Advertisement
Advertisement
Abn logo
Advertisement

అడవుల ఆక్రమణ

- అటవీ భూములు యథేచ్ఛగా ఆక్రమణలు

- పోడు భూముల పట్టాతో అడవులను దున్నేస్తున్న ఆక్రమణదారులు

- కబ్జాలకు పాల్పడుతున్న వైనం

- ఇటీవల కాలంలో ఐదు చోట్ల 12 ఎకరాల్లో అటవీ భూముల ఆక్రమణ

- జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవులు

- ఇందులో అన్యాక్రాంతం అయినవి మొత్తం అటవీ భూములు 25వేల ఎకరాల్లోనే..

- అటవీ అధికారులు దాడులు చేస్తున్నా ఆగని ఆక్రమణలు

- జిల్లాలో కనుమరుగవుతున్న అడవులు

- అటవీహక్కుల చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేసేందుకు చర్యలుు

కామారెడ్డి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అటవీ భూముల ఆక్రమణదారులు, స్మగ్లర్ల గొడ్డలి వేటుకు అడవులు కనుమరుగవుతున్నాయి. భవిష్యత్తు తరాలకు అడవులను మిగిల్చకుండా భూ ఆక్రమణదారులు అడవులను యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నారు. పంటల సాగు పేరిట ప్రకృతి సంపదైన అటవీ భూములను కొల్లగొడుతున్నారు. దీంతో జిల్లాలో రోజురోజుకూ అడవులు కనుమరుగవుతున్నాయి. ప్రస్తుతం 22శాతం మాత్రమే అడవులు ఉన్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా అటవీశాఖ దాడులు చేస్తున్నా అటవీ భూములు ఆక్రమణకు గురవుతునే ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 25వేల ఎకరాలకు పైగా అటవీ భూములు కబ్జాలు అయినట్లు ఆ శాఖ అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆక్రమణదారులు అటవీ భూములపై పడినట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా భావించి అటవీ భూములను ఆక్రమించుకునేందుకు ఆక్రమణదారులు ప్రయత్నాలు చేపడుతుండడం జిల్లాలో జరుగుతున్న సంఘటనలే నిదర్శనం. ఇటీవల కాలంలో జిల్లాలో ఐదు మండలాల్లో సుమారు 12 ఎకరాలకు పైగా అటవీ భూములను ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆక్రమణలను అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగం అటవీహక్కుల చట్టాలను మరింత కఠినంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. 

జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో విస్తరించిన అటవీ ప్రాంతం

కామారెడ్డి జిల్లాలో 2,05,570 ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. జిల్లాలో మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్‌, గాంధారి, లింగంపేట్‌, తాడ్వాయి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌, నిజాంసాగర్‌, బాన్సువాడ, జుక్కల్‌, మద్నూర్‌, బిచ్కుంద, నస్రూల్లాబాద్‌ తదితర మండలాల్లో అటవీ ప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉంది. ప్రాంతాల్లో దట్టమైన అడవులతో పాటు, విలువైన అటవీ సంపద ఉంది. ఇప్పటికే పోడు భూముల పేరిట వేలాది ఎకరాలు అటవీ భూమి ఆక్రమణకు గురి కాగా, కొందరు కలప స్మగ్లర్ల గొడ్డలి వేటుకు అటవీ సంపదను కొల్లగొట్టారు. మరికొందరు మైనింగ్‌ మాఫియా గుట్టల్లో తవ్వకాలు చేపట్టడంతో అటవీ సంపద తరిగిపోతూ వచ్చింది. ఇలా జిల్లాలో అడవులు కనుమరగవుతున్నాయి. ప్రస్తుతం 22 శాతం మాత్రమే అడవులు ఉన్నాయని వాటిని కాపాడుకునేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే అటవీహక్కుల చట్టాన్ని కాపాడేందుకు అటవీహక్కు పరిరక్షణ సమితిలను ఏర్పాటు చేస్తున్నారు. 

