కశ్మీర్‌పై ఇక చర్చల్లేవ్!
ABN , First Publish Date - 2020-10-25T09:32:33+05:30 IST
కశ్మీర్ అంశంపై ఇక పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని భారత్ దాదాపుగా తేల్చిచెప్పింది. పాక్ విషయంలో ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు ఇక విలువ లేదనీ...
- పాక్‌కు తేల్చిచెప్పిన భారత్
- ఐరాస తీర్మానాలూ వ్యర్థం
- గత చర్చల ప్రణాళికకూ స్వస్తి
- గట్టి సంకేతాలిచ్చిన విదేశాంగశాఖ
న్యూఢిల్లీ, అక్టోబరు 24: కశ్మీర్ అంశంపై ఇక పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని భారత్ దాదాపుగా తేల్చిచెప్పింది. పాక్ విషయంలో ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు ఇక విలువ లేదనీ, ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) జరపడం అసాధ్యం కాబట్టి- ఆనాటి తీర్మానాలు వ్యర్థమన్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది. గత ఏడాది కాలంగా మారిన పరిణామాలతో భారత్ కశ్మీర్ విషయంలో తన వైఖరిని మరింత కఠినం చేసి పదును దేల్చింది. పాక్‌పై దూకుడు ప్రదర్శించింది.
ఉగ్రనీతి మీది...
ఈ వారంలో జరిగిన కామన్వెల్త్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాక్ మంత్రి షా మెహమూద్ ఖురేషీ కశ్మీర్‌ను ప్రస్తావించి...గత ఆగస్టు 5 నుంచి- అంటే ఆర్టికల్ 370 రద్దు నాటినుంచి ఇప్పటిదాకా అక్కడ హత్యలు, మానవహక్కుల హననం జరుగుతోందని ఆరోపించడంతో భారత్ విరుచుకుపడింది. ’కశ్మీర్ మా అంతర్గత వ్యవహారం. దీన్ని లేవనెత్తే అర్హత, హక్కు మీకెక్కడివి? కశ్మీర్లో కొంత భాగాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారే? మత పరమైన మైనారిటీలను ఊచకోత కోసిన చరిత్ర మీది. 49 ఏళ్ల కిందట తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) లో మీ ప్రజలను మీరే చంపుకున్న చరిత్ర మీది’ అని విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ తరువాత ఏషియా సొసైటీ సమావేశంలో మాట్లాడిన విదేశాంగమంత్రి ఎస్ జయశంకర్ కూడా- ’ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం పాక్‌లో ప్రభుత్వ విధానంగా మారింది. దీన్ని ఆ ప్రభుత్వాలు బహిరంగంగానే అంగీకరించి సమర్థించుకుంటున్నాయి. అలాంటి వారితో మామూలు సంబంధాలు నెలకొల్పడం చాలా కష్టంతో కూడిన పని’’ అని పరోక్షంగా ఇక చర్చల ఊసేలేదన్న సంకేతాలను ఇచ్చారు. గతం లో మాదిరిగా మళ్లీ శాంతి చర్చలకు సిద్ధపడేది లేదన్న విషయం కూడా ఆయన మాటల్లో ధ్వనించింది.
పాక్ కొత్త ప్రణాళిక.. భారత్ నో
నిజానికి భారత్‌లో మళ్లీ చర్చలు ఆరంభించడానికి ఇమ్రాన్ ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న మొయీద్ యూసుఫ్ ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. భారత్ కూడా చర్చలకు సుముఖంగానే ఉందన్న ఆయన అన్నట్లు కొన్ని వార్తాకథనాలు వెలువడ్డాయి. కానీ తాజాగా భారత్ ప్రదర్శించిన వైఖరి ఆ అవకాశాలను కొట్టిపారేసినట్లు స్పష్టమయ్యింది. భారత్‌కు సంబంధించినంతవరకూ కశ్మీర్ అనేది అసలు ఓ అంశమే కాదు (నాన్-ఇష్యూ) అన్నది విదేశాంగ శాఖ వివరణ. సుష్మాస్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఉన్నపుడు కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్న వైఖరి ఉన్నప్పటికీ ఆనాడు భారత ప్రభు త్వం పాక్‌తో శాంతి కోసం చర్చలకు సిద్ధపడింది. ఆమె హయాంలో రూపొందించిన ఎనిమిది అంశాల చర్చల ప్రణాళిక కూడా శాంతిదిశగా జరిగిన పెద్ద ప్రయత్నం. అయితే నిరుడు ఆగస్టు 5న కశ్మీర్ విభజనతో ఆ ప్రణాళిక పూర్తిగా రద్దయిపోయినట్లేనని విదేశాంగశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ’మేం అసలు మా సరిహద్దులను మార్చలేదు. అంతర్గతంగా పాలన సౌలభ్యం కోసం పరిధులు మార్చాం. చైనాలో కూడా అనేక రాష్ట్రాల పరిధులు మార్చుకున్న దృష్టాంతాలున్నాయి. కశ్మీర్ విషయమూ అంతే.. సరిహద్దులు మారిస్తేనే పొరుగుదేశాలు ప్రశ్నించాలి తప్ప ఇలాంటివి కాదు’ అని జయశంకర్ పాక్, చైనాలకు స్పష్టం చేయడం విశేషం.
కశ్మీర్‌లో పాక్ క్వాడ్‌కాప్టర్ కూల్చివేత
పాకిస్థాన్ సైన్యం ప్రయోగించిన ఓ క్వాడ్‌కాప్టర్ (డ్రోన్ లాంటిది)ను భారత సైనికులు కూల్చివేశారు. శనివారం ఉదయం 8 గంటలకు కశ్మీర్‌లోని కీరన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద దానిని గమనించిన సైనికులు కూల్చివేశారు. ఓ చైనా కంపెనీ దానిని తయారు చేసింది. కొద్ది రోజులుగా కశ్మీర్‌లో ఉగ్రవాదులను తరలించడం, డ్రోన్ల సాయం తో వారికి ఆయుధాలు చేరవేయడం వంటి చర్యలకు పాక్ పాల్పడుతోందని, ఆ కుటిల యత్నాలను ఎప్పటికపుడు తిప్పికొడుతున్నామని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే తెలిపారు.
