మీ ఎర్రజెండా నర్సింహయ్యగానే సాగనంపండి.. నోముల ఆఖరి మాటలు

ABN , First Publish Date - 2020-12-02T17:54:32+05:30 IST

కమ్యునిస్టు పార్టీలంటే నిబద్ధతకు, పోరాటానికి మారుపేరు అంటారు. అలాంటి పార్టీ నుంచి వచ్చిన నేత నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా..

మీ ఎర్రజెండా నర్సింహయ్యగానే సాగనంపండి.. నోముల ఆఖరి మాటలు

హైదరాబాద్: కమ్యునిస్టు పార్టీలంటే నిబద్ధతకు, పోరాటానికి మారుపేరు అంటారు. అలాంటి పార్టీ నుంచి వచ్చిన నేత నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా.. సీపీఎంతో తన సుదీర్ఘ అనుబంధాన్ని పక్కనపెట్టి... గులాబీ కండువా కప్పుకున్నారు. 2014లో నాగార్జున సాగర్ నుంచి పోటి చేసి ఓటమి చెందినా... 2018లో రాష్ట్రస్థాయిలో బలమైన నాయకుడిగా పేరొందిన జానారెడ్డిపై గెలుపొంది చరిత్ర సృష్టించారు. అయితే గత ఏడేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిగా రాజకీయ ప్రయాణాన్ని సాగిస్తున్నా.. ఆయనను ఎర్రజెండా జ్ఞాపకాలు నిరంతరం వెంటాడుతున్నాయా అంటే అవుననే సమాధానమొస్తోంది. ఆయన ఆఖరు మాటలు అంటూ ఫోన్ రికార్డులు ప్రచారమవుతున్నాయి. తన మిత్రులను, కమ్యునిస్టు నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్టు ఆ ఫోన్ రికార్డుల్లో ఉంది. అవి ఏబీఎన్ చేతికి అందాయి. తనను ఎర్రజెండా నర్సింహయ్యగానే సాగనంపాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తి పలువురి కంటతడి పెట్టిస్తోంది. ఆ ఫోన్ రికార్డుల్లో ఇలా ఉంది. 


‘భగవంతుడు నన్ను పిలిచాడు. ఎర్రజెండా నర్సింహయ్యగానే నా అంతిమ సంస్కారాలను నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమందిని తెలిసో, తెలియకో ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అన్యథా భావించొద్దు. నర్రా రాఘవరెడ్డి శిష్యుడిగా, నకిరేకల్ ఎర్రజెండా బిడ్డగా.. ఎర్రజెండా బిడ్డగానే నన్ను సాగనంపుతారని కోరుకుంటున్నాను. ఇదే చివరి రాత్రి. ఆఖరు మాటలుగా భావించండి. రేపటి భవిష్యత్తు అంతా కమ్యునిస్టు పార్టీలది. మీరంతా కమ్యునిస్టు బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాను. సెలవు.


మీ నర్సింహయ్యను మాట్లాడుతున్నాను. గత 30 ఏళ్లుగా మీరిచ్చిన మద్దతునే నేను ఎదిగాను. నేను ఎర్రజెండాకు రుణపడి ఉన్నాను. మరోరకంగా భావించొద్దు. మీ అందరికీ శాశ్వతంగా సెలవు పెట్టి పోతున్నాను. మీ అందరూ అంతిమ వీడ్కోలు పలుకుతారని ఆశిస్తున్నాను. 


భారత కమ్యునిస్టు, మార్క్సిస్టు మిత్రులకు... పార్టీని ముందుకు తీసుకు వెళ్లడానికి కంకణబద్ధులైనటువంటి కామ్రేడ్ కళాకారుల సోదరులకు పేరుపేరునా ... విప్లవ కళాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ నర్సింహయ్యగా.. మీ ఎర్రజెండా నర్సింహయ్యగా నేను కోరుకునేది ఒక్కటే. మీ అందరినీ ఎడబాసి ఏడేళ్లు గడిచాయి. ఏడేడు లోకాలకు అందకుండా పోతానని ఎప్పుడూ అనుకోలేదు. ఆ పరిస్థితి వస్తదని కూడా నేను కలగలనలేదు. భగవంతుడు నన్ను పిలిచినాడు... నేను వెళతా ఉన్నా. మీరంతా మీ ఎర్రజెండా నర్సింహయ్యగా నా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’  


ఇదిలా ఉంటే ... నోముల నర్సింహయ్యవిగా చెబుతున్న ఫోన్ రికార్డులు ఫేక్ అని తెలంగాణ రాష్ట్ర సమితి ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారని... అవి నిజమైనవి కావని తమ ప్రకటనలో పేర్కొంది. అసాంఘీక శక్తుల చర్యల్లో ఇది భాగమని టీఆర్ఎస్ తెలిపింది. 

Updated Date - 2020-12-02T17:54:32+05:30 IST