నల్లగొండ సమగ్రాభివృద్ధికి నుడా

ABN , First Publish Date - 2022-01-06T06:27:41+05:30 IST

నల్లగొండ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. పట్టణానికి నడిబొడ్డు నుంచి 10కిలోమీటర్ల పట్టణ విస్తరణకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం హెచ్‌ఎండీఏ తరహాలో నీలగిరి అర్భన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (నుడా)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

నల్లగొండ సమగ్రాభివృద్ధికి నుడా

10కిలోమీటర్ల మేర పట్టణ విస్తరణకు ప్రణాళిక

నెలరోజుల్లో సంస్థ ఏర్పాటుకు అధికారిక ఆదేశాలు


నల్లగొండ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. పట్టణానికి నడిబొడ్డు నుంచి 10కిలోమీటర్ల పట్టణ విస్తరణకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం హెచ్‌ఎండీఏ తరహాలో నీలగిరి అర్భన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (నుడా)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎం నుంచి ఆదేశాలు అందడమే ఆలస్యం పనులు మొదలుపెట్టేందుకు అధికారులు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. 


 నల్లగొండ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన టీఆర్‌ఎస్‌ నేత భూపాల్‌రెడ్డిని గెలిపిస్తే నల్లగొండను అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతానని సీఎం కేసీఆర్‌ ఎన్నికల సభలో ప్రకటించారు. ఆమేరకు నియోజకవర్గ ప్రజలు విశ్వాసం వ్యక్తంచేసి భూపాల్‌రెడ్డిని గెలిపించారు. ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే సీఎం నల్లగొండ పట్టణానికి వస్తారని భావించినా కరోనా మూలంగా రెండేళ్లుగా ఆయన పర్యటన వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ తండ్రి మారయ్య దశదినకర్మకు సీఎం నల్లగొండకు రావడం, అభివృద్ధి పనులను ప్రారంభించడంతో యంత్రాంగంలో కదలిక మొదలైంది. నల్లగొండ పట్టణం మాస్టర్‌ ప్లాన్‌మేరకు అభివృద్ధి చేయాలంటే రూ.1000 కోట్ల బడ్జెట్‌ అనివార్యం. ఈ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పట్టణానికే సమకూర్చే పరిస్థితిలో లేదు. ఆ నిధుల సమీకరణకు హెచ్‌ఎండీఏ తరహాలో నీలగిరి అర్భన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (నుడా)ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు చకచకా పనులు సాగిపోతున్నాయి. 


పట్టణం 10 కిలోమీటర్లమేర విస్తరింపజేయాలని..

నల్లగొండ పట్టణ నడిబొడ్డునుంచి ఎటూ 10 కిలోమీటర్ల మేర విస్తరింపజేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఇందుకు గానూ నుడాను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. బుధవారం విస్తరణకు సంబంధించిన ప్లానింగ్‌, రెవెన్యూ అధికారులు నల్లగొండ కలెక్టర్‌ పీజే పాటిల్‌, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. వివిధ రకాల ప్రతిపాదనలు చర్చలకు వచ్చాయి. పట్టణాన్ని 15 లేదా 20 కిలోమీటర్లకు విస్తరిస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ సైతం సాగింది. చివరకు 10కిలోమీటర్ల మేర విస్తరించేందుకు స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. నుడా ఏర్పడితే ఈ 10 కిలోమీటర్ల పరిధిలోని భూములన్నీ ఆ సంస్థ పరిధిలోకే వస్తాయి. ఈ పరిధిలోని భూములన్నింటినీ గుర్తించి వాటిని వెంచర్లుగా మార్చి వేలం వేసి ఆదాయం సమకూర్చుకునే పని నుడా చేపడుతుంది. ఈ సంస్థకు ప్రభుత్వం నుంచి ఒక చైర్మన్‌, పరిపాలన అవసరాలకు ఒక ఐఏఎ్‌సను నియమించనున్నారు. రాబోయే నెల రోజుల్లో సంస్థ ఏర్పాటు, అధికారుల కేటాయింపునకు సంబంధించిన జీవోలు వెలువడనున్నట్లు సమాచారం. 10 కిలోమీటర్లలోపు భూములకు విలువ ఏర్పడేందుకు నుడా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఈ నిధులను మొదట ప్రభుత్వం కేటాయిస్తుంది. వీటి ద్వారా 10 కిలోమీటర్ల పరిధిలో రింగురోడ్డు, టౌన్‌షి్‌పల అభివృద్ధి వంటి పనులు చేపడతారు.


