పాఠ్యపుస్తకాలేవీ?

ABN , First Publish Date - 2021-07-20T06:31:20+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమై 20రోజులు కావొస్తున్నా నేటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు. సాధారణంగా వేసవి సెలవుల్లోనే ఎ మ్మార్సీలకు పాఠ్యపుస్తకాలు చేరాల్సి ఉంటుంది.

పాఠ్యపుస్తకాలేవీ?

పూర్తిస్థాయిలో పంపిణీకి నోచుకోని వైనం

అసలే ఆన్‌లైన్‌ తరగతులు, ఆపై పుస్తకాల కొరత

ఉమ్మడి జిల్లాకు 13.95లక్ష పుస్తకాలకు వచ్చింది 8.90లక్షలే


మోత్కూరు : ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమై 20రోజులు కావొస్తున్నా నేటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు. సాధారణంగా వేసవి సెలవుల్లోనే ఎ మ్మార్సీలకు పాఠ్యపుస్తకాలు చేరాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుత విద్యాసంవత్సరం జూలైలో ప్రారంభమైనా ప్రాథమిక తరగతులకు చెంది న 20శాతం పాఠపుస్తకాలు, ఉన్నత తరగతులకు సంబంధించి 50 శాతం పుస్తకాలు మాత్రమే ఎమ్మార్సీలకు వచ్చాయి. 



ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దూరదర్శన్‌(యాదగిరి), టీశాట్‌ చానళ్ల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు ప్రసారమవుతున్నాయి. ఈ ప్రసారాల కు విద్యార్థులంతా హాజరుకావడం లేదు. మొబైల్‌ ఫోన్‌ ఉన్నా నెట్‌వర్క్‌ సరిగా లేకపోవడం, ఫోన్లు తల్లిదండ్రుల వద్ద ఉండటం, టీవీ సౌకర్యం ఉన్నా శ్రద్ధలేకపోవడం తదితర కారణాలతో చాలామంది పిల్లలు ఆటపాటలతోనే కాలం గడిపేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా నిరుపేద కుటుంబాల వారు. వారి తల్లిదండ్రులు వ్యవసాయపనులు, కూలికి వెళ్తున్నారు. కొందరు పిల్లలు తల్లిదండ్రులకు తోడుగా పనులకు, ముఖ్యంగా పత్తి చేలల్లో కలుపు తీసేందు కు వెళ్తున్నారు. మరికొందరు ఇంటి వద్దే ఉంటున్నా పర్యవేక్షణ లేక ఆన్‌లైన్‌ పాఠాలు వినడం లేదు. ఈ పరిస్థితుల్లో పుస్తకాలు ఉంటే పిల్లలకు కాస్తయినా చదువుపై శ్రద్ధ ఉంటుందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.


