ఇలా చేస్తే మనమంతా సేఫ్.. Pegasus దరిచేరదు! నెట్టింట్లో రచ్చ రచ్చ!

ABN , First Publish Date - 2021-07-22T00:58:53+05:30 IST

సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ..నోకియా ఉంటే పెగాసస్ దరిచేరదా..

ఇలా చేస్తే మనమంతా సేఫ్.. Pegasus దరిచేరదు! నెట్టింట్లో రచ్చ రచ్చ!

ఇంటర్నెట్ డెస్క్: పెగాసస్ పుణ్యమా అని మొబైల్ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా ఈ స్పైవేర్ స్మార్ట్ ఫోన్లలో ప్రవేశించగలదని తెలియడంతో అనేక మంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. యాంటీవైరస్‌లకు దొరకుండా, ఆపరేటింగ్ సిస్టమ్స్‌లోని రక్షణ వ్యవస్థల్నీ చేధిస్తూ ఫోన్లలోకి చొరబడే నిఘా సాఫ్ట్‌వేర్‌లు కూడా ఉంటాయా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే.. ఇలా ఆశ్చర్యపోవడంలో వింతేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. సైనిక అవసరాలను తీర్చే స్థాయిలో ఈ స్పైవేర్‌ను అభివృద్ధి చేయడంతో సామాన్యుల ఊహకు అందని ఫీట్లు చేస్తోందీ స్పైవేర్. 


మరోవైపు.. ఈ స్పైవేర్‌ల నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న అంశంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నెటిజన్లు తమకు తోచిన పరిష్కారాలను తెగ పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో సరదా కోసం పెట్టిన ఓ సోషల్ మీడియా కామెంట్‌ ప్రస్తుతం బాగా వైరల్ అయింది. హ్యాకింగ్‌కు ఆస్కారం కల్పించే స్మార్ట్ ఫోన్లకు బదులు మనందరం ఒకప్పటి నోకియా ఫోన్లకు మారిపోవాలంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యను అనేక మంది సీరియస్‌గా తీసుకుంటున్నారు.


మరి..పెగాసస్‌ సమస్యకు నోకియానే పరిష్కారమా.. నోకియా ఉంటే మనమంతా సేఫేనా..? అంటే కానేకాదంటున్నారు సైబర్ నిపుణులు. వాస్తవానికి పాత ఫోన్లలో వాడే సాఫ్ట్‌వేర్‌నే సులువుగా హ్యాకింగ్ చేయవచ్చు.  వీటిల్లోని సాఫ్ట్‌వేర్‌లలో అనేక లోపాలు ఉంటాయని, ఎవరైనా సరే చాలా సులువుగా ఈ ఫోన్లను హ్యాక్ చేసి సంభాషణలు వినొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతోటి దాని కోసం ఏకంగా మిలిటరీ స్థాయి స్పైవేర్‌ల అవసరం ఉండదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. 


అయితే..ఒక్క అంశంలో మాత్రం స్మార్ట్ ఫోన్ల కంటే పాత నోకియా ఫోన్లే బెటరట. నోకియా ఫోన్లతో కాల్స్ చేయడం, ఎస్‌ఎమ్ఎస్  పంపించడం మినహా మరేమీ చేయలేం. మహా అయితే..ఓ చిన్న గేమ్ ఆడుకోవచ్చు.  ఇక స్మార్ట్ ఫోన్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అవి మన జీవితాన్నే ప్రతిబింబిస్తాయి. ఎన్నో ఫొటోలను, వ్యక్తిగత వివరాలను, కీలక డాక్యుమెంట్లను స్మార్ట్ ఫోన్లలో స్టోర్ చేసుకోవచ్చు. ఇక స్మార్ట్‌ ఫోన్‌తో చేసే ఆర్థిక లావాదేవీల గురించి ఎంత చెప్పుకున్నా సరిపోదు!  కాబట్టి.. స్మార్ట్ ఫోన్‌లోకి పెగాసస్ లాంటి సాఫ్ట్‌వేర్ చొరబడితే జీవితం మొత్తం ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చేస్తుందని నిపుణులు అంటున్నారు.


సో.. పెగాసస్ గురించి ఆందోళన మరీ ఎక్కువైతే నిరభ్యంతరంగా పాత నోకియా ఫోన్లకు షిఫ్ట్ అయిపోవచ్చు. వీటితో ఫోన్ ట్యాపింగ్ మినహా మరేరకమైన నిఘాకు అవకాశం లేదు. కానీ.. భద్రతాపరంగా స్మార్ట్ ఫోన్లు పాత నోకియాల కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనవి. ఇవి హ్యాకింగ్ వలకు అంత ఈజీగా చిక్కవు. ఇక గూగుల్, ఆపిల్ సంస్థలు ఎప్పటికప్పుడు తమ ఆపరేటింగ్ సిస్టమ్స్‌‌ను అప్‌డేట్ చేస్తూ స్మార్ట్ ఫోన్లను మరింత శత్రుదుర్భేధ్యంగా మారుస్తుంటాయి. ఈ కారణంగానే పెగాసస్ లాంటి మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2021-07-22T00:58:53+05:30 IST