Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిల్లల కోసం పోషకాల పొడి

అభివృద్ధి చేసిన ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తలు

పెరుగుతున్న చురుకుదనం, తెలివితేటలు  

భారీగా తగ్గుతున్న రక్తహీనత, ఐరన్‌ లోపం 

నల్లగొండలో అంగన్‌వాడీ పిల్లలపై అధ్యయనం


మే 17: చిన్నారుల్లో రక్తహీనతను తగ్గించడంతోపాటు వారిలో చురుకుదనం, తెలివితేటలు గణనీయంగా పెంపొందించే బహుళ సూక్ష్మ పోషకాలున్న పౌడర్‌ను హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. నల్లగొండ జిల్లాలోని 22 అంగన్‌వాడీల్లో 3 నుంచి 6 ఏళ్ల వయసున్న చిన్నారులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని ఎన్‌ఐఎన్‌ సోమవారం వెల్లడించింది. అమెరికా బాల్టిమోర్‌లోని మేరీలాండ్‌ విశ్యవిద్యాలయం, ఐసీఎంఆర్‌-ఎన్‌ ఐఎన్‌ ఉమ్మడిగా చేపట్టిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడ య్యాయి.


తొలుత చిన్నారులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపునకు 8 నెలల పాటు జింక్‌, ఐరన్‌, విటమిన్లు ఎ, బి-12, బి2, సి, ఫోలిక్‌ యాసిడ్‌లతో కూడిన పౌడర్‌ను మధ్యాహ్నం ఇచ్చే ఆహారంలో తొలి ముద్దలో కొద్ది మోతాదులో కలిపి ఇచ్చినట్టు ఈ ప్రాజెక్టుకు సారథ్యం వహించిన ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సిల్వియా.ఎఫ్‌.రావు తెలిపారు. చిన్నారులు స్కూలుకు వెళుతున్న సమయంలో కూడా వారికి పౌడర్‌ కలిపిన ఆహారం అందించి, వారి ప్రవర్తనను గమనించారు. పిల్లలకు ఇలా ఆహారం అందించేందుకు అంగన్‌వాడీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మరో గ్రూపు చిన్నారులకు సూక్ష్మపోషకాలు లేని బి-6 మాత్రమే ఉన్న ఆహారం అందించారు. సూక్ష్మ పోషకాలున్న ఆహారం తీసుకున్న చిన్నారుల్లో 8 నెలల తర్వాత రక్తహీనత 46 శాతం నుంచి 10.1 శాతానికి తగ్గింది. సూక్ష్మపోషకాలు లేని ఆహారం తీసుకున్న చిన్నారుల్లో రక్తహీనత 47 శాతం నుంచి 35.5 శాతానికి మాత్రమే తగ్గినట్టు సిల్వియా వివరించారు.


పెరిగిన ఐక్యూ..

రక్తహీనత తగ్గడంతో పాటు ఈ ఆహారం తీసుకున్న చిన్నారుల్లో తెలివితేటలు(ఐక్యూ) 6 పాయింట్లు పెరిగినట్లు అధ్యయనంలో వెల్లడైంది. అలాగే సామాజిక-భావోద్వేగపరమైన ఎదుగుదల 4.5 పాయింట్ల మేర పెరిగినట్లు తేలింది. బెరుకుదనం 3 పాయింట్ల మేర అదుపులో ఉందని ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ‘బహుళ సూక్ష్మపోషకాలు ఉన్న ఆహారం తీసుకున్న చిన్నారుల్లో గణనీయమైన మార్పు కనిపించింది. వారు చాలా చురుగ్గా మారారు. ఆరోగ్యంతో పాటు ప్రవర్తనలో కూడా మార్పు కనిపించింది. మెరుగైన రీతిలో ప్రాథమిక విద్య నేర్చుకునే సంసిద్ధత వారిలో కనిపించింది. దేశవ్యాప్తంగా అంగన్‌వాడీల నుంచి ప్రాథమిక పాఠశాలల్లో చేరే 3-6 ఏళ్ల చిన్నారులు 2.5 కోట్ల మందికి పైగా ఉన్నారు. వారందరికీ తక్కువ ఖర్చుతో ఆరోగ్యం, చురుకుదనంతో పాటు సంపూర్ణమైన ఎదుగుదలను అందించేందుకు బహుళ సూక్ష్మపోషకాలతో కూడిన ఆహారం ఎంతో ఉపయోగపడుతుంది’ అని సిల్వియా అన్నారు. కెనడాకు చెందిన మైక్రోన్యూట్రియంట్‌ ఇనీషియేటివ్‌, అమెరికాకు చెందిన మాథిలే ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ ది అడాన్స్‌మెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ న్యూట్రిషన్‌ సంస్థల ఆర్థిక సౌజన్యంతో చేపట్టిన ఈ పరిశోధన ఫలితాలను అంతర్జాతీయంగా పేరుపొందిన న్యూట్రిషన్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురించింది. 

 స్పెషల్‌ డెస్క్‌


చిన్నారుల్లో నవచైతన్యం

మన దేశంలో ప్రాథమిక విద్యనభ్యసించే 40.5ు మంది చిన్నారులు రక్తహీనత, ఐరన్‌ లోపం సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారిలో చురుకుదనం లోపించి నిస్సత్తువగా మారుతున్నారు. ఐసీడీఎస్‌, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సుమారు 2.5 కోట్ల మంది చిన్నారులకు ప్రభుత్వం ఆహారం అందిస్తోంది. బహుళ సూక్ష్మపోషకాల పౌడర్‌ను ఆహారంలో కలిపి, వారిలో రక్తహీనతను నివారించే వీలుంటుంది.


     డాక్టర్‌ సిల్వియా ఫెర్నాండెజ్‌ రావుAdvertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...