పంచాయతీలకు రూపాయీ పెండింగ్‌ లేదు

ABN , First Publish Date - 2022-06-03T08:35:38+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయీ పెండింగ్‌ లేదని, 12,769 పంచాయతీలకు ప్రతి నెలా రూ.256 కోట్ల చొప్పున

పంచాయతీలకు రూపాయీ పెండింగ్‌ లేదు

కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు

సోషల్‌మీడియా ద్వారా నిజాలు చెబుదాం: కేటీఆర్‌, ఎర్రబెల్లి

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయీ పెండింగ్‌ లేదని, 12,769 పంచాయతీలకు ప్రతి నెలా రూ.256 కోట్ల చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తోందని మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ చొరవతో ఎనిమిదేళ్లుగా తెలంగాణ అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధిస్తోందని వెల్లడించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసే కార్యక్రమాలు తాము చేపడుతుంటే కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి నిధులు ఇవ్వకుండా... కేంద్ర సర్కారు కొత్త సాఫ్ట్‌వేర్‌ పేరిట అనేక ఇబ్బందులు పెడుతోందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా పలువురు మంత్రులు, ఎంపీలు తదితరులతో గురువారం వారు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులిద్దరూ మాట్లాడుతూ కామారెడ్డి సదాశివనగర్‌ సర్పంచ్‌ విషయంలో నిధులు వచ్చినప్పటికీ డబ్బులు రాలేదని అసత్య ప్రచారాలు చేశారని పేర్కొన్నారు. కాగా, తెలంగాణకు కేంద్రం నిధులు తీసుకురాలేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌... దీక్ష ఎందుకు చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్‌, ఎర్రబెల్లి సూచించారు. నేటి నుంచి ప్రారంభం కానున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొని విజవంతం చేయాలని, ప్రజలకు నిజానిజాలు తెలియజేయాలని సూచించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్ష, కక్షసాధింపు చర్యలను తిప్పికొట్టాలన్నారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని అన్నారు. 

Updated Date - 2022-06-03T08:35:38+05:30 IST