ముంపు ప్రాంతాల్లో నిర్మాణాలకు నో పర్మిషన్‌

ABN , First Publish Date - 2022-08-06T03:54:23+05:30 IST

మున్సిపాలిటీల పరిధిలో వరద ముంపునకు గురైన వెంచర్లు, ఖాళీ స్థలాల్లో భవిష్యత్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదనే ప్రభుత్వ నిర్ణయం ప్రజలను అయోమయా నికి గురి చేస్తోంది. మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గత నెల లో కురిసిన భారీ వర్షాలకు జిల్లా కేంద్రంతోపాటు నస్పూర్‌ మున్సిపాలిటీ, హాజీపూర్‌ మండలంలో నివాస గృహాలు వరద నీటిలో మునిగాయి.

ముంపు ప్రాంతాల్లో నిర్మాణాలకు  నో పర్మిషన్‌
నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో వాగును ఆనుకొని నిర్మించిన ఇండ్లు

అనుమతులు ఇవ్వవద్దంటూ కేటీఆర్‌ ఆదేశాలు

అనుమతులు పొందిన వెంచర్ల పరిస్థితి గందరగోళం  

అయోమయానికి గురవుతున్న రియల్టర్లు, ప్రజలు   

మంచిర్యాల, ఆగస్టు  5 (ఆంరఽధజ్యోతి): మున్సిపాలిటీల పరిధిలో వరద ముంపునకు గురైన వెంచర్లు, ఖాళీ స్థలాల్లో భవిష్యత్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదనే ప్రభుత్వ నిర్ణయం ప్రజలను అయోమయా నికి గురి చేస్తోంది. మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గత నెల లో కురిసిన భారీ వర్షాలకు జిల్లా కేంద్రంతోపాటు నస్పూర్‌ మున్సిపాలిటీ, హాజీపూర్‌ మండలంలో నివాస గృహాలు వరద నీటిలో మునిగాయి. ఇండ్లతోపాటు ఆయా ప్రాంతాల్లో అనుమతి పొందిన లేఔట్‌ వెంచర్లు సైతం నీట మునిగాయి. ముఖ్యంగా మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపాలి టీలలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. భారీ వర్షాల కారణంగా జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కాలనీ, రాంనగర్‌, రెడ్డి కాలనీ, పాత మంచిర్యాల, పద్మశాలీనగర్‌, ఇందిరానగర్‌, ఎన్టీఆర్‌ కాలనీతోపాటు నస్పూర్‌ మున్సిపా లిటీ పరిఽధిలోని వినూత్న కాలనీలో వేల సంఖ్యలో నివాస గృహాలు నీట మునిగాయి. ఆయా కాలనీల పరిధిలో వందల సంఖ్యలో ప్లాట్ల వెంచర్లు  ఏర్పాటు కాగా, వాటిలో ప్లాట్లను కొనుగోలు చేసిన ప్రజలు అయోమ యానికి గురి కావాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. 

బఫర్‌ జోన్‌లలో నిర్మాణ అనుమతులు 

మంచిర్యాల, నస్పూర్‌, బెల్లంపల్లి మున్సిపాలిటీల పరిధిలో చెరువులు, వాగులు, నదుల బఫర్‌ జోన్‌లలో పదుల సంఖ్యలో వెంచర్లు ఏర్పాటు కాగా వాటికి అనుమతులు ఉండడం గమనార్హం. గరిష్ట నీటి మట్టం నుంచి నిర్ణీత దూరం వరకు ఉండే స్థలాన్ని బఫర్‌ జోన్‌లుగా పిలుస్తారు. కాలువలు, వాగులు, చెరువులకైతే కనీసం 30 మీటర్లు బఫర్‌ జోన్‌ స్థలం ఉండగా నదులకు  వంద మీటర్ల వరకు బఫర్‌ జోన్‌ ఉంటుంది. నదు లు, వాగులు ఉప్పొంగి ప్రవహించినప్పుడు బఫర్‌ జోన్‌లలో నుంచి నీటి ప్రవాహం ఉండే అవకాశం ఉన్నందున వాటి పరిధిలో శాశ్వత నిర్మా ణాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికి జిల్లా కేం ద్రంతోపాటు నస్పూర్‌, బెల్లంపల్లి మున్సిపాలిటీల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా బఫర్‌జోన్‌లలో పెద్ద మొత్తంలో వెంచర్లు ఏర్పాటు చేయగా వాటికి మున్సిపాలిటీలు అనుమతులు మంజూరు చేయడం గమనార్హం. 

