కొండల మీదే ఉంటాం... దిగి వచ్చేది లేదు

ABN , First Publish Date - 2021-06-21T06:31:06+05:30 IST

పోలవరం ప్రాజె క్టు కింద చట్ట ప్రకారం పునరావాసం పూర్తి చేసే వరకు తాము దిగి వచ్చేదే లేదని, అవసరమైతే వరద నీళ్లలో ఎన్నాళ్లైనా కొండల మీదే కాపురాలు ఉంటామని దేవీపట్నం మండలం తాళ్లూరు గిరిజనులు రంపచోడవరం ఆర్డీవో శీనానాయక్‌కు తేల్చి చెప్పారు.

కొండల మీదే ఉంటాం... దిగి వచ్చేది లేదు
తాళ్లూరులో నిర్వాసితులతో మాట్లాడుతున్న ఆర్డీవో శీనానాయక్‌

తాళ్లూరులో ‘పోలవరం’ నిర్వాసితులతో ఆర్డీవో శీనానాయక్‌ సమావేశం
మా అభిప్రాయంతో సంబంధం లేకుండా నిర్మించిన గిరిజన కాలనీలు మాకొద్దు
పునరావాసం తీరును ఆర్డీవో ముందు ఎండగట్టిన గిరిజనులు

దేవీపట్నం, జూన్‌ 20: పోలవరం ప్రాజె క్టు కింద చట్ట ప్రకారం పునరావాసం పూర్తి చేసే వరకు తాము దిగి వచ్చేదే లేదని, అవసరమైతే వరద నీళ్లలో ఎన్నాళ్లైనా కొండల మీదే కాపురాలు ఉంటామని దేవీపట్నం మండలం తాళ్లూరు గిరిజనులు రంపచోడవరం ఆర్డీవో శీనానాయక్‌కు తేల్చి చెప్పారు. శనివారం  ఆయన దేవీపట్నం మండలం తాళ్లూరు,  తెలిపేరు గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంలో తాళ్లూరు గిరిజన నిర్వాసితులతో జరిగిన సమావేశంలో వారు తమ గోడు వెలిబుచ్చుతూనే పునరావాస అధికారుల తీరును ఎండగట్టారు. తమకు చట్ట ప్రకారం రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తేనే కానీ తాము గ్రామాలను వదిలేది లేదని తేల్చి చెప్పారు. వరద ప్రమాదం ఉందని, తాళ్లూరు నిర్వాసితులకు పెదభీంపల్లిలో నిర్మిస్తున్న 115 పునరావాస గృహాలకు తరలి రావాలని కోరారు. అయితే  గిరిజన నిర్వాసితులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. తాము ఆది నుంచీ దేవీపట్నం మండలం ఎం.రావిలంకలో అధికారులు చూపిన స్థలాన్ని అంగీకరించామని, అయితే తమ అభిప్రాయం తీసుకోకుండా అధికారులు పెదభీంపల్లిలో కాలనీ నిర్మిస్తున్నారని, ఇది తమకు సమ్మతం కాదని, దీనికి తాము ఏరూపంలోనూ అంగీకరించలేదని ఆర్డీవోకు వివరించారు. తమ అభ్యంతరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమకు ఎం.రావిలంకలోనే పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలని కోరారు. తమకు నచ్చినట్టుగా   చట్ట ప్రకారం జరిగితేనే తాము గ్రామం ఖాళీ చేస్తామని, గత రెండు నెలలుగా అధికారులు రేషన్‌ అందించకపోయినప్పటికీ జీవిస్తున్నామని, అధికారులు సహకరించకపోయినా ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు.


Updated Date - 2021-06-21T06:31:06+05:30 IST