ధాన్యం కొనుగోలు చేయరా..?

ABN , First Publish Date - 2022-06-07T03:45:16+05:30 IST

మండలంలోని బ్రాహ్మణక్రాకలో ఈ ఏడాది సుమారు 5 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 4 లక్షల బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది.

ధాన్యం కొనుగోలు చేయరా..?
రైసు మిల్లులో నిల్వ ఉన్న ధాన్యం

444 మంది వద్ద లక్షకు పైగా బస్తాలు నిల్వ

ఆర్బీకేల్లో నిలిపివేసిన సేకరణ

రెండు నెలల నుంచి ఎదురుచూపు

ఆందోళనలో బ్రాహ్మణక్రాక రైతులు

జలదంకి, జూన్‌ 6: మండలంలోని బ్రాహ్మణక్రాకలో ఈ ఏడాది సుమారు 5 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 4 లక్షల బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ఆ మేరకు ఆర్బీకేలో ఈ క్రాప్‌ నమోదైంది. అయితే నిబంధనల ప్రకారం ఈ క్రాప్‌ నమోదైన మేరకు ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి ధాన్యం సేకరించాల్సి ఉంది. కానీ కొనుగోళ్లు నిలిపివేసేటప్పటికి 300 మంది రైతులకు సంబంధించి 1.40 లక్షల బస్తాల ధాన్యం మాత్రమే సేకరించారు. కొందరు ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించుకుని నష్టపోయారు. ఈ గ్రామంలో ఇంకా 444 మంది రైతుల వద్ద సుమారు 1.25 లక్షల బస్తాల ధాన్యం (70 కిలోలు) నిల్వ ఉన్నాయి. ఈ ధాన్యం సేకరించకుండానే బ్రాహ్మణక్రాక ఆర్బీకేలో గత నెల 14వ తేదీ నుంచి కొనుగోళ్లు నిలిపివేశారు. అయితే నిల్వ ఉన్న ధాన్యాన్ని రైతులు అనామత్తుగా మిల్లర్ల కాళ్లావేళ్లా పడి మిల్లులకు చేర్చారు. అప్పటి నుంచి ఆ ధాన్యం సేకరించాలని సంబంధిత మండల, జల్లా స్థాయిలో పౌరసరఫరాలశాఖ డీఎం, తదితర అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో సాగు పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

ఎమ్మెల్యే మేకపాటి స్పందించాలి

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తమ సమస్యను పరిష్కరించేలా ఉన్నతాధికారులతో చర్చించి న్యాయం చేయాలని బ్రాహ్మణక్రాక రైతులు విన్నవిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి వరిసాగు చేసి ధాన్యం పండిస్తే తీరా ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవాలంటే నానాతిప్పలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-06-07T03:45:16+05:30 IST