Abn logo
Jun 3 2020 @ 15:57PM

లడఖ్‌లో పరిస్థితిపై నార్తర్న్ ఆర్మీ కమాండర్ సమీక్ష

న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో లేహ్‌లో పరిస్థితిని నార్తర్న్ ఆర్మీ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషీ సమీక్షించారు. ఆయన గురువారం వరకు లేహ్‌లోనే ఉంటారని సమాచారం. 


ఉధంపూర్ కేంద్రంగా పని చేస్తున్న నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషీ లేహ్‌కు మంగళవారం రావలసి ఉందని, అయితే అనివార్య పరిస్థితుల వల్ల ఆయన రాలేకపోయారని తెలుస్తోంది. 


ప్రస్తుత ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ సైన్యం సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ సమావేశం జరగడానికి ముందు లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషీ లేహ్‌లో పర్యటిస్తున్నారు. 


లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషీ గతంలో 14 కార్ప్స్‌కు నాయకత్వం వహించారు. ఈ ఆర్మీ డివిజన్ లడఖ్‌ భద్రత బాధ్యతలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం చైనా ఆర్మీని ఈ విభాగమే ఎదుర్కొంటోంది. ఈ ప్రాంతంపై లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషీకి మంచి అవగాహన ఉంది. 


భారత్, చైనా సైనికులు దాదాపు ఒక నెల నుంచి లడఖ్‌లో పరస్పరం తలపడుతున్నారు. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు ఈ నెల 2న ఇరు దేశాల మేజర్ జనరల్ స్థాయి కమాండర్లు చర్చలు జరిపారు. 


Advertisement
Advertisement
Advertisement