దిగుబడి లేదు.. ధర లేదు

ABN , First Publish Date - 2022-04-25T05:52:04+05:30 IST

పసుపు పంట సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పసుపు పంటకు మంచి గిరాకీ ఉంటుందని భావించి వందల ఎకరాల్లో రైతులు పసుపు సాగు చేశారు. గత ఏడాది తుఫాన్‌ ప్రభావం వల్ల పంట దెబ్బతిని దిగుబడి బాగా తగ్గిపోయింది. ధర అయినా ఆశాజనకంగా ఉంటుందని భావిస్తే వారి ఆశలపై నీళ్లు చల్లినట్లు ఉంది.

దిగుబడి లేదు.. ధర లేదు
సిద్ధవరంలో కుప్పగా పోసిన పసుపు కొమ్ములు

మార్కెట్‌యార్డు, ఇళ్లలో నిల్వలు 

ఆదుకోని ప్రభుత్వం  

చేయూత కోసం పసుపు రైతుల ఎదురు చూపు 

పోరుమామిళ్ల, ఏప్రిల్‌ 24: పసుపు పంట సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పసుపు పంటకు మంచి గిరాకీ ఉంటుందని భావించి వందల ఎకరాల్లో రైతులు పసుపు సాగు చేశారు. గత ఏడాది తుఫాన్‌ ప్రభావం వల్ల పంట దెబ్బతిని దిగుబడి బాగా తగ్గిపోయింది. ధర అయినా ఆశాజనకంగా ఉంటుందని భావిస్తే వారి ఆశలపై నీళ్లు చల్లినట్లు ఉంది. గతంలో ప్రభుత్వం రైతులు పండించిన పుసుపును కొనుగోలు చేసి ధరను నిర్ణయించేది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేకపోవడంతో పసుపు పండించిన రైతులు మార్కెట్‌యార్డ్‌ గోడౌన్లలో నిల్వ ఉంచగా, మరి కొందరు ఇళ్లలోనే నిల్వ ఉంచి మంచి ధర ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూపులు చూస్తున్నారు. 

పోరుమామిళ్ల వ్యవసాయ డివిజన్‌ పరిధిలో చెర్లోపల్లి, సిద్ధవరం ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా పసుపు పంట సాగు చేస్తారు. ఎకరాకు దాదాపు లక్షకు పైగా పెట్టుబడులు పెడతారు.  కనీసం 30 క్వింటా ళ్లు దిగుబడి వస్తే పెట్టుబడులు పోను కనీసం కష్టపడ్డదానికి ఫలితం ఉంటుంది.  అయితే ప్రస్తుతం దిగుబడి సరిగా లేకపోవడం, ధర కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  చర్లోపల్లి ప్రాంతంలో పండించిన పసుపు పంటకు గుంటూరు, దుగ్గిరాలలో మంచి గిరాకీ ఉంటుంది. గతంలో ప్రభుత్వమే క్వింటాకు సుమారు రూ.6500 ధర నిర్ణయంచి కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోగా క్వాలిటీని బట్టి రూ.5వేల వరకు ధర పలుకుతుండడంతో చాలా మంది రైతులు కడప మార్కెట్‌యార్డ్‌లో నిల్వ ఉంచారు. పోరుమామిళ్ల మండలంలో దాదాపు 318 ఎకరాలకు పైగా, కాశినాయన మండలంలో 185 ఎకరాలు, కలసపాడులో 90 ఎకరాలకు పైగా పసుపు సాగు చేశారు. ఇప్పటికే చాలా మంది కల్లాల్లో ఉడకబెట్టి క్వాలిటీ ప్రకారం వేరు చేసి మార్కెట్‌ యార్డులకు తరలించారు. పోరుమామిళ్ల మండలంలోని సిద్దవరం, టేకూరుపేట, సూరిశెట్టిపల్లి ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కొంత మంది రైతులు ధర వస్తుందని ఇళ్లలోనే నిల్వ ఉంచి ఎదురు చూపులు చూస్తున్నారు.  

నాలుగు ఎకరాల్లో సాగు చేస్తే...

సిద్దవరం గ్రామంలో దాదాపు 4 ఎకరాలకు పైగా పసుపు సాగు చేశాం. తుఫాన్‌ తాకిడికి ఎకరాకు పైగా పంట దెబ్బతినడంతో అదంతా దున్నేయాల్సి వచ్చింది. మిగిలిన మూడు ఎకరాలకు 90 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 50 క్వింటాలే దిగుబడి వచ్చింది. పసుపును కడప గోడౌన్‌లో నిల్వ ఉంచాం. ధర  కోసం ఎదురు చూస్తు న్నాం. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.

- సునీల్‌కుమార్‌, సిద్దవరం


ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడే వచ్చింది

ఎకరాకు లక్షకు పైగా పెట్టుబడి పెట్టి పసుపు పండిస్తే అకాల వర్షాలు, వరదల కారణంగా కారణంగా పంట దిగుబడి సగం తగ్గింది. పసుపు సాగు చేసిన మా రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వం  గతంలో లాగా పసుపును కొనుగోలు చేసి ఆదుకోవాలి. 

- సుధాకర్‌రెడ్డి, రైతు, సిద్దవరం 


Updated Date - 2022-04-25T05:52:04+05:30 IST