న్యాయవ్యవస్థకు ఆర్థిక స్వతంత్రత అవసరం

ABN , First Publish Date - 2021-10-24T08:21:48+05:30 IST

న్యాయవ్యవస్థకు ఆర్థిక స్వతంత్రత అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఔరంగాబాద్‌లో బాంబే హైకోర్టు బెంచ్‌కు ..

న్యాయవ్యవస్థకు ఆర్థిక స్వతంత్రత అవసరం

న్యాయ మౌలిక సదుపాయాల 

అథారిటీని ఏర్పాటు చేయాలి

5% కోర్టుల్లోనే ప్రాథమిక వైద్య సదుపాయాలు

26 శాతం కోర్టుల్లో మహిళా మరుగుదొడ్లు లేవు 

16% కోర్టుల్లో పురుషులకూ మరుగుదొడ్లు లేవు

సుప్రీం కోర్టు సీజే జస్టిస్‌ ఎన్వీ రమణ ఆవేదన

కోర్టుల్లో వసతుల కల్పనకు చర్యలు: మంత్రి రిజిజు


న్యూఢిల్లీ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థకు ఆర్థిక స్వతంత్రత అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఔరంగాబాద్‌లో బాంబే హైకోర్టు బెంచ్‌కు అదనపు భవనాలను శనివారం ఆయన ప్రారంభించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో జస్టిస్‌ రమణ మాట్లాడుతూ.. దేశంలో చట్టబద్ధమైన జాతీయ న్యాయ మౌలిక సదుపాయాల అథారిటీని నెలకొల్పాల్సిన అవసరం ఉందని మరోసారి స్పష్ట చేశారు. ఈ మేరకు న్యాయశాఖ మంత్రికి ప్రతిపాదన పంపానని, ఆయన ప్రతిస్పందన కోసం వేచి చూస్తున్నానని చెప్పారు. వేగంగా చర్యలు తీసుకోవాలని, శీతాకాల సమావేశాల్లో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రమంత్రిని కోరారు. కోర్టు భవనాలు కేవలం ఇటుకలు, సిమెంట్‌ తో చేసే నిర్మాణాలు కాదని, అవి న్యాయం పొందే హక్కును ప్రసాదించే రాజ్యాంగ వాగ్దానాలకు ప్రతిరూపాలని ఆయన పేర్కొన్నారు. 


సమాజానికి న్యాయస్థానాల అండ

ప్రభుత్వం చేసే దారుణాలు ఎదుర్కొన్నప్పుడల్లా వ్యక్తులకు, సమాజానికి న్యాయస్థానాలే అండగా నిలబడతాయని జస్టిస్‌ రమణ స్పష్టం చేశారు. న్యాయాన్ని కోరే వ్యక్తి ఎంత బలహీనుడైనా రాజ్యం శక్తిని చూసి భయపడనక్కర్లేదన్నారు. దేశంలో న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల దుస్థి తి గురించి కొన్ని కఠిన వాస్తవాలు చెప్పదలుచుకున్నానన్నారు. మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 24,280 అయితే 20,143 కోర్టు హాళ్లు అందుబాటులో ఉన్నాయని, అందులో 620 అద్దె భవనాల్లో నడుస్తున్నాయని చెప్పారు. ‘‘కేవలం 5% కోర్టుల్లోనే కనీస వైద సౌకర్యాలున్నాయి. 26% కోర్టు సముదాయాల్లో మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేవు. 16% కోర్టుల్లో పురుషులకూ మరుగుదొడ్లు లేవు. 54 కోర్టు సముదాయాల్లో మాత్రమే స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం ఉంది. 32% కోర్టుల్లో మాత్రమే ప్రత్యేక రికార్డు గదులు ఉన్నాయి. 51%  కోర్టుల్లో మాత్రమే లైబ్రరీలున్నాయి. 27% కోర్టు గదుల్లో మాత్రమే వీడియో కాన్ఫరెన్సింగ్‌ సౌకర్యాలతో కంప్యూటర్లు న్యాయమూర్తుల టేబుళ్లపై ఏర్పాటు చేశారు’’ అని జస్టిస్‌ రమణ వివరించారు. కోర్టుల్లో తగిన మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు. ఇప్పటికీ న్యాయ మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళిక రహితంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసమే ప్రజాస్వామ్యానికి బలమని చెప్పారు. చట్టబద్ధమైన పాలన ద్వారా కొనసాగే ఏ సమాజంలోనైనా న్యాయస్థానాలు అత్యంత ఆవశ్యకమని చెప్పారు. 2018లో ప్రచురించిన ఒక అంతర్జాతీయ పరిశోధనా పత్రాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సకాలంలో న్యాయం అందకపోవడంవల్ల జీడీపీకి ఏటా 9% నష్టం జరుగుతున్నట్టు ఆ పరిశోధన పత్రంలో పేర్కొన్నారని వివరించారు. న్యాయవ్యవస్థ మద్దతు లేకపోవడం విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపుతుందన్నారు.  


కలిసి పనిచేయడమే ధ్యేయం: కిరెణ్‌ రిజిజు

న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు కలిసి పనిచేయాలనేదే తమ ధ్యేయమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు చెప్పారు. మనమంతా దేశం కోసమే ఒక టీమ్‌ గా పనిచేస్తున్నామని, ఈ మూడూ ఒకే రాజ్య వ్యవస్థలో భాగమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T08:21:48+05:30 IST