మాస్క్‌ లేకుంటే చీపురుకట్టతో రోడ్లు తుడవాల్సిందే..

ABN , First Publish Date - 2020-10-31T01:42:15+05:30 IST

ప్రభుత్వం, మున్సిపల్ యంత్రాంగం ఎన్నిసార్లు హెచ్చరికలు చేస్తున్నా వాటిని బేఖాతరు చేస్తూ మాస్క్‌లు లేకుండా..

మాస్క్‌ లేకుంటే చీపురుకట్టతో రోడ్లు తుడవాల్సిందే..

ముంబై: ప్రభుత్వం, మున్సిపల్ యంత్రాంగం ఎన్నిసార్లు హెచ్చరికలు చేస్తున్నా వాటిని బేఖాతరు చేస్తూ మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న వారిపై బ్రిహీన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కొరడా ఝలిపించింది. మాస్క్‌లు లేకుండా బయట తిరుగుతూ, జరిమానా చెల్లించేందుకు మొరాయిస్తున్న వారి చేతికి చీపురుకట్టలు ఇచ్చి ముంబై రోడ్లు తుడిపించాలని నిర్ణయించింది. మాస్క్‌లు తప్పనిసరి చేసినా నిబంధనలు పాటించని వారి నుంచి గత 212 రోజుల్లో 3 కోట్ల 49 లక్షలకు పైగా వసూలు చేసినట్టు బీఎంసీ శుక్రవారం ప్రకటించింది.


ప్రోటోకాల్ పాటించని కొందరు జరిమానా కట్టేందుకు నిరాకరిస్తుండగా, మరికొందరికి స్థోమత లేక కట్టలేకపోతున్నారని బీఎంసీ చెబుతోంది. ప్రభుత్వం పలు మార్లు విజ్ఞప్తులు చేస్తున్నా ముంబై ప్రజలు మాస్క్‌లు లేకుండా వాహనాలపై తిరుగుతుండటం, బహిరంగంగా సంచరిస్తుండటం ఇబ్బందికరంగా మారుతోందని అంటోంది. ఈ నేపథ్యంలో నిఘా టీమ్‌లను బీఎంసీ రంగంలోకి దింపింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై, ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలపై ఈ టీమ్‌లు దృష్టి సారించనున్నాయి.


కాగా, కొందరు పట్టుబడినప్పుడు క్షమాపణలు చెబుతుండటంతో వారికి స్వచ్ఛందంగా కమ్యూనిటీ వర్క్ అప్పగిస్తున్నామని, మరికొందరు మున్సిపల్ అధికారులను బెదిరిస్తుండటం కూడా తమ దృష్టికి వచ్చిందని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ విశ్వాస్ మోతే చెప్పారు. పరిస్థితి తీవ్రను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు ఉల్లంఘించే వారిపై కనీసం 20,000 కేసులు రిజిస్టర్ చేయాలంటూ బీఎంసీ కమిషనర్ ఐఎస్ చాహల్ తమ సివిక్ టీమ్స్‌కు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

Updated Date - 2020-10-31T01:42:15+05:30 IST