TTV Dhinakaran: ఓపీఎస్‏కు స్నేహ హస్తం

ABN , First Publish Date - 2022-08-11T12:50:29+05:30 IST

అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం (O. Panneerselvam)తో చేతులు కలిపే అవకాశం లేకపోలేదని ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’

TTV Dhinakaran: ఓపీఎస్‏కు స్నేహ హస్తం

చెన్నై, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం (O. Panneerselvam)తో చేతులు కలిపే అవకాశం లేకపోలేదని ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’ నేత టీటీవీ దినకరన్‌(TTV Dhinakaran) ప్రకటించారు. ఆయన కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓపీఎస్‌ వర్గం తమ పార్టీలో విలనమయ్యే అవకాశాలు కూడా వున్నాయన్నారు. తామంతా కలిసి పని చేసి అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడంతో పాటు, ఆ పార్టీకి పూర్వ వైభవం తెస్తామని జోస్యం చెప్పారు. అన్నాడీఎంకేలో నెలకొన్న సంక్షోభానికి తాను కారణం కాదన్నారు. తమ పార్టీ సాధారణ సభ్య సమావేశం ఈ నెల 15న జరుగనుందని, ఆ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నామని తెలిపారు. తమ పార్టీకి ప్రజల్లో మంచి స్పందన వస్తోందని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేతో అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగాన్ని విలీనం చేసే దిశగా కొందరు ఢిల్లీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami)తో తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదని, అయితే అవినీతి అక్రమాలకు పాల్పడిన అతడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదని తాను గతంలోనే చెప్పానన్నారు. తాను చెప్పినట్లుగానే అన్నాడీఎంకే అధికారానికి దూరమైందన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పెద్దలు కూడా అతన్ని దూరంగా పెడుతున్నారని, ఈ విషయం త్వరలోనే మరింత బహిర్గతమవుతుందన్నారు. పార్టీలో ఓపీఎస్‌ తర్వాత సీనియర్‌గా ఉన్నారనే కారణంగానే శశికళ ఎడప్పాడి పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవిని అప్పగించారని చెప్పారు. భవిష్యత్‌లో ఓపీఎస్‏ను తమ దరి చేర్చుకున్నా, పళనిస్వామిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం పెడతామని దినకరన్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-08-11T12:50:29+05:30 IST