దేశం మొత్తానికీ నూపుర్‌ క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2022-07-02T08:12:55+05:30 IST

‘ఆమె నోటిదురుసుతనం వల్ల దేశంలో అగ్గి రాజుకుంది. (మహ్మద్‌ ప్రవక్తపై) తాను చేసిన వ్యాఖ్యలకు ఆమె తక్షణమే దేశం మొత్తానికీ క్షమాపణ చెప్పాలి’’ .

దేశం మొత్తానికీ నూపుర్‌ క్షమాపణ చెప్పాలి

ఆమె నోటి దురుసుతనం వల్లే అగ్గి రాజుకుంది


దేశంలో దురదృష్ట ఘటనలకు ఆమే కారణం.. నూపుర్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు? 

కోర్టు పరిధిలోని అంశంపై డిబేట్లు ఏంటి?.. అవి దుర్వినియోగమైతే యాంకర్‌పై ఎఫ్‌ఐఆర్‌

బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌శర్మపై సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు

దేశంలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదిలీ చేయాలన్న ఆమె పిటిషన్‌ తిరస్కరణ

ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేలా ఆదేశాలివ్వండి.. బెంచ్‌ వ్యాఖ్యలపై సీజేఐకు లెటర్‌ పిటిషన్‌


ఆమెకు నోటిదురుసుతనం ఉంది. దానివల్లే టీవీలో బాధ్యతారహిత వ్యాఖ్యలు చేసి దేశాన్ని తగలబెడుతున్నారు. ఇంతాచేసి.. తాను పదేళ్లుగా లాయర్‌నని చెబుతున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకుగాను ఆమె తక్షణమే దేశంమొత్తానికీ క్షమాపణలు చెప్పాలి. (మహ్మద్‌ ప్రవక్తపై) ఆమె చేసిన వ్యాఖ్యలు కలత పెట్టేవిగా, అహంకారంతో కూడినవిగా ఉన్నాయి. అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది? ఆ వ్యాఖ్యలే దేశంలో దురదృష్టకరఘటనలకు కారణమయ్యాయి.

- నూపుర్‌ శర్మ వ్యాఖ్యలపై 

సుప్రీం కోర్టు ధర్మాసనం


న్యూఢిల్లీ, జూలై 1: ‘‘ఆమె నోటిదురుసుతనం వల్ల దేశంలో అగ్గి రాజుకుంది. (మహ్మద్‌ ప్రవక్తపై) తాను చేసిన వ్యాఖ్యలకు ఆమె తక్షణమే దేశం మొత్తానికీ క్షమాపణ చెప్పాలి’’ ..అని సుప్రీంకోర్టు బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేయాలంటూ నూపుర్‌ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ జరిపింది. ఒకే ఘటనకు సంబంధించి రెండు ఎఫ్‌ఐఆర్‌లు ఉండకూడదంటూ గతంలో పలు తీర్పులు వచ్చిన విషయాన్ని ఆమె తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది మణీందర్‌ అగర్వాల్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నూపుర్‌శర్మ ఇప్పటికే తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. దీనికి ధర్మాసనం.. ‘‘ఆమె చాలా ఆలస్యంగా క్షమాపణ చెప్పారు.


అదీ.. ‘తన వ్యాఖ్యల వల్ల ఎవరి మతపరమైన మనోభావాలైనా దెబ్బతిని ఉంటే’ అంటూ షరతుతో కూడిన క్షమాపణ చెప్పారు. ఆమె వెంటనే టీవీ ద్వారా దేశప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి’’ అని వ్యాఖ్యానించింది. ఇలాంటివారు దైవభక్తి కలవారు కారని.. వారికి ఇతర మతాల పట్ల ఎలాంటి గౌరవమూ ఉండదని మండిపడింది. అంతేకాదు.. ఈ పిటిషన్‌ ఆమె అహంకారానికి గుర్తు అని, దేశంలోని మేజిస్ట్రేట్‌ కోర్టులన్నీ తనస్థాయికి చాలా చిన్నవిగా ఆమె భావిస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా అరెస్టు కాకపోవడం ఆమె పలుకుబడిని సూచిస్తోందని పేర్కొంది. నూపుర్‌ ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి అని.. టీవీలో ఒక చర్చాకార్యక్రమం సందర్భంగా, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని, ఇతర వక్తలు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు తప్ప ఆమె వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశమూ లేదని మణీందర్‌ సింగ్‌ ధర్మాసనానికి చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి కోర్టు.. ‘‘ఒక పార్టీ అధికార ప్రతినిధి అయినంతమాత్రాన ఇలా మాట్లాడడానికి అది ఒక లైసెన్స్‌ కాదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. టీవీ డిబేట్‌లో ఆమె ఎలా వ్యాఖ్యలు చేశారో తాము చూశామని.. ఇంతా చేసి, తాను లాయర్‌నని ఇప్పుడామె చెప్పడం సిగ్గుచేటు అని ఆగ్రహం వెలిబుచ్చింది.


