ఏడు రాష్ట్రాల్లో 14 పెళ్లిళ్లు చేసుకున్న ఘనడు.. అతను ఎలాంటి వారిని టార్గెట్ చేస్తాడంటే..

ABN , First Publish Date - 2022-02-15T17:45:44+05:30 IST

అతను నిత్య పెళ్లి కొడుకు.. వయసు 54.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటికి 14 సార్లు పెళ్లిళ్లు చేసుకున్నాడు..

ఏడు రాష్ట్రాల్లో 14 పెళ్లిళ్లు చేసుకున్న ఘనడు.. అతను ఎలాంటి వారిని టార్గెట్ చేస్తాడంటే..

అతను నిత్య పెళ్లి కొడుకు.. వయసు 54.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటికి 14 సార్లు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. మధ్యవయసు మహిళలను, విడాకులు తీసుకున్న స్త్రీలను టార్గెట్ చేస్తుంటాడు.. తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి పెళ్లి చేసుకుంటాడు.. వారి నుంచి భారీగా కట్నం తీసుకుని మరో రాష్ట్రానికి వెళతాడు.. ఇలా గత 20 ఏళ్లలో 14 పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఒకరికి తెలియకుండా మరొకరిని వివిధ రాష్ట్రాల్లో ఉంచి ఇంతకాలం మేనేజ్ చేశాడు.. చివరకు అసలు విషయం బయటపడడంతో కటకటాల పాలయ్యాడు.


ఒడిశాకు చెందిన బిధు ప్రకాష్ స్వైన్‌(54) అనే వ్యక్తి తాను డాక్టర్‌నని చెప్పుకుంటూ వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలను పెళ్లి పేరుతో మోసం చేశాడు. ఇతను 1982లో మొదటి సారి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ తాను కేంద్ర వైద్యారోగ్య శాఖలో డాక్టర్‌నని చెప్పి మరో 13 సార్లు పెళ్లిళ్లు చేసుకున్నాడు. బాగా చదువుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న మధ్యవయసు మహిళలను, విడాకులు తీసుకున్న మహిళలను మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా సంప్రదించి వివాహాలు చేసుకున్నాడు. 


అలా పంజాబ్, ఢిల్లీ, అసోం, ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన మహిళలను పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత కొద్దిరోజులు వారి వద్దే ఉండి తరువాత పని మీద భువనేశ్వర్‌కు వెళతున్నానని చెప్పి వెళ్లిపోయేవాడు. 2021 జూలైలో ఢిల్లీకి చెందిన ఓ టీచర్‌ను కూడా అలాగే పెళ్లి చేసుకుని కొద్ది రోజుల తర్వాత ఆమెను వదలి వెళ్లిపోయాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్వేషణ సాగించిన పోలీసులు భువనేశ్వర్‌ వెళ్లి అతణ్ని అరెస్టు చేశారు. విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. మరో 13 మంది మహిళలను మోసగించినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-02-15T17:45:44+05:30 IST