అభిభబక్ మహాసంఘ్ ఖండించింది. జువనైల్ జస్టిస్ చట్టాన్ని అపీజయ్ స్కూలు ఉల్లంఘించిందని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇలాంటి చర్యలకు యాజమాన్యాలు పాల్పడకూడదని తెలిపింది. ఫీజులకు సంబంధించిన అంశం ఏదైనా ఉంటే తల్లిదండ్రులకు చెప్పాలే కానీ ఇలాంటి పనులకు పాల్పడకూడదని మహాసంఘ్‌కు చెందిన బసుదేవ్ భట్ట అన్నారు.

Updated Date - 2022-08-24T22:21:47+05:30 IST