దేశంలోనే నంబర్‌ వన్‌.. తెలంగాణ పోలీస్‌

ABN , First Publish Date - 2020-06-01T10:59:50+05:30 IST

తెలంగాణ పోలీస్‌ దేశంలోనే నంబర్‌వన్‌ పోలీసింగ్‌గా ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజా రక్షణ, శాంతి

దేశంలోనే నంబర్‌ వన్‌.. తెలంగాణ పోలీస్‌

హైదరాబాద్‌ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీస్‌ దేశంలోనే నంబర్‌వన్‌ పోలీసింగ్‌గా ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకొచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం ప్రజలకు, పోలీసులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించింది. సాంకేతికతను వినియోగించుకుని నేరాలను అదుపు చేస్తున్నారు సిటీ పోలీసులు. 


మహిళల భద్రతకు పెద్దపీట..

మహిళల భద్రతకు దేశంలో ఎక్కడా లేని విధం గా షీటీమ్స్‌ను ఏర్పాటు చేశారు. 2014లో ఏర్పాటైన షీటీమ్స్‌ అనతికాలంలోనే రాష్ట్రం మొత్తం విస్తరింపజేశారు. వేధింపులు, అత్యాచారాలు, మృగాళ్ల మో సాలకు బలైన మహిళలకు అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 


ట్రై కమిషనరేట్ల ఏర్పాటు..

పోలీస్‌ కమిషనరేట్లనను మూడుగా విభజించా రు. గ్రేటర్‌ పరిధిని విస్తరించి, నగరానికి ఆనుకొని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని 2016 జూన్‌ 6న ఉమ్మడి సైబరాబాద్‌ నుంచి రాచకొండ కమిషనరేట్‌ ఏర్పాటైంది. 


ఐటీ కారిడార్‌కు దన్ను

ఐటీ కారిడార్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్సీఎస్సీ)ను ఏర్పాటు చేశారు. ఐటీ కంపెనీలను భాగస్వాములను చేస్తూ ఏర్పాటైన ఎస్సీఎస్సీ ద్వారా అం దిన నిధులతో ఐటీ కారిడార్‌లో మహిళల భద్రత, సైబర్‌ సెక్యూరిటీ, సీసీటీవీల ఏర్పాటుకు ప్రాధా న్యం ఇస్తున్నారు. ఎస్సీఎస్సీ ట్రై కమిషననేట్లకు విస్తరించింది. హైదరాబాద్‌లో హెచ్‌ఎస్సీ (హైదరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌), రాచకొండలో ఆర్‌కేఎస్సీ (రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌)గా ఏర్పాటైంది.


‘నేను సైతం’.. ఓ ప్రభంజనం 

ప్రస్తుత డీజీపీ.. గతంలో హైదరాబాద్‌ సీపీ మహేందర్‌రెడ్డి ప్రవేశపెట్టిన నేను సైతం కార్యక్రమం ప్రజాదరణ పొందింది. ప్రభుత్వం పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, నేను సైతంలో భాగంగా స్థానికులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇళ్ల ముందు, షాపుల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నగరమంతా నిఘా నీడలోకి చేరింది. నేర నియంత్రణకు, నేరస్థుల ఆటకట్టించడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ టీవీ కెమెరాలు ఎంతో సత్ఫలితాలనిస్తున్నాయి.  


మరికొన్ని.. 

యువతులు, మ హిళల కోసం ఎనఫ్‌ ఈజ్‌ ఎనఫ్‌ (ఇక భరించలేము) అనే నినాదంతో ప్రత్యేకంగా వర్క్‌షాప్‌ నిర్వహించారు. 


ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో లైంగిక వేధింపులను అరికట్టడానికి సంస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేశారు. 

విమెన్స్‌ ఆన్‌ వీల్స్‌ పేరిట యువతులు, మహిళలకు ఎక్కడ ఆపద వచ్చినా క్షణాల్లో వాలిపోయే మహిళా సైన్యాన్ని సిద్ధంగా ఉంచారు. 

ట్రాఫిక్‌ ఉల్లంఘనులను గుర్తించేందుకు ఆటోమెటిక్‌ నెంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ (ఏఎన్‌పీఆర్‌) సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు.  

తప్పిపోయిన వారిని గుర్తించేందుకు దర్పణ్‌ యాప్‌ను తీసుకొచ్చారు.  

హాక్‌ఐ యాప్‌, అందులోని విమెన్‌ ట్రావెల్‌ సేఫ్‌ యాప్‌లు మహిళలు, ముఖ్యంగా యువతులకు రక్షణ కవచంగా మారాయి. 

పోలీసు ఉద్యోగాలపై అవగాహన కల్పించి 8వేల మంది ఉద్యోగాల్లో చేరేందుకు కృషి చేశారు. టీఎంఐ గ్రూపుతో కలిసి జాబ్‌కనెక్ట్‌లో 15వేల మం దికి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారు.  

Updated Date - 2020-06-01T10:59:50+05:30 IST