మొదటి దశలో ఆరు జంక్షన్లు 

పట్టణ అభివృద్ధిలో భాగంగా మొదటి దశలో ఆరు జంక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. మర్రిగూడ బైపాస్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి గడియారం సెంటర్‌ వరకు, మధ్యలో ప్రసాద్‌ ఉడిపి హోటల్‌, ఎన్టీఆర్‌ విగ్రహం, క్లాక్‌టవర్‌ సెంటర్‌, దేవరకొండ రోడ్డు, డీఈవో కార్యాలయం, వైఎ్‌సఆర్‌ విగ్రహం, కలెక్టరేట్‌ వద్ద మేకల అభినవ్‌ ఇండోర్‌ స్టేడియం వద్ద మొదటి దశలో ఆరు జంక్షన్లు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా టౌన్‌హాల్‌ స్థానంలో కళాభారతి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ పూర్వస్థలంలో శిల్పారామం, పానగల్‌లో ట్యాంక్‌బండ్‌, రోడ్లు, జంక్షన్లు అభివృద్ధి చేయాల్సి ఉంది. నగరంలో ఫుట్‌పాత్‌లు, సర్వీస్‌ రోడ్డు, బస్‌బే వంటివి అభివృద్ధి చేయాల్సి ఉంది.   ఇదిలా ఉంటే నుడా ఏర్పాటు లాభ, నష్టాలపై జిల్లా కేంద్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నుడా కేవలం నిధుల సమీకరణ కోసమేనని, ఉన్న భూములను అమ్మటం, మునిసిపాలిటీకి నిధులు సమకూర్చడమే ఈసంస్థ లక్ష్యం అన్న అభిప్రాయం స్పష్టమైంది. ఈ సంస్థ చైర్మన్‌, కార్యనిర్వాహక అధికారి పూర్తిగా సీఎం కంట్రోల్‌లో ఉంటారని ఫలితంగా స్థానిక ఎమ్మెల్యే, మునిసిపల్‌ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధుల ప్రాధాన్యం తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


ఆచరణలోకి నల్లగొండ మాస్టర్‌ ప్లాన్‌

నల్లగొండ మునిసిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికే మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించగా వివిధ కారణాలతో అది పెండింగ్‌లో ఉంది. సీఎం నల్లగొండ పర్యటనతో ఆ ప్లాన్‌కు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కీలక సమావేశం ఈ నెల 12వ తేదీన ఉదయాదిత్య భవనంలో జరగనుంది. సీఎం పర్యటన మరుసటి రోజే ఎన్జీ కళాశాల ఆధునిక భవనాల నిర్మాణం, ఐటీహబ్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.



నుడా ఏర్పాటుతో సమగ్రాభివృద్ధి : కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, నల్లగొండ

నుడా ఏర్పాటుతో నల్లగొండ పట్టణమే కాదు నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంది. ఒకవైపు మునిసిపాలిటీ మాస్టర్‌ ప్లాన్‌తో ముందుకెళ్తోంది. మరోవైపు నుడా నల్లగొండ పట్టణానికి 10 కిలోమీటర్ల పరిధిలో అన్ని రకాల సౌకర్యాలను అభివృద్ధిచేసి ఆధునిక టౌన్‌షి్‌ప మాదిరిగా రూపొందించే ప్రయత్నం చేస్తోంది.  తాజాగా సీఎం ప్రకటించిన అభివృద్ధి పనులన్నీ మునిసిపాలిటీ పరిధిలోనే సాగుతాయి. 

 


మునిసిపల్‌ కమిషనర్‌గా రమణాచారి 

రామగిరి, జనవరి 5: నల్లగొండ మునిసిపల్‌ కమిషనర్‌గా రమణాచారి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన శరత్‌చంద్ర బదదిలీపై వెళ్లడంతో ఇన్‌చార్జి బాధ్యతలు ఈఈ శ్రీనివాసులుకు అప్పగించిన విషయం విదితమే. 2020 మేనెలలో నల్లగొండ మునిసిపల్‌ కమిషనర్‌గా వచ్చిన శరత్‌చంద్ర సంవత్సర కాలం పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిడుల మేరకు జూన్‌ 2021 జూన్‌ 3 నుంచి 10వ తేదీ వరకు సెలవులోకి వెళ్లారు. తిరిగి 11వ తేదీన హాజరుకావాల్సి ఉండగా సెలవును 24వ తేదీ వరకు పొడిగించుకున్నారు. ఆ తర్వాత బదిలీపై వికారాబాద్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఇన్‌చార్జి కమిషనర్‌ బాధ్యతలు ఈఈ శ్రీనివాసులుకు అప్పగించారు. శరత్‌చంద్ర సెలవులు పెట్టుకోవడం వాటిని పొడిగించుకోవడం, బదిలీపై వెళ్లడం వంటి అంశాలన్నీ రాజకీయ ఒత్తిడే కారణమన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. అప్పటి నుంచి ఇన్‌చార్జి పాలనే కొనసాగుతుంది. ఇటీవల కాలంలో నల్లగొండకు ఓ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యవుంత్రి కేసీఆర్‌ పట్టణ అభివృద్థిపై జిల్లా స్థాయి అధికారులతో ఆరా తీశారు. ఈ క్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ లేకపోవడం వల్లే అభివృద్ధి కుంటుపడిందన్న విషయం సీఎం కేసీఆర్‌ దృష్టికి రావడంతో వెంటనే సిద్ధిపేట మునిసిపాలిటీలో కమిషనర్‌గా పనిచేస్తున్న రమణాచారిని నల్లగొండకు రావాల్సిందిగా అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు బుధవారం ఉదయం నల్లగొండ మునిసిపల్‌ కమిషనర్‌గా రమణాచారి బాధ్యతలు స్వీకరించారు. 

Updated Date - 2022-01-06T06:27:41+05:30 IST