ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు!

ABN , First Publish Date - 2022-01-25T07:04:25+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ అనుమానితుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా రాజమహేంద్రవరం, అమలాపురంల్లో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను నేటికీ అందుబాటులోకి తీసుకురాకపోవడం సమస్యాత్మకంగా మారింది.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు!
రాజమహేంద్రవరంలో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌

రాజమహేంద్రవరం, అమలాపురంల్లో   ప్రారంభానికి  నోచుకోని ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు

కాకినాడ ల్యాబ్‌పై తీవ్ర ఒత్తిడి  ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 24: జిల్లాలో కొవిడ్‌ అనుమానితుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా రాజమహేంద్రవరం, అమలాపురంల్లో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను నేటికీ అందుబాటులోకి తీసుకురాకపోవడం సమస్యాత్మకంగా మారింది. వాటిని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రారంభిస్తారనే మాట అటు వైద్య ఉద్యోగుల నుంచి, ఇటు జిల్లా ప్రజానీకం నుంచి వ్యక్తమవుతోంది.  ప్రస్తుతం జిల్లా అంతటి నుంచి కాకినాడలో ఉన్న ఒకే ఒక్క ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌కు శాంపిల్స్‌ పంపుతున్నారు. దీంతో దానిపై తీవ్రమైన ఒత్తిడి పెరిగి  ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతోంది.  ఫలితం తెలియడానికి కనీసం మూడు నుంచి  నాలుగు రోజులు పడుతుతుండడంతో అనుమానితులు తమకు పాజిటివా, నెగెటివా అనేది తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అలాగే  టెస్టులు చేసుకున్న వారు హోం ఐసోలేషన్‌లో ఉండకుండా కుటుంబీకులు, ప్రజలతో కలిసిపోయి తిరుగుతుండడంతో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. రాజమహేంద్రవరం, అమలాపురంల్లో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తే కాకినాడ ల్యాబ్‌పై ఒత్తిడి తగ్గుతుంది. ఫలితం కూడా త్వరగా వచ్చే  వీలుంటుంది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో రోజూ సుమారు 200 మంది అనుమానితులకు టెస్టులు చేస్తున్నారు. ఈ శాంపిల్స్‌ అన్నింటినీ రోజూ కాకినాడ ల్యాబ్‌కు పంపించడం ఇక్కడి అధికారులకు కత్తిమీద సాములా మారుతోంది.  ప్రభుత్వాసుపత్రికి చెందిన రెండు సొంత  అంబులెన్సులూ మూలనపడడంతో ఆసుపత్రి   వైద్యాధికారి ఒకరు తన సొంత డబ్బులిచ్చి ప్రైవేట్‌ వాహనంలో శాంపిల్స్‌ పంపే ఏర్పాట్లు  చేస్తున్నారు. ప్రతీరోజూ ఇది భారంగా  మారుతోందని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు.

ఎన్‌ఏబీఎల్‌ అనుమతి రాకపోవడం వల్లే ...

కాగా రాజమహేంద్రవరం, అమలాపురంల్లో  కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ల్లో పనిచేయడానికి కొద్ది రోజుల క్రితమే ఉద్యోగులను  నియమించారు. మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌,కంప్యూటర్లు, ఇతర పరికాలన్నింటినీ సిద్ధం చేశారు. అయితే జాతీయ స్థాయిలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఎన్‌ఏబీఎల్‌ అనుమతులు  రాకపోవడంతో ల్యాబ్‌ల్లో టెస్టులు చేయడానికి  అధికారులు తటపటాయిస్తున్నారు. అధికారికంగా ఈ అనుమతి వస్తేనే కానీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసే వీలులేదనివైద్య వర్గాలు చెప్తున్నాయి. దీనికోసం జిల్లా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారని... రెండు, మూడు రోజుల్లో అధికారిక  అనుమతి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం జిల్లాలో కొవిడ్‌ ఉధృతి తీవ్రంగా ఉన్నందున ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు వెంటనే అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత జిల్లా అధికారులపై ఉంది. 




Updated Date - 2022-01-25T07:04:25+05:30 IST