‘సాగు చట్టాలు రద్దయితే మరో 50 ఏళ్ళ వరకు ఆ సాహసం చేసేవారుండరు’

ABN , First Publish Date - 2021-01-20T00:54:38+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై అభిప్రాయాల సేకరణకు

‘సాగు చట్టాలు రద్దయితే మరో 50 ఏళ్ళ వరకు ఆ సాహసం చేసేవారుండరు’

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై అభిప్రాయాల సేకరణకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సభ్యుడొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ సంస్కరణలు ప్రస్తుతం చాలా అవసరమని, ఈ చట్టాలను ఇప్పుడు రద్దు చేస్తే, ఇటువంటి సాహసం మరే రాజకీయ పార్టీ మరో 50 ఏళ్ళ వరకు చేయబోదని అన్నారు. అయితే తాము ఈ చట్టాలను వ్యతిరేకించేవారు చెప్పే అంశాలతోపాటు, వీటిని బలపరిచేవారి వాదనలను కూడా తెలుసుకుని, నివేదికను రూపొందిస్తామని చెప్పారు. 


సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు, మహారాష్ట్రకు చెందిన షేట్కారీ సంఘటన అధ్యక్షుడు అనిల్ ఘన్వత్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, వ్యవసాయ సంస్కరణలు చాలా అవసరమని చెప్పారు. ఈ చట్టాలు ఇప్పుడు రద్దయితే, మరొక 50 ఏళ్ల వరకు మరే రాజకీయ పార్టీ ఈ సాహసం చేయబోదని చెప్పారు. అయితే తమ కమిటీ రైతులందరి అభిప్రాయాలను తెలుసుకుంటుందని చెప్పారు. ఈ చట్టాలను బలపరిచే, వ్యతిరేకించే రైతుల వాదనలను వింటుందని, ఓ నివేదికను రూపొందించి, సుప్రీంకోర్టుకు సమర్పిస్తుందని చెప్పారు. 


గడచిన 70 ఏళ్లలో అమలైన చట్టాలు రైతుల ప్రయోజనాలకు అనుగుణమైనవి కాదని, దాదాపు 4.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. రైతులు నిరుపేదలవుతున్నారని, రుణాల ఊబిలో కూరుకుపోతున్నారని తెలిపారు. కొన్ని మార్పులు అవసరమని, ఆ మార్పులు జరుగుతున్నాయని, కానీ నిరసనలు ప్రారంభమయ్యాయని అన్నారు. తమ కమిటీ మొదటి సంప్రదింపుల సమావేశం గురువారం జరుగుతుందన్నారు. రైతులతోపాటు సంబంధిత ఇతరులతో మాట్లాడతామని చెప్పారు. 


వ్యవసాయ చట్టాల అమలును సుప్రీంకోర్టు ఇటీవల నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలపై నలుగురు సభ్యులతో ఓ కమిటీని సుప్రీంకోర్టు ఈ నెల 11న నియమించింది. అగ్రికల్చర్ ఎకనమిస్ట్ అశోక్ గులాటీ, ప్రమోద్ కుమార్ జోషీ, అనిల్ ఘన్వత్, బీఎస్ మాన్‌లతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ నుంచి బీఎస్ మాన్ వైదొలగారు. మంగళవారం ఈ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనిల్ ఘన్వత్, అశోక్ గులాటీ, ప్రమోద్ జోషీ పాల్గొన్నారు. 


ఈ సమావేశం అనంతరం ఘన్వత్ మీడియాతో మాట్లాడుతూ, రైతులు, సంబంధిత ఇతరులతో మొదటి సమావేశాన్ని ఈ నెల 21న ఉదయం 11 గంటలకు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు తమ సదుపాయం మేరకు ప్రత్యక్షంగా కానీ, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కానీ ఈ సమావేశంలో పాల్గొనవచ్చునని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులు, వ్యాపారులు, మిల్లర్స్, గిన్నర్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వంటివాటికి చెందినవారు కూడా పాల్గొనవచ్చునని చెప్పారు. సలహాలను స్వీకరించేందుకు ఓ వెబ్‌సైట్‌ను ఆవిష్కరిస్తామని తెలిపారు. నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడి, వారికి నచ్చజెప్పాలని తాము కోరుకుంటున్నామన్నారు. వారు హాజరు కాకపోతే, తాము వారి వద్దకు వెళ్లే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 


10వ విడత చర్చలు బుధవారం

ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 50 రోజుల నుంచి రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సుమారు 40 రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో చర్చలు జరిపింది. ఈ చట్టాలను రద్దు చేసేందుకు విముఖత చూపుతూ, వీటిని సవరించేందుకు ప్రతిపాదనలు అందజేయాలని రైతులను కోరుతోంది. కానీ రైతులు వీటిని రద్దు చేసి తీరాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో 10వ విడత చర్చలు బుధవారం జరగబోతున్నాయి. 


Updated Date - 2021-01-20T00:54:38+05:30 IST