అమ్మో.. ఏడి ‘పింఛన్‌’

ABN , First Publish Date - 2021-09-16T05:30:00+05:30 IST

కడప కార్పొరేషన్‌ పరిధిలో 28,001 పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళ విభాగంలో పింఛన్‌లు నెల నెలా తీసుకుంటున్నారు. అయితే వీరిలో చాలామంది అనర్హులు ఉన్నారని అనుమానంతో ప్రభుత్వం ఏరివేత కార్యక్రమం చేపట్టింది.

అమ్మో.. ఏడి ‘పింఛన్‌’

కార్పొరేషన్‌లో 1300 పింఛన్‌దారులకు నోటీసులు 

ఏదో కారణంతో చెక్‌ పెటే ్ట యోచన

లబోదిబోమంటున్న పింఛన్‌దారులు 


కడప నగరపాలక సంస్థ పరిధిలో సామాజిక పింఛన్‌దారులపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఎన్నో ఏళ్లుగా తీసుకుంటున్న నెల వారీ పింఛన్లు రద్దు చేస్తోంది. అందులో భాగంగా కడప కార్పొరేషన్‌ పరిధిలో 1300 మంది వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు నోటీసులు జారీ చేసి పింఛన్లు నిలిపివేసింది. రేషన్‌కార్డులో భర్త పేరు ఉందని, ఈకేవైసీ అప్‌డేట్‌ కాలేదని ఇలా ఏదో ఒక సాకు చూపి పింఛన్‌ రద్దు చేస్తున్నామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.


- ఈమె పేరు మాదక పద్మావతి వితంతు పింఛనను గత కొన్నేళ్లుగా పొందుతోంది. ఈమె కుమార్తె ఆర్టీసీలో జాబ్‌ చేస్తూ పది సంవత్సరాల క్రితం వివాహం జరిగి బద్వేలులో ఆమె భర్తతో కలిసి నివాసం ఉంటోంది. కుమార్తెకు ఉద్యోగమని కారణం చూపి ఆమె పింఛన్‌కు అనర్హురాలని నిలిపివేశారు. ఆమె కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. పింఛన్‌ నిలుపుదల చేయడంతో లబోదిబోమని ఏడుస్తూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. 


- ఈమె పేరు రహీంబీ. కడప నగరం 47వ డివిజన్‌లో నివాసం ఉంటోంది. వయస్సు 70 సంవత్సరాలు పైబడి ఉంటుంది. ఆధార్‌కార్డులో ఈకేవైసీ నమోదు చేసుకోలేదనే కారణంతో పింఛన్‌ నిలిపివేశారు. ఈ వృద్ధురాలు బయటకు తిరగలేని పరిస్థితి. మళ్లీ పింఛన వస్తుందో.. రాదో తెలియని అయోమయ స్థితిలో ఉంది.


- ఈమె పేరు శీతాలమ్మ. ఈమె వృద్ధురాలు కళ్లు కూడా సరిగా కనపడవు, నడవలేదు, సరిగా మాట్లాడలేదు. అయితే ఈకేవైసీ నమోదు చేసుకోలేదని పింఛన్‌ నిలిపివేశారు. 


- ఈమె పేరు నరసమ్మ 43వ డివిజన్‌లో నివాసం ఉంటోంది. అత్తాకోడళ్లు ఇరువురు వితంతువులే కూలీ పనులు చేసుకుంటున్నారు. వీరిరువురికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి పింఛన్‌ వస్తుండేది. ప్రస్తుతం రెండు పింఛన్‌లు వస్తున్నాయి కనుక ఇద్దరిలో ఒకరికి మాత్రమే పింఛన్‌ ఇవ్వాలని, మీలో ఎవరికి ఇవ్వాలో మీరే తేల్చుకోమని అధికారులు ఇద్దరివి నిలిపివేశారు. ఇద్దరిదీ ఒకటే పరిస్థితి ఎవరికి పింఛన్‌ పోయినా బతకలేరు. వీరిరువురిలో ఎవరికో ఒక్కరికి మాత్రమే పింఛన్‌ ఇస్తామని అధికారులు చెప్పడంతో లబోదిబోమంటున్నారు. 


కడప (ఎర్రముక్కపల్లె), సెప్టెంబరు 16 : కడప కార్పొరేషన్‌ పరిధిలో 28,001 పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళ విభాగంలో పింఛన్‌లు నెల నెలా తీసుకుంటున్నారు. అయితే వీరిలో చాలామంది అనర్హులు ఉన్నారని అనుమానంతో ప్రభుత్వం ఏరివేత కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా కార్పొరేషన్‌లో 1300 మందికి నోటీసులు జారీ చేసింది. వీరిలో కొంతమంది రేషన్‌కార్డులలో భర్త పేరు ఉందని నెలనెలా రేషన్‌ సరుకులు కూడా తీసుకుంటున్నారని వితంతు, ఒంటరి మహిళల పింఛనలు ఆపివేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి ఆఽధార్‌కార్డులో వయసు తక్కువగా ఉందన్న సాకు చూపించింది. వితంతు పింఛన్లలో భర్త చనిపోయినప్పుడు రేషన్‌కార్డులలో భర్త పేరు తొలగించాల్సిన అధికారులు అప్పుడు పట్టించుకోలేదు. దీంతో రేషన్‌కార్డులలో ఇప్పటి వరకు భర్త పేరు ఉండడంతో వితంతు, ఒంటరి మహిళలు రేషన్‌ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇటువంటి వారి రేషన్‌ కార్డులలో భర్త పేరును తొలగించాలని ప్రభుత్వం చెబుతోంది. చనిపోయి కొన్నేళ్లు అవుతోందని అప్పడు డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకోలేదని, ఇప్పుడు వాటిని ఎవరు ఇస్తారని వాపోతున్నారు. ప్రస్తుతం రేషన్‌కార్డులలో పేర్లు తొలగించే ఆప్షన్‌ కూడా లేదు. ఈ నేపధ్యంలో పింఛన్‌ నిలిపివేస్తే బతకడం ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేసి పింఛన్లు యదావిధిగా కొనసాగించాలని వారు కోరుతున్నారు. లేదంటే తమ జీవితాలు రోడ్డునపడ్డట్టేనని వాపోతున్నారు. 

Updated Date - 2021-09-16T05:30:00+05:30 IST