పుస్తకాల కొరతకుతోడు ఆన్‌లైన్‌ పాఠాలు

గత ఏడాది కరోనా కారణంగా 2020-21 విద్యాసంవత్సరం ఆన్‌లైన్‌ బోధనతోనే ముగిసింది. ఆ విద్యాసంవత్సరం చివరలో పాఠశాలలు తెరిచినా సెకండ్‌వేవ్‌ కారణంగా మూసివేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేశారు. ఈ ఏడాది జూన్‌ 1నుంచి పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించినా, కరోనా తీవ్రతతో తెరవలేదు. చివరికి ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి జూలై 1నుంచి ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు, టీవీలు లేకపోవడం, నెట్‌వర్క్‌ సరిగా ఉండకపోవడం, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, డిజిటల్‌ పాఠాల ప్రసార సమయాలు సకాలంలో తెలియకపోవడం, వర్క్‌షీట్లు విద్యార్థులందరికీ అందుబాటులోకి రాకపోవడం, ప్రాథమిక తరగతుల విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం లాంటి సమస్యలతో పలువురు ఆన్‌లైన్‌ పాఠాల కు దూరమవుతున్నారు. ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలు అర్థంగాక కొంతమంది అయోమయానికి గురవుతున్నారు. అర్థం కాని విషయం అడిగి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. చదువుపై తల్లిదండ్రులకు అసక్తి ఉన్నవారు మాత్రమే వారి పిల్లలతో ఆన్‌లైన్‌ పాఠాలు వినిపిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూలీపనులకు వెళ్తున్న వారు పిల్లల చదువులపై శ్రద్ధ చూపకపోవడం, ఉపాధ్యాయుల పర్యవేక్షణ సైతం కొరవడటంతో విద్యార్థులు ఆటాపాటలతోనే కాలం గడుపుతున్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ, పరిశీలన, వ్యక్తిగత శ్రద్ధతోనే ప్రాథమిక తరగతుల విద్యార్థులకు అభ్యసనం కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని పలువురు కోరుతున్నారు. అదేవిధంగా విద్యార్థులకు పూర్తిస్థాయి పుస్తకాలు పంపిణీచేస్తే చదువులపై కొంత ఆసక్తి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.


13.95 లక్షల పుస్తకాలు అవసరం

ప్రాథమికస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు విషయాల వారీగా ఉమ్మడి జిల్లాలో 13,95,880 పుస్తకాలు అవసరం. కాగా, ఇప్పటి వరకు 8,90,180 పుస్తకాలు వచ్చాయి. అందులో సగమే జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు చేరాయి. రెండో దఫా మిగతా పుస్తకాలు వస్తాయని, అవి వచ్చాకే మొత్తం ఒకేసారి తీసుకెళ్లి పంపిణీ చేయవచ్చనే ఆలోచనలో పలువురు ప్రధానోపాధ్యాయులు వాటిని ఎమ్మార్సీల నుంచి తీసుకెళ్లలేదని తెలుస్తోంది. యాదాద్రిభువనగిరి జిల్లాకు 3,17,819 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, 1,87,310 వచ్చాయి. సూర్యాపేట జిల్లాకు 3,93,630 పుస్తకాలు కావాల్సి ఉండగా, 2,89,010 పుస్తకాలు అవసరం. నల్లగొండ జిల్లాకు 6,84,423 పుస్తకాలు అవసరం ఉండగా, 4,13,860 పుస్తకాలు వచ్చాయి. అందులో సగం మండల కేంద్రాలకు చేరగా, వాటిని కొందరు ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్లి ముందుగా వచ్చి అడిగిన విద్యార్థులకు పంపిణీచేస్తున్నారు. ఒకటో తరగతి సంబంధించి తెలుగు పాఠ్యపుస్తకాలు మాత్రమే వచ్చాయి. ఇంగ్లీష్‌, గణితం పుస్తకాలు రాలేదు. రెండో తరగతికి సంబంధించి ఏ సబ్జెక్టు పుస్తకమూ రాలేదు. మూదో తరగతికి సంబంధించి ఈవీఎస్‌ మాత్రమే వచ్చింది. మిగతా సబ్జెక్టులు రాలేదు. 4, 5 తరగతులకు ఈవీఎస్‌ రాలేదు. మిగతా తరగతులవి కూడా అరకొరగానే వచ్చారు.


ఉన్నత తరగతుల పుస్తకాలు 50శాతం వచ్చాయి : శ్రీధర్‌, మోత్కూరు ఎంఈవో

ప్రాథమిక తరగతులకు సంబంధించి చాలా తక్కువ పుస్తకాలు వచ్చాయి. ఉన్నత తరగతులకు 50 నుంచి 55శాతం పుస్తకాలు వచ్చాయి. వచ్చిన మేరకు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. మిగతా పుస్తకాలు రెండో దఫా వస్తాయన్నారు. రాగానే వాటిని సైతం పంపిణీ చేస్తాం.


Updated Date - 2021-07-20T06:31:20+05:30 IST