ఆరోగ్యం.. అరకొర

ABN , First Publish Date - 2022-07-20T05:29:24+05:30 IST

జిల్లా కేంద్రమైన నరసరావుపేట పరిధిలో పేదలకు వైద్యం అందడంలేదు. వంద పడకల ఏరియా ఆస్పత్రిలో 23 మంది డాక్టర్ల సహా 95 మంది సిబ్బంది ఉండాలి.

ఆరోగ్యం.. అరకొర
నరసరావుపేటలో వైద్యం కోసం వచ్చిన మహిళలు

ఎవరికీ పట్టని ప్రభుత్వ వైద్యం 

రోగులకు అందని మెరుగైన సేవలు

ఏరియా ఆస్పత్రిని వేధిస్తున్న వైద్యుల కొరత

లింగంగుంట్లలో నిరుపయోగంగా అధునాతన వైద్యశాల

ఇదీ నరసరావుపేటలో ప్రభుత్వ వైద్యం తీరు


వైద్యుల నియామకం లేదు.. అరకొర వైద్య సేవలు.. అత్యవసర చికిత్సల కోసం వస్తే గుంటూరు పొమ్మంటారు.. ఉన్న వసతులను వినియోగించుకోరు.. ఇదీ నరసరావుపేటలో ప్రభుత్వ వైద్యం తీరు.   ఏరియా ఆస్పత్రిలో మూడు నెలలుగా వైద్యుల కొరత రోగులను పట్టి పీడిస్తున్నది. ఎనిమిది మంది వైద్యులను నియమించడంలో వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పేదలకు వైద్యం అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా ఎవరికీ పట్టడంలేదు. లింగంగుంట్లలో గత ప్రభుత్వం నిర్మించిన వైద్యశాల భవనం నిరూపయోగంగా ఉంది. 



ఏ నుంచి సీకి

నరసరావుపేట ఏరియా ఆస్పత్రి గతంలో ఏ గ్రేడ్‌లో ఉంది. చికిత్సలు, సేవల్లో అత్యుత్తమంగా ఉండేది. అలాంటి ఆస్పత్రి ప్రస్తుతం సీ గ్రేడ్‌కు పడిపోయింది. ఉమ్మడి జిల్లా ర్యాంకు ఒకటి నుంచి మూడుకు తగ్గింది. రాష్ట్ర స్థాయి ర్యాంకు మూడు నుంచి 31కి పడిపోయింది. ఈ ర్యాంకులే ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను తెలియజేస్తున్నాయి. 


నరసరావుపేట, జూలై 19: జిల్లా కేంద్రమైన నరసరావుపేట పరిధిలో పేదలకు వైద్యం అందడంలేదు.   వంద పడకల ఏరియా ఆస్పత్రిలో 23 మంది డాక్టర్ల సహా 95 మంది సిబ్బంది ఉండాలి. వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు నిర్ణయించినా నియామకాలపై మాత్రం దృష్టి సారించడంలేదు. ఏరియా వైద్యశాలలో అరకొర వసతులతో రోగులు ఇక్కట్లు పడుతున్నారు. రోజూ 500 మందికిపైగా ఇక్కడ వైద్యం కోసం వస్తారు. 100 పడకల వైద్యశాల అయినా 150 వరకు రోగులు ఉంటారు. నేత్ర వైద్య విభాగాన్ని కూడా ప్రసూతి విభాగానికి వినియోగిస్తున్నారు. ఈ విభాగంలో పూర్తి స్థాయి వసతులు లేక డెలివరీలకు వస్తున్న మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎముకల విభాగానికి సంబంధించిన వైద్యులు లేరు. దీంతో సంబంధిత రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలలో ఎముకలు విరిగిన వారికి వైద్యం అందడంలేదు. సదరన్‌ క్యాంపునకు వస్తున్న వైద్యులు వారంలో రెండు రోజులు ఆర్ధో రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇంతవరకు రెగ్యులర్‌ వైద్యుడిని నియమించలేదు. చర్మవ్యాధులు, చిన్న పిల్లల, కంటి వైద్యం. గైనకాలజీ, సివిల్‌ సర్జన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యులను నియమించాలని రోగులు కోరుతున్నారు. వీరి మొర ఆలకించే నాధుడే కరువయ్యాడు.


నూతన ఆస్పత్రిలో సమావేశాలు..

లింగంగుంట్లలో గత ప్రభుత్వం నూతనంగా వైద్యశాలను నిర్మించింది. ఈ వైద్యశాల భవనాన్ని ఉపయోగించుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. దీంతో అధునాతన వైద్యశాల భవనం నిరూపయోగంగా ఉంది. వైద్య శాఖ సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి ఈ ఆస్పత్రిని వినియోగిస్తున్నది. విలువైన వైద్య పరికరాలు ఇక్కడ ఉన్నాయి. వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్‌, ఐసీయూలు అధునాతన వైద్య సేవలను అందించే విధంగా ఈ భవనంలో ఏర్పాటు చేశారు. అయినా ప్రయోజనంలేదు. ఈ వైద్య పరికరాలు కూడా మూలనపడేయడం విమర్శలకు దారితీస్తున్నది. మూడు నెలలుగా అదుగో ఇదుగో అంటున్నారే తప్ప ఈ భవనాన్ని రోగులకు అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు లేవనే చెప్పాలి. నూతన భవనంలో వైద్య సేవలు గత మే నెలలో ప్రారంభిస్తున్నట్టు అప్పట్లో కలెక్టర్‌ ప్రకటించారు. ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఏ నెల కానెల ప్రారంభిస్తామని రెండు నెలలుగా ప్రకటనలకే పరిమితమైంది. పాత ఏరియా ఆస్పత్రిని వైద్యుల కొరత వెంటాడుతుండగా కొత్త భవనం ప్రారంభించాలంటే వైద్యులు, సిబ్బందిని నియమించాలి. ఉన్న ఏరియా ఆస్పత్రిని రెండు వందల పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. స్థాయి పెంచితే వైద్యులు, సిబ్బంది సంఖ్యను 158కి పెంచాలి. ఎనిమిది మంది వైద్యులను నియమించడానికే అతీగతిలేదు. ఈ స్థాయిలో వైద్య సిబ్బంది సంఖ్యను పెంచాలంటే ఎన్ని నెలలు పడుతుందో చూడాలి.


త్వరలో నియామకాలు.. ప్రారంభం

ఏరియా ఆస్పత్రికి నెల రోజుల్లో ఎమిది మంది వైద్యుల నియయాకం జరుగుతుందని ఏపీవీవీపీ జిల్లా కోఆర్డినేటర్‌ బీ వెంకటరంగారావు తెలిపారు. లింగంగుంట్లలోని కొత్త భవనాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించామని చెప్పారు. ఓపీని కూడా కొత్త భవనంలోకి మార్చనున్నట్టు తెలిపారు. 


Updated Date - 2022-07-20T05:29:24+05:30 IST