ఉదయగిరి రోడ్డులో ఆక్రమణలు

ABN , First Publish Date - 2020-07-10T11:06:50+05:30 IST

పట్టణంలోని ఉదయగిరి రోడ్డులో విశ్వోదయ స్కూలు పక్కన ఉన్న రోడ్డు మార్జిన్‌ను కొందరు యథేచ్ఛగా ..

ఉదయగిరి రోడ్డులో ఆక్రమణలు

ఆక్రమణల కట్టడిలో అధికారుల వైఫల్యం


కావలి, జూలై9: పట్టణంలోని ఉదయగిరి రోడ్డులో విశ్వోదయ స్కూలు పక్కన ఉన్న రోడ్డు మార్జిన్‌ను కొందరు యథేచ్ఛగా ఆక్రమిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు తమకు ఆదాయ వనరుగా వాటిని ఆక్రమించి అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. రోడ్డు పక్కన వ్యాపారాలకు అనుకూలమైన స్థలాన్ని ఆక్రమించి తాత్కాలికంగా షెడ్లను నిర్మించారు.  బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఆ షెడ్లు కూలాయి. రోడ్డుపక్కన ఉన్న ఆ షెడ్లను చూసి పలువురు ఖంగుతిన్నారు. పట్టణంలో రైతుబజారు ప్రాంతం రద్దీగా ఉన్నందున రైతుబజారును తాత్కాలికంగా ఇక్కడ తరలించేందుకు నిర్మాణాలు చేపడుతున్నారనే ప్రచారం ఉంది. రైతుబజారు నిర్మాణాలు ఇప్పటివరకు మునిసిపాలిటీనే చేపడుతూ వచ్చింది.


కానీ  మున్సిపల్‌ అధికారులు ఆ నిర్మాణాలకు తమకు సంబంధం లేదంటూ చెబుతున్నారు.  ఎక్కడైనా చిన్న ఆక్రమణ కనిపిస్తే వాటిని తొలగించే మున్సిపల్‌ అధికారులు రోడ్డు పక్కన భారీగా ఆక్రమణ జరుగుతున్నా పట్టించుకోకపోవడం విశేషం. కొంత మంది అధికార పార్టీ వారే తాత్కాలికంగా నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఇకనైనా మునిసిపల్‌ అధికారులు ఈ ఆక్రమణపై విచారించి షెడ్లను తొలగించాలంటూ కోరుతున్నారు.  


ఆక్రమణల విషయం తెలియదు..బీ శివారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌

రోడ్డు పక్కన ఎవరు ఆక్రమిస్తున్నారో తమకు తెలియదు. ట్రంకురోడ్డులో ఉన్న రోడ్డు మార్జిన్‌ దారులను పట్టణ శివారు ప్రాంతాలకు వెళ్లమన్నాం. ఆక్రమణలు ఎవరు చేస్తున్నారో గుర్తించి వారికి ఆక్రమణ పన్నులు విధిస్తాం.

Updated Date - 2020-07-10T11:06:50+05:30 IST