నూపుర్ శర్మ బేషరతు క్షమాపణ

ABN , First Publish Date - 2022-06-06T00:37:19+05:30 IST

మహమ్మద్ ప్రవక్తపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని

నూపుర్ శర్మ బేషరతు క్షమాపణ

న్యూఢిల్లీ : మహమ్మద్ ప్రవక్తపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నూపుర్ శర్మ ఆదివారం తెలిపారు. తన వ్యాఖ్యల కారణంగా మనోవేదనకు గురైనవారికి బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. 


నూపుర్ శర్మ ఇచ్చిన ట్వీట్‌లో, నిరంతరం మహాదేవుడు శివుడిని అవమానిస్తూ, అగౌరవపరుస్తున్న టీవీ చర్చలకు తాను చాలా రోజుల నుంచి హాజరవుతున్నానని తెలిపారు. (జ్ఞానవాపిలో కనిపించినది) శివలింగం కాదని, ఫౌంటెన్ అని ఎగతాళి చేస్తున్నారన్నారు. శివలింగాన్ని ఢిల్లీలోని స్తంభాలు, రోడ్డు పక్కన ఉండే చిహ్నాలతో పోల్చుతూ ఎగతాళి చేస్తున్నారని పేర్కొన్నారు. మహాదేవుడిని నిరంతరం అవమానిస్తూ, అగౌరవపరుస్తూ ఉండటాన్ని తాను సహించలేకపోయానని తెలిపారు. ఆ ఎగతాళికి, అవమానాలకు స్పందిస్తూ తాను కొన్ని విషయాలు చెప్పానన్నారు. తన మాటలు ఎవరి మతపరమైన మనోభావాలనైనా గాయపరచి ఉంటే, అసౌకర్యం కలిగించి ఉంటే, తాను బేషరతుగా తన స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. ఇతరుల మతపరమైన మనోభావాలను గాయపరచాలనేది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. 


నూపుర్ శర్మ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేశారు. ఆమె వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ అధిష్ఠానం ఆదివారం ప్రకటించింది. 


జ్ఞానవాపి వివాదంపై ఇటీవల జరిగిన టీవీ చర్చా కార్యక్రమంలో నూపుర్ శర్మ మాట్లాడుతూ, ఇస్లామిక్ పుస్తకాల్లో కొన్ని అంశాలను ఎగతాళి చేయవచ్చునని చెప్పినట్లు తెలుస్తోంది. హిందువుల మనోభావాలను ముస్లింలు ఎగతాళి చేస్తున్నారని ఆరోపించినట్లు తెలుస్తోంది. 


నూపుర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూరులో శుక్రవారం హింసాకాండ జరిగింది. ఓ ముస్లిం ఆర్గనైజేషన్ పెరేడ్ మార్కెట్‌లో దుకాణాలను మూసేయాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో 20 మంది పోలీసులతో సహా దాదాపు 40 మంది గాయపడ్డారు. 




Updated Date - 2022-06-06T00:37:19+05:30 IST