North Korea లో తీవ్ర పరిస్థితులు.. Kim Jong Un స్పందన ఇదీ..

ABN , First Publish Date - 2022-05-15T18:53:47+05:30 IST

ప్యాంగ్‌యాంగ్ : కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) సారధ్యంలోని ఉత్తరకొరియా(North Korea)లో కొవిడ్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.

North Korea లో తీవ్ర పరిస్థితులు.. Kim Jong Un స్పందన ఇదీ..

ప్యాంగ్‌యాంగ్ : కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) సారధ్యంలోని ఉత్తరకొరియా(North Korea)లో కొవిడ్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన మూడు రోజుల్లో ఏకంగా 8,20,620 కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకినవారిలో 42 మంది మృత్యువాడపడగా.. 324,550 మందికి వైద్య చికిత్స కొనసాగుతోంది. ఈ మేరకు ఉత్తరకొరియా అధికార మీడియా సంస్థ కేసీఎన్‌ఏ పేర్కొంది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయని వివరించింది. 


ఉత్తరకొరియాలో తొలి కేసు నమోదయిన వెంటనే అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దేశంలోని అన్ని ప్రావిన్సులు, నగరాలు, గ్రామీణ ప్రాంతాలు సంపూర్ణంగా లాక్‌డౌన్‌లో ఉన్నాయని రిపోర్ట్ పేర్కొంది. ప్రజలకు వ్యాక్సినేషన్ లేకపోవడంతో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దీంతో వైరస్ కట్టడికి ప్రభుత్వం  కఠిన చర్యలు తీసుకుందని వివరించింది. రోజువారీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని రెండేళ్లుగా అతలాకుతలం చేస్తుండగా.. ఉత్తరకొరియా‌ తొలిసారి కరోనా కేసులను ఎదుర్కొంటుండడం గమనార్హం.


కింగ్ జాంగ్ ఉన్ స్పందన ఇదీ..

కొవిడ్ కారణంగా దేశంలో తీవ్ర మార్పులు సంభవించాయని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆందోళన వ్యక్తం చేశారు. డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా(ఉత్తరకొరియా అధికారిక నామం) ఆవిర్భావం నాటి నుంచి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని విస్మయం వ్యక్తం చేశారని కేసీఎన్‌ఏ ప్రస్తావించింది. కాగా ఉత్తరకొరియా ఆరోగ్య వ్యవస్థ చాలా నాసిరకంగా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత చెత్త ఆరోగ్య వ్యవస్థల్లో ఇదొకటి. ఆ దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ లేదు. యాంటీ వైరల్ ట్రీట్‌మెంట్ డ్రగ్స్ లేదా పెద్ద సంఖ్యలో టెస్టింగ్ చేయగల సామర్థ్యం ఆ దేశానికి లేదు. వాస్తవానికి కేసీఎన్‌ఏ రిపోర్ట్ కూడా ఈ పరిస్థితిని తెలియజేసింది. కొత్త కేసులు, మరణాలు, టెస్టింగ్ సంఖ్యను ప్రస్తావించలేదు. కానీ పెద్ద మొత్తంలో నిర్ధారణ పరీక్షలు, చికిత్స అందించలేక అవస్థలు పడుతుండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 


ఇదిలావుండగా న్యూక్లియర్ టెస్ట్‌కు సన్నద్ధమవుతున్న కిమ్ జాంగ్ ఉన్‌ను దక్షిణకొరియా, అమెరికాలు హెచ్చరించాయి. పరీక్ష నిర్వహించొద్దని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. కాగా ఇలాంటి వార్నింగ్‌లు కిమ్ జాంగ్ ఉన్‌కు కొత్తమీ కాదు. ఏ రోజైనా పరీక్ష నిర్వహించొచ్చు. అయితే దేశంలో కొవిడ్ తీవ్ర పరిస్థితుల నుంచి చర్చను పక్కదారి పట్టించేందుకు న్యూక్లియర్ టెస్ట్‌కు సిద్ధమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2022-05-15T18:53:47+05:30 IST