Abn logo
Nov 29 2020 @ 01:09AM

దొరకని యువకుల ఆచూకీ

ఉప్పుటేరులో ఆటో బోల్తా 

మొగిలిచెర్లకు చెందిన ఇద్దరు గల్లంతు

గాలిస్తున్న ఫైర్‌ సిబ్బంది

పర్యవేక్షిస్తున్న కందుకూరు డీఎస్పీ, సబ్‌కలెక్టర్‌ 

లింగసముద్రం, నవంబరు 28 : ఉప్పుటేరులో గల్లంతైన ఇద్దరు యువకుల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. శుక్రవారం రాత్రి 9.30 సమయంలో పెదపవని ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద వరద ఉధృతికి ఆటో బోల్తాపడిన ఘటనలో మొగిలిచెర్లకు చెందిన నాగెళ్ల బాబూరావు(21), నాగెళ్ళ అజయ్‌(19) గల్లంతయ్యారు. బాబూరావు, అజయ్‌లు లింగసముద్రం మండలంలోని జంగాలపల్లిలో బంధువుల వివాహానికి హాజరయ్యారు. అనంతరం బాబూరావు కావలిలోని తన అత్తగారింటికి వెళ్లేందుకు సొంతంగా ఆటోలో బయలుదేరారు. అయితే పెదపవని సమీపంలో ఉన్న ఉప్పుటేరు వద్దకు వెళ్లగా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గ్రామస్థులు చెప్పినా వినిపించుకోకుండా వేగంగా బ్రిడ్డిని దాటేందుకు ప్రయత్నించాడు. గతంలో బ్రిడ్జిపై వేసిన ఒక లేయర్‌ రోడ్డు కోసుకుపోయింది. దీంతో వేగంగా వెళ్తున్న ఆటోకు గుంత తగలడంతో అడి బోల్తా కొట్టి ఉప్పుటేరులో పడిపోయింది. అందులో ఉన్న ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.


స్పందించిన పోలీస్‌, రెవెన్యూ, ఫైర్‌ అధికారులు

సమాచారం అందుకున్న కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసులు, గుడ్లూరు ఎస్‌ఐ మల్లికార్జునరావు, లింగసముద్రం తహసీల్దార్‌ ఆర్‌. బ్రహ్మయ్య, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని జనరేటర్‌ సాయంతో లైట్లు వేసి గాలింపు చేపట్టారు. అయినా వారి జాడ తెలియలేదు. కందుకూరు సబ్‌కలెక్టర్‌ భార్గవతేజ కూడా ఉప్పుటేరు వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలిసిన యువకుల తల్లిదండ్రులు, బంధువులు సంఘటన ప్రాంతానికి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. బాబూరావుకు గత ఏడాదే వివాహమైందని వారు చెప్పారు. అన్నదమ్ముల కుమారులైన యువకుల జాడ కనిపించకపోవడంతో బంధువుల్లో విషాదచాయలు అలముకున్నాయి.

Advertisement
Advertisement
Advertisement