మొదలుకాని మున్సిపల్‌ ప్రచారాలు

ABN , First Publish Date - 2021-02-25T05:43:09+05:30 IST

గతేడాది మార్చిలో అర్ధాంతరంగా ఆగిన మున్సిపల్‌ ఎన్నికలకు ఎస్‌ఈసీ ఇటీవల షెడ్యూలు ప్రకటించినప్పటికీ జిల్లాలో ఇంకా అభ్యర్థుల ప్రచారాలు, ఎన్నికల హడావిడి మొదలు కాలేదు.

మొదలుకాని మున్సిపల్‌ ప్రచారాలు

 అంతర్గత సర్దుబాట్లు, రాజీ యత్నాలు, ఏకగ్రీవాలపై వైసీపీ దృష్టి

 అభ్యర్థులను కాపాడుకునే దిశగా టీడీపీ అడుగులు


తిరుపతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): గతేడాది మార్చిలో అర్ధాంతరంగా ఆగిన మున్సిపల్‌ ఎన్నికలకు ఎస్‌ఈసీ ఇటీవల షెడ్యూలు ప్రకటించినప్పటికీ జిల్లాలో ఇంకా అభ్యర్థుల ప్రచారాలు, ఎన్నికల హడావిడి మొదలు కాలేదు. అంతర్గత సర్దుబాట్లు, రెబెల్స్‌ను తప్పించడం, ఏకగ్రీవాలపై అధికార పార్టీ వర్గాలు దృష్టి సారించాయి. దానికి భిన్నంగా తమ అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నాల్లో  టీడీపీ నేతలు అపసోపాలు పడుతున్నారు. ఇక తిరుపతిలో టీడీపీ అభ్యర్థులకు బెదిరింపులు ఎదురవుతుండగా చిత్తూరులో వైసీపీకి రెబెల్స్‌ తలనొప్పిగా మారారు. మదనపల్లెలో టీడీపీ నేత శ్రీరామ్‌ చినబాబును దెబ్బతీసే యత్నాలు సొంతపార్టీలోనే జోరందుకున్నాయి.


తిరుపతిలో టీడీపీ అభ్యర్థులకు బెదిరింపులు


తిరుపతి నగరంలో మొత్తం 50 డివిజన్లుండగా ఇప్పటికే ఆరు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. పది మంది టీడీపీ అభ్యర్థులు గతేడాది మార్చిలోనే ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేసి వైసీపీ ముఖ్య నేతలకు అందజేసినట్టు సమాచారం. మిగిలిన 34 స్థానాలో టీడీపీ అభ్యర్థులు పోటీలో వున్నది 29 చోట్ల మాత్రమే. వారిని కూడా ఏదోవిధంగా పోటీ నుంచీ పక్కకు తప్పించే ప్రయత్నాలు అధికార పార్టీ వైపు నుంచీ జోరందుకున్నాయి. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని వారికి బెదిరింపులు వస్తున్నాయి. నగర తెలుగు మహిళ అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మకు సైతం ప్రచారం చేయకూడదని, నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవాలని బెదిరింపులు వచ్చినట్టు సమాచారం. లేదంటే కేసులు తప్పవంటూ హెచ్చరికలు జారీ అయినట్టు తెలిసింది. ఎక్కడికక్కడ అభ్యర్థుల బలహీనతలు తెలుసుకుని వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి బుల్లెట్‌ రమణపై బైండోవర్‌ కేసు పెట్టినట్టు చెబుతున్నారు. ప్రచారాలకు వెళ్ళకుండా ఇలా అడ్డంకులు సృష్టిస్తున్నట్టు టీడీపీ నేతలు, అభ్యర్థులు వాపోతున్నారు. వలంటీర్లను కూడా వైసీపీ నేతలు పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఉదాహరణకు శివజ్యోతినగర్‌ ప్రాంతంలో ఎక్కువ భూములు రెవిన్యూ రికార్డుల్లో 22ఏ కింద వున్నాయి. ఆ జాబితా నుంచీ భూములను తొలగిస్తామని వైసీపీ నేతలు వలంటీర్లను ఇంటింటికీ పంపి భూముల పత్రాలను సేకరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైతే వైసీపీ నుంచీ కూడా కేవలం ఐదారుగురు అభ్యర్థులు మాత్రమే ప్రచారం మొదలు పెట్టారు. మిగిలిన చోట్ల ఏకగ్రీవమవుతుందన్న ధీమాతో ప్రచారం కూడా మొదలుపెట్టడం లేదు. ఇక టీడీపీ అభ్యర్థులను కాపాడుకునే పనిలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. దాంతో ప్రచారాలు ఇంకా మొదలు పెట్టలేదు. ఉపసంహరణల పర్వం ముగిసే దాకా అభ్యర్థులను కాపాడుకుంటే ప్రచారం సంగతి తర్వాత చూసుకోవచ్చునన్న అభిప్రాయంతో నేతలున్నట్టు సమాచారం. దీంతో నగరంలో ఎన్నికల హడావిడి ఏమాత్రం కనిపించడం లేదు.


