ఆటో అద్దె.. రూ.63,600

ABN , First Publish Date - 2022-08-04T05:15:26+05:30 IST

పాలకులు మారినప్పుడల్లా పారిశుధ్య విధానం కూడా మారుతున్నది. గతానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం జగనన్న స్వచ్ఛ సంకల్పం అంటూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌(క్లాప్‌) అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది.

ఆటో అద్దె.. రూ.63,600
చెత్త సేకరణకు మున్సిపాల్టీ ఏర్పాటు చేసిన అద్దె ఆటోలు

ఇంటింటా చెత్త సేకరణకు ఏర్పాటు

క్లాప్‌లో పారిశుధ్యం ప్రైవేటు ఏజెన్సీకి

చెత్త ఆటోల అద్దె భారం పట్టణ ప్రజలపై 

తెనాలిలో 40 ఆటోలకు రూ.3.05 కోట్ల బాదుడు

నరసరావుపేటలో 23 ఆటోలకు ఏడాదికి రూ.1.75 కోట్లు

అద్దె మొత్తంతో మున్సిపాల్టీనే ఆటో కొనుగోలు చేసుకోవచ్చు

అయినా ప్రజాధనాన్ని ఏజెన్సీకి దోచిపెట్టేందుకే పాలకులు ప్రాధాన్యం

ఒకవైపు చెత్త పన్ను వసూలు.. మరోవైపు పట్టణాల్లో కానరాని పరిశుభ్రత


పారిశుధ్యం.. పరిసరాల పరిశుభ్రత.. ప్రజారోగ్యం బాధ్యత స్థానిక సంస్థలదే. ఇందుకు సంబంధించి ప్రజల నుంచి ఇంటి పన్నులు చేస్తారు. మున్సిపల్‌ పట్టణ పరిధిలోని ప్రజల నుంచి పన్నులను ముక్కుపిండి    వసూలు చేస్తుంటారు. అయితే కొన్ని నెలలుగా పుర ప్రజలపై ప్రత్యేకంగా చెత్త పన్ను విధించి వసూలు చేస్తున్నారు. చెత్త పన్నుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా ఏమీ పట్టనట్లుగా వసూళ్లకే మున్సిపల్‌ అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి పన్ను ఇస్తున్నాం కదా.. మళ్లీ చెత్త పన్ను ఏమిటన్నా కూడా ఆలకించేవారు లేరు. సరే ఇదంతా ఒక ఎత్తైతే.. క్లాప్‌ పేరిట స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆ భారం కూడా ప్రజలపైనే వస్తోంది. క్లాప్‌ అట్టర్‌ ప్లాప్‌ అయినా చెత్త సేకరణకు ఆటోలను ఏర్పాటు చేసి ఒక్కో దానికి రూ.63,600 చొప్పున అద్దె చెల్లిస్తూ రూ.కోట్లలో ప్రైవేటు సంస్థకు దోచిపెట్టేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంతో పరిశుభ్రత మాట ఎలా ఉన్నా ప్రజల జేబుకు మాత్రం భారీగా చిల్లు పడుతున్నది. మొత్తం మీద ప్రజల సొమ్మును ప్రైవేట్‌ వ్యక్తులకు పారిశుధ్యం పేరిట ప్రభుత్వం రూ.కోట్లు దోచిపెడుతున్నది.


