శ్రీశైలంలో టోల్‌గేట్‌ తరలింపుపై పరిశీలన

ABN , First Publish Date - 2021-09-29T04:56:00+05:30 IST

శ్రీశైల క్షేత్రంలోని టోల్‌గేట్‌ను హఠకేశ్వరానికి తరలించే విషయమై దేవస్థానం ఈవో ఎస్‌ లవన్న అధికారులతో చర్చించారు.

శ్రీశైలంలో టోల్‌గేట్‌ తరలింపుపై పరిశీలన

 శ్రీశైలం, సెప్టెంబరు 28: శ్రీశైల క్షేత్రంలోని టోల్‌గేట్‌ను హఠకేశ్వరానికి తరలించే విషయమై దేవస్థానం ఈవో ఎస్‌ లవన్న అధికారులతో చర్చించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి వెంటనే నివేదిక సమర్పించాలని ఇంజనీరింగ్‌ అధికారులను మంగళవారం ఆదేశించారు. తిరుమల తరహాలో విశాలంగా టోల్‌గేట్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని కూడా పరిశీలించాలని, తనిఖీలకు సౌకర్యంగా ఉం డేలా చూడాలని ఆదేశించారు. లగేజీ బ్యాగ్‌ స్కానర్‌లను ఏర్పాటు అవసరం ఉంటుందని పేర్కొన్నారు. హఠకేశ్వర ఆలయాన్ని ఈవో పరిశీలించారు. షెడ్లకు మరమ్మతులు చేసి, కటాంజనాలకు రంగు వేయించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో పూలమొక్కలను ఏర్పాటు చేయాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. అక్కడున్న పవిత్ర ప్రదేశాలను భక్తులు తెలుసుకునే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాలధార- పంచధార వద్ద నిర్మించిన ఆలయాన్ని పరిశీలించారు. ఆలయంలో ప్రతిష్ఠచేసేందుకు ఆదిశంకరాచార్యులు, శారదాదేవి శిల్పాలను వెంటనే రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పారిశుధ్య విభాగాధిపతి పణిధర్‌ ప్రసాద్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీరింగ్‌ నరసింహారెడ్డి, సహాయ స్థపతి జవహ ర్‌లాల్‌, ముఖ్య భద్రతాధికారి నరసింహరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-29T04:56:00+05:30 IST