చిత్తూరులో వైసీపీకి రెబెల్స్‌ తలనొప్పి


చిత్తూరు నగరంలో 50 డివిజన్లుండగా 49 డివిజన్లలో పోటీ నెలకొంది.46వ వార్డులో మాత్రమే టీడీపీ అభ్యర్థి పోటీలో లేరు.వైసీపీకి సంబంధించి ప్రతి వార్డులోనూ కనీసమంటే ఆరుగురికి తక్కువ కాకుండా రెబెల్స్‌ రంగంలో వున్నారు.రెబెల్స్‌ ఎవరూ పోటీ నుంచీ తప్పుకోవడానికి సిద్ధంగా లేరు.అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యే శ్రీనివాసులు, బుల్లెట్‌ సురేష్‌, విజయానందరెడ్డి, చుడా ఛైర్మన్‌ పురుషోత్తంరెడ్డిలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పగించారు. వీరిలో ఎమ్మెల్యే మినహా ముగ్గురికీ తలా పది డివిజన్లు అప్పగించారు. దీంతో వీరు ఆయా డివిజన్లకు సంబంధించిన రెబెల్స్‌ను పిలిపించి మంతనాలు జరుపుతున్నారు. రెబెల్స్‌ తలా వంద మందికి తక్కువ కాకుండా జనాన్ని వెంటేసుకొచ్చి బలప్రదర్శనకు దిగుతున్నారు. వీరిని ఒప్పించడం నేతలకు తలకు మించిన పనవుతోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ కసరత్తు ముగించి అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందజేసేందుకు నేతలు యత్నిస్తున్నారు. ఇక టీడీపీ విషయానికొస్తే  ఎమ్మెల్సీ దొరబాబు, ముఖ్య నేతలు కటారి ప్రవీణ్‌, కాజూరు బాలాజీ తమ అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోకుండా చూసే యత్నాల్లో బిజీగా వున్నారు.టీడీపీలో వున్న మాజీ ఎమ్మెల్యే సీకేబాబు ఈ వ్యవహారాలకు దూరంగా వుంటున్నారు. నగరంలో ఆయనకు చెప్పుకోదగిన పరిచయాలు, అనుచరవర్గం, పట్టు వున్నందున సీకే సేవలను పార్టీ వినియోగించుకుంటే మంచిదన్న అభిప్రాయం శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యనేతలు ఆ దిశగా చొరవ తీసుకోవాల్సి వుంది.  

మదనపల్లె టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు

మదనపల్లె మున్సిపాలిటీలో 35వార్డులుండగా ఇప్పటికే 18, 30 వార్డులు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 33 చోట్ల పోటీ వుంది. వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యే నవాజ్‌ బాషా రోజూ అభ్యర్థులతో సమావేశమై లోతుగా సమీక్షిస్తున్నారు. అభ్యర్థి ఆర్థిక బలం, పార్టీ నుంచీ చేయాల్సింది ఏమైనా వుందా? వార్డులో సమస్యలున్నాయా? ప్రజలకు ఇవ్వాల్సిన హామీలేమిటి? ప్రత్యర్థి బలహీనతలేమిటి అన్న అంశాలపై దృష్టి సారిస్తున్నట్టు సమాచారం. దానికి తోడు తమ అభ్యర్థుల గెలుపునకు పూర్తిగా సహకరించాలని సచివాలయ ఉద్యోగులకు, వలంటీర్లకు అధికార పార్టీ నేతల నుంచీ స్పష్టమైన ఆదేశాలందాయని సమాచారం. ఆ మేరకు అభ్యర్థులు తమతమ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో రహస్య సమావేశాలు నిర్వహించినట్టు కూడా తెలిసింది.టీడీపీ బలహీనంగా వున్న చోట్ల పక్కకు తప్పించడానికి ఎమ్మెల్యే, ఎంపీ, అవసరమైతే మంత్రులతో మాట్లాడించడం కూడా చేస్తున్నట్టు సమాచారం. ఇక టీడీపీ విషయానికొస్తే అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా చేనేత సామాజికవర్గం అధికంగా వున్న నీరుగట్టుపల్లెలో 33, 34, 35 వార్డులున్నాయి. ఆ వార్డుల్లో టీడీపీ చాలా బలంగా వుంది. ఓటర్లు కూడా ఎక్కువే. సాంప్రదాయకంగా ఆ వార్డుల్లో టీడీపీకే మొగ్గు వుంటుంది. దానికి తోడు అదే ప్రాంతానికి, అదే సామాజికవర్గానికి చెందిన శ్రీరామ్‌ చినబాబు ఇటీవల తెలుగుయువత రాష్ట్ర  అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దీంతో చిన్నబుచ్చుకున్న మరో వర్గం ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో నీరుగట్టువారిపల్లె పరిధిలోని మూడు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను పోటీ నుంచీ తప్పించడానికి యత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.దీంతో అభ్యర్థులను పోటీలోనే నిలబెట్టుకోవడంతో పాటు గెలిపించుకోవడం చినబాబుకు అగ్నిపరీక్షగా మారనుంది.