నరసరావుపేట, ఆగస్టు 3: పాలకులు మారినప్పుడల్లా పారిశుధ్య విధానం కూడా మారుతున్నది. గతానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం జగనన్న స్వచ్ఛ సంకల్పం అంటూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌(క్లాప్‌) అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది. అయితే ఈ క్లాప్‌ అమలు ఆర్థిక భారాన్ని పుర ప్రజల నుంచే ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నది. క్లాప్‌ పథకాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఆచరణలో ఇది అట్టర్‌ ప్లాప్‌గా నిలుస్తున్నది. క్లాప్‌ పథకంలో భాగంగా ఇంటింటా చెత్త సేకరణకు ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేసింది. తెనాలి మున్సిపాల్టీకి 40, నరసరావుపేట మున్సిపాల్టీకి 23 ఆటోలను ప్రభుత్వం పంపింది. అయితే ప్రభుత్వం సొంత నిధులతో కొనుగోలు చేసి మున్సిపాల్టీలకు ఇచ్చినట్టుగా తొలుత అందరూ భావించారు. అయితే ఈ ఆటోలను ఓ ప్రైవేటు ఏజెన్సీ ఏర్పాటు చేసింది. దీంతో వీటికి మున్సిపాల్టీ నెలనెలా రూ.63,600 అద్దె చెల్లిస్తున్నది. ఈ భారమంతా ప్రజలపైనే పడుతున్నది. తెనాలి మున్సిపాల్టీలో 40 ఆటోలకు నెలకు 25,44,000 చొప్పున ఏడాదికి ఏడాదికి రూ3.05 కోట్లు భారం పడుతున్నది. అదే నరసరావుపేటలో 23 ఆటోలకు నెలకు రూ.14,62,800 చొప్పున ఏడాదికి రూ.1.75 కోట్లు అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఏప్రిల్‌ నుంచి ఆటోలకు అద్దె చెల్లిస్తున్నారు. ఆటోలను ఏర్పాటు చేసిన ఏజెన్సీకి అద్దె కింద ఇప్పటి వరకు నరసరావుపేట మున్సిపాల్టీ 1,01,76,000, నరసరావుపేట మున్సిపాల్టీ రూ.58.51 లక్షలు చెల్లించింది. చెత్త పన్ను వసూలు చేస్తూ పాలకులు ప్రైవేట్‌ వ్యక్తులకు దోచిపెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ప్రజలు చెల్లిస్తున్న ఆస్తి పన్ను కన్నా చెత్త పన్ను అధికంగా ఉంది. ఆస్తి పన్నులోనే పారిశుధ్యానికి సంబంధించిన పన్ను ఉన్నా క్లాప్‌ పేరుతో మున్సిపాల్టీలకు చెత్త పన్ను వసూలు చేసే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది.


పారిశుధ్యం అంతంతే..

క్లాప్‌ పథకంలో ఆటోలను ప్రవేశ పెట్టినంత మాత్రాన తెనాలి, నరసరావుపేట పట్టణాల్లో పరిశుభ్రత మెరుగుపడిన దాఖలాలు లేవు. ఈ విఽధానంతో వీధులలో డస్టుబిన్లు ఉండవని ప్రకటించారే తప్ప ఇది అమలుకు నోచుకోలేదు. పలు ప్రాంతాల్లో రోడ్లపై డస్ట్‌ బిన్లు ఉన్నాయి. గతంలో ఇంటింటి నుంచి తోపుడు బండ్లద్వారా చెత్త సేకరణ జరిగేది. ఇప్పుడు ఆటోలతో చేస్తున్నారు. రెండింటి మధ్య పెద్ద వ్యత్యాసం లేదు. అంతకు ముందు ఉన్న పారిశుధ్య పనివారే ఆటోలకు చెత్త సేకరణ చేస్తున్నారు. గతంలో వలే ఆటోల నుంచి చెత్తను ట్రాక్టర్ల ద్వారా యార్డుకు తరలిస్తున్నారు. అయినా వ్యర్థాల సేకరణలో ఏమాత్రం వృద్ధి లేదు. ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేస్తున్న పురపాలక సంఘం పరిశుభ్రత కల్పించాల్సి ఉండగా ఆచరణలో పూర్తిగా విఫలమవుతున్నది. ఇంకా అనేక ప్రాంతాల్లో రోడ్లపై చెత్తాచెదారాలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి.


అధికారుల కార్ల అద్దె కన్నా ఆటోలకే అధికం..

నరసరావుపేటలో మున్సిపల్‌ ఆధికారులు అద్దె కార్లను వినియోగిస్తున్నారు. వీటికి నెలకు రూ.35 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. ఈ కార్లు నెలకు 2,500 కిలో మీటర్లు తిరిగేలా ఒప్పందం ఉంది. అయితే ఈ కార్ల అద్దెకు సుమారు రెండింతలుగా చెత్త ఆటోకు నెలకు రూ.63.600 అద్దె చెల్లించడంపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఆటోలు కూడా నెలకు 900 కిలోమీటరు మాత్రమే తిరిగేలా ఒప్పందం జరిగింది. అంటే  ఒక్కో ఆటో రోజుకు 30 కిలోమీటర్లకే పరిమితం. అంటే అధికారుల కారు కంటే ఆటోలను అపురూపంగా చూసుకోవాలని.. అధికంగా అద్దె దోచిపెట్టాలని ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది. కారు అద్దె కంటే ఆటోకు నెలకు రూ.28,600 అధికంగా చెల్లిస్తున్నట్లు. కారు ఖరీదు కంటే ఆటో ఖరీదు చాలా తక్కువ. ఒక ఏడాది చెల్లించే అద్దెతో 23 ఆటోలను మున్సిపాల్టీనే సొంతంగా కొనుగోలు చేయవచ్చు. అయినా ఇలా ప్రజాధనాన్ని ప్రైవేట్‌ ఏజెన్సీకి దోచిపెట్టేందుకు పాలకులు ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

        

Updated Date - 2022-08-04T05:15:26+05:30 IST