ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2021-11-17T06:38:48+05:30 IST

ఎమ్మెల్సీ స్థానానికి మంగళవారం రిటర్నింగ్‌ అధికారి నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్‌ విడుదల
మీడియాతో మాట్లాడుతున్న రాజాబాబు

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 16: జిల్లాలో ఖాళీ ఏర్పడిన శాసన మండలి (ఎమ్మెల్సీ) స్థానానికి మంగళవారం కలెక్టరేట్‌లోని తన సమావేశ మందిరంలో రిటర్నింగ్‌ అధికారి, జేసీ రాజాబాబు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఉండిన గాలి సరస్వతి పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీకి ముగిసిందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు. ఈనెల 23వ తేదీవరకు రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చన్నారు. 24న నామినేషన్ల పరిశీలన, 26వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణ, డిసెంబరు 10న ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్‌, 14న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి ఉంటుందన్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని చెప్పారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహణ ఉంటుందన్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటర్లుగా ఉంటారన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో 1,155 మంది ఓటర్లుండగా.. ఇందులో మహిళా ఓటర్లు 669 మంది, పురుషులు 486 మంది ఉన్నారన్నారు. తిరుపతి డివిజన్‌లో 278 మంది, మదనపల్లె డివిజన్‌లో 520 మంది, చిత్తూరు డివిజన్‌లో 357 మంది ఓటర్లుగా ఉన్నారన్నారు. ప్రస్తుతం కుప్పం మున్సిపాలిటీ, జిల్లాలోని ఇతర ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు జరిగిన క్రమంలో ఫలితాల అనంతరం గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం తర్వాత వారిని కూడా ఓటర్ల జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించారు. ఈనెల 23న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని స్పష్టం చేశారు. తిరుపతిలోని డీఆర్‌డీఏ సమావేశ మందిరం, మదనపల్లెలోని ఎంపీడీవో సమావేశ మందిరం, చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరాల్లో పోలింగ్‌ జరుగుతుందన్నారు. సహాయ రిటర్నింగ్‌ అధికారిగా డీఆర్వో మురళి వ్యవహరిస్తారని తెలియజేశారు. 

Updated Date - 2021-11-17T06:38:48+05:30 IST