పుంగనూరులో ప్రత్యేక పరిస్థితి


పుంగనూరు మున్సిపాలిటీలో ప్రత్యేక పరిస్థితి నెలకొని వుంది. ఇక్కడ 31 వార్డులుండగా 16 వార్డులకు వైసీపీ అభ్యర్థులు సింగిల్‌ నామినేషన్లు వేశారు. అంటే అవన్నీ వారికి ఏకగ్రీవమైనట్టే. వాటిలో 12వ వార్డు వైసీపీ అభ్యర్థి షాహిదా ఇటీవల మృతిచెందారు. ఆమె స్థానంలో ఇపుడు వైసీపీ నుంచీ మరొకరు నామినేషన్‌ వేయనున్నారు. ఆ అభ్యర్థి కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టే అవుతుంది. మిగిలిన 15 చోట్ల ఒకటికి మించి నామినేషన్లు దాఖలై వుండగా టీడీపీ అభ్యర్థులు కొన్ని స్థానాల్లో నామినేషన్లు వేయలేదు. నామినేషన్లు వేసిన అభ్యర్థులు కూడా గతేడాది మార్చిలోనే ఉపసంహరణ లేఖలను వైసీపీ నేతలకు అప్పగించారని, వాటిని రికార్డుల్లో నమోదు కూడా చేసేశారని సమాచారం. దీన్నిబట్టి చూస్తే పుంగనూరులో సాంకేతికంగా పోలింగ్‌ జరిగే పరిస్థితి కనిపించడంలేదు. మార్చి 3వ తేదీ సాయంత్రం వరకూ ఈ విషయంలో సస్పెన్స్‌ తప్పకపోవచ్చు. అనధికారిక సమాచారం మేరకు పంచాయతీ ఎన్నికల తరహాలో మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా వార్డులన్నీ ఏకగ్రీవమై పోలింగ్‌ జరగకపోవచ్చునని తెలుస్తోంది.  


మిగిలిన చోట్లా అదే పరిస్థితి!


పుత్తూరులో 27 వార్డులుండగా అన్నింటికీ పోటీ నెలకొంది. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాకే పోటీ విషయమై స్పష్టత రానుంది. ఇప్పటికైతే వైసీపీలో నలుగురైదుగురు  అభ్యర్థులు మాత్రమే ప్రచారం మొదలు పెట్టారు. ఎమ్మెల్యే రోజా సోదరుడు రామ్‌ప్రసాద్‌రెడ్డి అభ్యర్థుల వెంట తిరిగి ప్రచారం చేస్తున్నారు.నగరి మున్సిపాలిటీలో 29 వార్డులుండగా అన్నింటికీ పోటీ వుంది. ఇక్కడ సైతం నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయితే తప్ప ఎన్ని చోట్ల పోటీ వుంటుందన్నది చెప్పలేని పరిస్థితి వుంది.ప్రచారాలు ప్రారంభం కాలేదు. పలమనేరులో 26 వార్డులుండగా పది వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు సింగిల్‌ నామినేషన్లు వేయడంతో అవన్నీ వారికి ఏకగ్రీవమైనట్టే. మిగిలిన 16 వార్డుల్లో 17వ వార్డు టీడీపీ అభ్యర్థి కృష్ణమూర్తి ఇటీవలే వైసీపీలో చేరిపోయారు. ఆ వార్డులో ఆయన టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ ఉపసంహరించుకునే పరిస్థితి వుందని సమాచారం. రెండు ప్రధాన పార్టీల తరపునా ప్రచారాలు ఇంకా మొదలు కాలేదు. తెలుగుదేశం పార్టీలో అయితే కీలక నేతలెవరూ చొరవ తీసుకోకపోవడంతో స్తబ్దత నెలకొంది.

Updated Date - 2021-02-25T05:43:09+05:30 IST