పోడు భూముల పేరిట ఆక్రమణలు

రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలో గత నెలరోజుల నుంచి పోడు భూముల కోసం అధికార యంత్రాంగం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే పోడు భూముల చాటున ఆక్రమణదారులు అటవీ భూములను మరింత ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో అటవి విస్తరించి ఉన్న ప్రాంతాలపై కొందరు ఆక్రమణదారులు, కబ్జాదారుల కన్ను అటవీ భూములపై పడింది. ముఖ్యంగా తండాల సరిహద్దులో అటవీ భూములు ఎక్కువగా కబ్జాఅవుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగో ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తున్నందున ఇదే అదనుగా భావించి అటవీ భూములను కబ్జాల్లోకి వెళ్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని చెట్లను నరికి వేసి ట్రాక్టర్లతో ఆ భూములను చదును చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత నాలుగు రోజుల కిందట లింగంపేట మండలంలోని వెల్లుట్ల అటవీ సెక్టార్‌ పరిధిలో గల 801 కంపార్ట్‌మెంట్‌ పరిధిలో అటవీ భూమిని అర్థరాత్రి కొందరు ఆక్రమణదారులు ట్రాక్టర్లతో చదును చేసి దున్నేందుకు ప్రయత్నించారు. దీనిని అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్‌ అధికారులపై ఆక్రమణదారులు ఎదురుదాడికిదిగిన సంఘటన చోటు చేసుకుంది. ఇలా పంటల సాగు చాటున, పోడు భూముల పేరిట అటవీ భూములను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు.

ఇటీవల జిల్లాలో 12 ఎకరాల్లో అటవీ భూమి కబ్జా

పోడు భూములకు పట్టాలు ఇస్తున్నారన్న ప్రచారంతో కొందరు ఆక్రమణదారులు అటవీ భూములను కబ్జా చేస్తున్నట్లు తెలుస్తోంది. నెలరోజుల వ్యవధికాలంలోనే జిల్లాలో పలు ప్రాంతాల్లో అటవీ భూములను కబ్జా చేసేందుకు యత్నించినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నస్రుల్లాబాద్‌ అటవీ ప్రాంతంలో 2.50 ఎకరాలు, గాంధారిలో 2.50 ఎకరాలు, చద్మల్‌తండాలో 2.50 ఎకరాలు, లింగంపేటలో 2.50 ఎకరాలు, పిట్లంలో 2.50 ఎకరాల్లో అటవీ భూములను ట్రాక్టర్లతో చదును చేసినట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు. ఇలా ఈ ఐదు ప్రాంతాల్లో మొత్తం 12 ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూములు ఆక్రమణకు గురయినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తున్న సందర్భంగా కొందరు అత్యాశకు పోయి అటవీ భూములను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. స్థానికంగా ఉండే తండాలు, గ్రామస్థులు సైతం ఆక్రమణదారులకు సహకరిస్తున్నారనే వాదన ఆ శాఖ అధికారుల నుంచి వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలోనే కాకుండా గతంలోనూ జిల్లాలో అటవీ భూములు చాలానే అన్యాక్రాంతం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల్లో అటవీ భూములు ఉండగా ఇందులో 25,347 ఎకరాల్లో అటవీ భూములు అన్యాక్రాంతం అయినట్లు తెలుస్తోంది. మరో 28వేల ఎకరాల భూములు వివాదంలో ఉన్నట్లు అటవీశాఖ రికార్డులు చెబుతున్నాయి.

కనుమరుగ వుతున్న అడవులు

ఓ వైపు ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరోవైపు ఆక్రమణదారులు, స్మగ్లర్లు, కలవ వ్యాపారులతో  అటవిని కొల్లగొడుతున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా, స్మగ్లర్లు, కొందరు వ్యాపారులు చెట్లను విచ్చలవిడిగా నరికి వేస్తున్నారు. యంత్రాల సహాయంతో భారీ వృక్షాలను నరికి వేస్తూ కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. పంటల సాగు పేరిట మరికొందరు అటవీ భూములను ఆక్రమిస్తున్నారు.  గాంధారి మండలంలో ఒకప్పుడు ఎక్కడ చూసినా అటవితో పచ్చదనం ఉండేది. ప్రస్తుతం మండలంలోని చద్మల్‌, సీతాయిపల్లి, జెమిని తండా తదితర తండాల్లో అడవులు లేకుండాపోయాయి. ఆక్రమణదారులు, స్మగ్లర్లు విచ్చలవిడిగా చెట్లను నరికి వేస్తూ అటవీ భూమిని కబ్జా చేశారు. ఇలా గాంధారి మండలంలోనే కాకుండా మాచారెడ్డి, లింగంపేట్‌, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లోనూ అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న వారు అటవీ భూములను అక్రమించుకొని చెట్లను నరికి వేసి కబ్జా చేస్తున్నారు. ఇలా కలప స్మగ్లర్లు, భూ కబ్జాదారులు అటవీ ప్రాంతాన్ని కొల్లగొడుతుండడంతో జిల్లాలో అడవులు కనుమరుగవుతున్నాయి. 


Advertisement
Advertisement