వాడదు.... కాయదు

ABN , First Publish Date - 2021-01-12T05:28:44+05:30 IST

పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 14,500 హెక్టార్లలో చీనీ పంట సాగులో ఉంది.

వాడదు.... కాయదు
తీవ్ర వర్షాలతో వాడుమొగం పట్టకపోవడంతో కాపు రాని చీనీతోట

 అకాల వర్షాలతో చీనీ రైతు విలవిల

 ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు


పులివెందుల నియోజకవర్గంలో చీనీ తోటల రైతులు ఎప్పుడూ లేని గడ్డుకాలాన్ని చవిచూస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో వరుస వర్షాలతో చీనీ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏడాది డిసెంబరు, జనవరి మాసాల్లో కాపు వచ్చేందుకు రెండు నెలల ముందు నుంచి నీరు పెట్టకుండా చెట్లను వాడు వచ్చేలా చేసిన అనంతరం నీరు పెడితే కాపు బాగా వచ్చేది. కానీ ఈ ఏడాది వరుస తుఫాన్లు, అకాల వర్షాలతో ఆ పరిస్థితి లేదు. తోటల్లో చీనీ చెట్లు వాడుకు గురయ్యే వాతావరణం లేదు. దీంతో ఈ ఏడాది చీనీ దిగుబడి ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


పులివెందుల, జనవరి 11: పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 14,500 హెక్టార్లలో చీనీ పంట సాగులో ఉంది. ముఖ్యంగా సింహాద్రిపురం, లింగాల, వేముల, తొండూరు, పులివెందుల, వేంపల్లె తదితర మండలాల్లో విరివిగా చీనీ తోటలు సాగు చేశారు. ప్రతి ఏడాది డిసెంబరు, జనవరి మాసాల్లో రైతులు చీనీ తోటలకు నీరు పెట్టేవారు నీరు పెట్టిన అనంతరం కాపు వస్తుంది. నీరు పెట్టక ముందు దాదాపు రెండు నెలల పాటు నీరు పెట్టకుండా చీనీ చెట్లు వాడు వచ్చేలా రైతులు పొలంలో దున్నడం చేసేవారు. డిసెంబరు నాటికి పొలంలో వ్యవసాయ పనులు పూర్తి చేసుకొని తోటకు అవసరమైన ఎరువులు చల్లి నీరు పెట్టేందుకు రైతులు సిద్ధమవుతారు. నీరుపెట్టిన వారం పది రోజుల్లో ఇగురు వచ్చి ఇగురు ద్వారా పూత పిందె రావడం సహజం. కానీ ఈ ఏడాది ఖరీఫ్‌ వద్ద నుంచి జనవరి 5, 6 తేదీల వరకు వరుసగా తుఫాన్లు, అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చీనీతోటలు ఇప్పుడు పచ్చగా కళకళలాడుతున్నాయి. ఒక్క వర్షం కురిసిందంటే మళ్లీ చెట్టు వాడు రావడానికి దాదాపు 30 నుంచి 40 రోజులు పడుతుంది. ఈ మధ్యలో మళ్లీ వర్షం వస్తే చీనీచెట్లు వాడు రావు. దీని కారణంగా నియోజకవర్గంలో చీనీతోటల రైతులు ఈ ఏడాది కాపు రాదని ఆందోళన చెందుతున్నారు. ఎటుచూసినా చీనీ తోటలు పచ్చగా కళకళలాడుతున్నాయి. ఎకరంలో సాగు చేసే వంద చీనీ చెట్లకు 5 నుంచి 10 టన్నుల చీనీకాయల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ప్రతి రైతుకు ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టే. వేసిన పంటలు పండకపోతే అకాల వర్షానికి గురైతే ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తూ వస్తోంది. కానీ ఉద్యానపంటలు ఈ ఏడాది కోలుకోలేని దెబ్బతీశాయని, రైతులకు ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మళ్లీ జూన్‌, జూలై మాసాల వరకు కాపు వచ్చే పరిస్థితి లేదు. వేసవిలో కాపు వచ్చినా ఎండలకు అది పిందె దశలోనే రాలిపోయే అవకాశం ఉంది. 


అకాల వర్షాలతో తోటల్లో దిగుబడి లేదు

ఈ ఏడాది వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా చీనీ తోటల్లో దిగుబడి లేదు. చీనీ చెట్టు కాపు రావాలంటే చెట్టు వాడు వచ్చిన తర్వాతే నీరు పెడితే కాపు వస్తుంది. అకాల వర్షంతో కాపు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఈ ఏడాది కాపు లేకపోవడంతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. 

-పద్మనాభరెడ్డి, చీనీ రైతు, సింహాద్రిపురం


చీనీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి 

ఈ ఏడాది తీవ్ర వర్షాలతో చీనీ తోటల్లో దిగుబడే లేదు. కాపు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరో ఆరు నెలల పాటు చీనీ తోటలను కాపాడుకోవాల్సిందే. తోటలను కాపాడుకునేందుకు ప్రభుత్వం సాయం అందించాలి.

-సోమ కొండారెడ్డి, అంకాళమ్మగూడూరు, సింహాద్రిపురం



Updated Date - 2021-01-12T05:28:44+05:30 IST