Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముక్కంటి ఆలయానికి దారేదీ?

శ్రీకాళహస్తి, అక్టోబరు 24: వాయులింగేశ్వరుడి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు శ్రీకాళహస్తికి వస్తుంటారు. అయితే ఆలయానికి వెళ్లే మార్గాల్లో సూచికబోర్డులు ఏర్పాటు చేయక పోవడం సమస్యగా మారింది. ముక్కంటి దర్శనం కోసం తిరుపతి వైపు నుంచి బస్సు మార్గంలో వచ్చే భక్తులు ఆలయ సమీపంలో దిగుతుంటారు. చెన్నై, విజయవాడ వైపు నుంచి కూడా పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్టాండుకు చేరుకుంటూ ఉంటారు. వీరందరూ బస్టాండు బయటకు రాగానే ఆలయం చేరుకునేందుకు వివరాలు తెలిపే సూచికబోర్డుల కోసం దిక్కులు చూస్తుంటారు. వీటి జాడ లేకపోవడంతో, ఎలా వెళ్లాలని దారి పొడవునా అడుగుతూ పాట్లు పడుతుంటారు. ఇక తమిళనాడు నుంచి వచ్చే భక్తులు వీఎంసీ కూడలి, అటు ఆర్టీసీ బస్టాండులో దిగుతుంటారు. అనంతరం శివాలయానికి దారేదని కనిపించిన వారినల్లా ప్రాధేయపడుతూ కన్పిస్తుంటారు. రాత్రిళ్లు వచ్చే భక్తులు ఈ సమాచారం కోసం ఆటోవాలాలను ఆశ్రయిస్తుంటారు. ఇదే అదనుగా ఆటోడ్రైవర్లు ఆలయం చాలా దూరం ఉందని నమ్మిస్తూ, ఆటోల్లో ప్రయాణికులను తరలిస్తున్నారు. వారు అడిగినంత ఆటో చార్జీలు ఇచ్చుకోలేని భక్తులు, పట్టణమంతా ప్రదక్షిణలు చేసి ఆలయానికి చేరుకోవాల్సి వస్తోంది. కాగా, చెన్నై వైపు నుంచి వచ్చే భక్తులు వీఎంసీ కూడలి వద్ద, విజయవాడ, హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చే భక్తులు ఏపీసీడ్స్‌ కూడలి వద్ద దిగుతుంటారు. గంటలపాటు ప్రయాణం చేయడంతో బస్సు దిగగానే, మలమూత్ర విసర్జన కోసం నలువైపులా పరుగులు తీస్తారు. ఆయా ప్రాంతాల్లో పబ్లిక్‌ టాయిలెట్స్‌ అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందుల నడుమ ఆలయం వద్దకు వెళ్తుంటారు. ఇకనైనా అధికారులు స్పందించి ముక్కంటి ఆలయానికి వెళ్లే మార్గాల్లో సూచికబోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. భక్తులు అధికంగా బస్సులు దిగే ప్రాంతాల్లో పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణం చేపట్టి సమస్య పరిష్కరించాలి. 

Advertisement
Advertisement