ఒక చర్చాకార్యక్రమం ఇలా దుర్వినియోగమైతే.. మొదట చేయాల్సిన పని, ఆ డిబేట్‌ నిర్వహించిన యాంకర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడమేనని పేర్కొంది. ఒకే ఘటనకు సంబంధించి రెండో ఎఫ్‌ఐఆర్‌ ఉండకూడదనే విషయాన్ని మణీందర్‌ సింగ్‌ మళ్లీ ప్రస్తావించగా.. నూపుర్‌ హైకోర్టును ఆశ్రయించవచ్చని జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. అయినా పట్టువదలని మణీందర్‌ సింగ్‌.. రెండో ఎఫ్‌ఐఆర్‌ ఉండకూడదంటూ 2020నాటి అర్ణబ్‌ గోస్వామి కేసును, 2001 నాటి టీటీ ఆంటోనీ కేసును ప్రస్తావించారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తునకు నూపుర్‌ సహకరిస్తున్నారని, ఎక్కడికీ పారిపోవట్లేదని కోర్టుకు గుర్తుచేయగా.. ‘‘మరి ఆ దర్యాప్తులో ఏం తేలింది? ఢిల్లీ పోలీసులు ఇప్పటిదాకా ఏం చేశారు? మాతో చెప్పించొద్దు. వాళ్లు మీకు (నూపుర్‌కు) రెడ్‌ కార్పెట్‌ పరిచి ఉంటారు. ఎవరిమీదైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే అరెస్టు చేస్తారు. మరి నూపుర్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. నూపుర్‌ ప్రాణాలకు ప్రమాదం ఉందని సింగ్‌ కోర్టు దృష్టికి తేగా.. ‘‘ఆమెకు ప్రమాదం ఉందా? లేక ఆమే భద్రతకు ప్రమాదంగా మారారా? దేశవ్యాప్తంగా ఆమె భావోద్వేగాలను రాజేయడం వల్లనే దురదృష్టకరఘటనలు జరుగుతున్నాయి. దేశంలో జరుగుతున్నదానికి ఈమే పూర్తిగా కారణం’’ అని తీవ్రవ్యాఖ్యలు చేసింది. ఆమె విజ్ఞప్తిని తిరస్కరిస్తూ.. పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశాన్ని కల్పించింది. సుప్రీం వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ స్పందించారు.


‘‘ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కాదు.. ప్రధాని, కేంద్ర హోం మంత్రి, బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌.. అం తా కలిసి దేశంలో ఇలాంటి వాతావరణాన్ని సృష్టించా రు. కోపం, ద్వేషంతో కూడిన ఈ వాతావరణం దేశవ్యతిరేక చర్య. దేశ ప్రయోజనాలకు, ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకం’’ అని వ్యాఖ్యానించారు. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ సిగ్గుతో ఉరేసుకోవాలని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ, కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ రమేశ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూపుర్‌ శర్మను తక్షణమే అరెస్టు చేయాలని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు.


ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకునేలా ఆదేశించండి: సుప్రీంకు లేఖ

నూపుర్‌శర్మపై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం చేసిన ప్రతికూల వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముందు లెటర్‌ పిటిషన్‌ దాఖలైంది. ఢిల్లీకి చెందిన అజయ్‌ గౌతమ్‌ అనే సామాజిక కార్యకర్త ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘‘నూపుర్‌ శర్మపై ధర్మాసనం వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా తగిన ఆదేశాలు లేదా ఉత్తర్వులు జారీ చేయండి’’ అని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. తన లేఖను ప్రజాహిత వ్యాజ్యంగా స్వీకరించాలని.. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు అనావశ్యకమైనవిగా ప్రకటించాలని.. నూపుర్‌శర్మపై దాఖలైన అన్ని కేసులనూ ఢిల్లీకి బదిలీ చేయాలని అందులో కోరారు.

Updated Date - 2022-07-02T08:12:55+05:30 IST