కొనుగోలుదారులకు తప్పని ఇబ్బందులు 

జిల్లా కేంద్రంతో పాటు నస్పూర్‌ మున్సిపాలిటీలో  విచ్చలవిడిగా బఫర్‌ జోన్‌ల పరిధిలోని ప్లాట్లలో నిర్మించే ఇండ్లకు అనుమతులు జారీ అయ్యాయి. చెరువు శిఖం భూముల్లోనూ అధికారులు యథేచ్ఛగా ఇంటి అనుమతులు మంజూరు చేశారు. జిల్లా కేంద్రంలోనే రాళ్లవాగు, తోళ్లవాగు పరిసర ప్రాంతాల్లో బఫర్‌ జోన్‌లలోనే వందల సంఖ్యలో ఇండ్ల నిర్మా ణాలు  జరిగాయి. వాటిలో 90 శాతం ఇండ్లకు మున్సిపాలిటీ అనుమ తులు మంజూరు చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అందజేసే ముడు పులు, నాయకుల ఒత్తిడితో అధికారులు వెంచర్లకు నిర్మాణ  అనుమ తులు మంజూరు చేశారు. మొన్నటి వరదల కారణంగా వెంచర్లు నీట మునగగా భవిష్యత్‌లో వాటికి నిర్మాణ అనుమతులు రాని పక్షంలో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. 

మంత్రి ఆదేశాలతో అయోమయం 

వరద ముంపునకు గురైన వెంచర్లు, ఖాళీ స్థలాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో పాటు ప్లాట్ల కొనుగోలుదారులు అయోమయానికి గురవు తున్నారు. బఫర్‌ జోన్‌లలో ఏర్పాటు చేసిన వెంచర్లకు అభ్యంతరాలు  చెబితే ఫర్వాలేదుకాని, ఆమోదయోగ్య స్థలాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లలో నిర్మాణాలు వద్దనడం సమంజసంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. గత నెలలో వచ్చిన వరదలు 30 సంవత్సరాలలో సంభవించ లేదని, ఏదో ఒకసారి ముంపునకు గురైనంత మాత్రాన ఆ ప్రాంతాలన్నిం టిని ముంపు ప్రాంతాలుగా పరిగణించడం భావ్యం కాదని అభిప్రాయ పడుతున్నారు. లక్షలు వెచ్చించి వెంచర్ల ఏర్పాటుకు అనుమతులు తీసు కున్న తమ పరిస్థితి ఏమిటని పలువురు రియల్టర్లు ఆవేదన  చెందు తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.   

ప్రభుత్వ నిర్ణయం సరికాదు

ఊడెం వెంకటస్వామి,  రియల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు 

వరద ముంపు ప్రాంతాల్లోని వెంచర్లలోని ప్లాట్లకు నిర్మాణ అనుమ తులు ఇవ్వద్దంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు. వెంచర్లు ఏర్పాటు చేయడానికి లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి ఫీజు రూపేనా చెల్లించాం. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై ఆధారపడి వెంచర్లు ఏర్పాటు చేసిన వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అనుమతులు ఇవ్వని పక్షంలో వెంచర్లు ఏర్పాటు చేసిన స్థలాలను మార్కెట్‌ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలి. 

బిల్డర్లకు తీరని నష్టం

నీలి శ్రీనివాస్‌, బిల్డర్‌  

భవన నిర్మాణ రంగంపై ఆధారపడి వేలాది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే స్థలాల రిజిస్ర్టేషన్‌లు జరగక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూశారు. ఇప్పుడు భవన నిర్మాణ అనుమతులు ఇవ్వకపోతే ఆ రంగంపై ఆధారపడ్డ బిల్డర్లకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుంది. వెంచర్లు ఏర్పాటు చేసే ముందే అధికారులు నిబంధనలు విధిస్తే బాగుంటుంది. వాస్తవ స్థితిగతులను అంచనా వేసి అనుమతులు మంజూరు చేయాలి.  

Updated Date - 2022-08-06T03:54:23+05:30 IST