తాగునీటి సమస్య తలెత్తకూడదు

ABN , First Publish Date - 2021-02-25T05:50:13+05:30 IST

వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లు, మున్సిపల్‌ కమిషనర్లను కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆదేశించారు.

తాగునీటి సమస్య తలెత్తకూడదు


  1. కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ 
  2. మున్సిపల్‌ అధికారులతో సమీక్ష


కర్నూలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 24: వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లు, మున్సిపల్‌ కమిషనర్లను కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్‌డీలు క్షేత్రస్థాయిలో పర్యటించా లన్నారు. విద్యుత్‌ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీటిని కాలువలు, పైప్‌లైన్‌ ద్వారా లీకేజీలు కాకుండా వినియోగించుకోవాల న్నారు. బోర్లు, మోటార్లు చెడిపోతే వెంటనే మరమ్మతు చేపట్టాలని ఆదేశించారు. ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. ఎంపీడీవోలతో తరచూ సమీక్షలు నిర్వహించాలన్నారు. సమీక్షలో కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, ఆర్‌డబ్లూఎస్‌ ఎస్‌ఈ సీహెచ్‌ విద్యాసాగర్‌, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. 


పనుల వేగం పెంచండి

 గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు, వివిధ ప్రభుత్వ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని డ్వామా అధికారులు, పీఆర్‌ ఇంజనీర్లను కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశించారు. రెండు శాఖల అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల విధుల వల్ల పనుల వేగం మందగించిందని, ర్యాంకింగ్‌లో జిల్లా వెనుకబడిందని అన్నారు. డ్వామా పీడీ, పీఆర్‌ ఎస్‌ఈ క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు, ఇంజనీర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టాలని కోరారు. గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌, అంగన్‌వాడీ కేంద్రాలు తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణాలను మార్చిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదోని, నంద్యాల, కర్నూలు పీఆర్‌ ఈఈల వారీగా పనుల ప్రగతిని టెలికాన్ఫరెన్సులో సమీక్షించామని, ఇక నుంచి డివిజన్ల వారీగా సమావేశాలను పెట్టి ఏఈల వారీగా సమీక్షిస్తామని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్య ఎదురైతే వెంటనే జేసీ రాంసుందర్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని, శాఖల మధ్య సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఎండలు పెరుగుతున్నాయని, గ్రామాల్లో ఉన్న చోటనే ఉపాధి హామీ పనులను కల్పించాలని డ్వామా పీడీ అమర్నాథ్‌ రెడ్డిని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్సులో జేసీ రామసుందర్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం, ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు

Updated Date - 2021-02-25T05:50:13+05:30 IST