సేదతీరేందుకు చోటేది?

ABN , First Publish Date - 2022-05-22T05:30:00+05:30 IST

ప్రతీ పల్లె, పట్టణాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన స్థలాలను సంబంధిత శాఖలు సమకూర్చుతున్నాయి. కానీ దుబ్బాక మున్సిపాలిటీలో మాత్రం పార్కుల ఏర్పాటు మాటలకే పరిమితమైంది. సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించిన 60 ఎకరాల బోటానికల్‌ పార్కు నిర్మాణం ఎనిమిది సంవత్సరాలైనా సాకారం కాలేదు. కనీసం వార్డుల్లో ప్రకృతి వనాల దాఖలాలు కూడా లేవు. ఒత్తిడితో కూడిన జీవనం సాగించే పట్టణ ప్రజలకు తీరిక వేళలో అహ్లాదంగా సేదతీరేందుకు పార్కులు కరువయ్యాయి.

సేదతీరేందుకు చోటేది?
పట్టణ ప్రకృతివనం ఏర్పాటుకు ప్రతిపాదించిన మాలకుంట

ఏర్పాటుకు నోచుకోని పార్కులు

ఆచరణలోకి రాని ప్రకృతి వనాలు

స్థలం కేటాయింపులో జాప్యం

స్థలం ఉన్న చోట నిర్లక్ష్యపు జాడ్యం

దుబ్బాక మున్సిపాలిటీలో ఇదీ పరిస్థితి


దుబ్బాక, మే 22: ప్రతీ పల్లె, పట్టణాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన స్థలాలను సంబంధిత శాఖలు సమకూర్చుతున్నాయి. కానీ దుబ్బాక మున్సిపాలిటీలో మాత్రం పార్కుల ఏర్పాటు మాటలకే పరిమితమైంది. సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించిన 60 ఎకరాల బోటానికల్‌ పార్కు నిర్మాణం ఎనిమిది సంవత్సరాలైనా సాకారం కాలేదు. కనీసం వార్డుల్లో ప్రకృతి వనాల దాఖలాలు కూడా లేవు. ఒత్తిడితో కూడిన జీవనం సాగించే పట్టణ ప్రజలకు తీరిక వేళలో అహ్లాదంగా సేదతీరేందుకు పార్కులు కరువయ్యాయి. 


20 వార్డులు.. మూడు ప్రకృతివనాలు

దుబ్బాక మున్సిపాలిటీలో విలీన గ్రామాలతో కలిపి 20 వార్డులు ఉన్నాయి. కానీ మూడు వార్డుల్లోనే ప్రకృతివనాలు నిర్మిస్తున్నారు. దర్మాజీపేట, చేర్వాపూర్‌, దుంపలపల్లి వార్డుల్లో రూ. 5 లక్షల చొప్పున నిధులతో పట్టణ ప్రకృతివనాలను ఏర్పాటు చేస్తున్నారు. మల్లాయపల్లిలో ప్రకృతివనం ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలం వివాదాస్పదంగా మారడంతో నిలిచిపోయింది. దుబ్బాక పట్టణంలో మాత్రం ఇప్పటి వరకు పట్టణ ప్రకృతివనం ఏర్పాటుకు అడుగు ముందుకు పడలేదు. మాలకుంట వద్ద ఏర్పాటు పట్టణ ప్రకృతివనం ఏర్పాటు చేయాలని నిర్ణయించినా రెవెన్యూ శాఖ నుంచి అనుమతి కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. గతంలో దీనిని పార్కు మార్చాలని ప్రతిపాదన చేశారు. కానీ ఎనిమిది సంవత్సరాల నుంచి ఆచరణకు నోచుకోలేదు. మాలకుంటకు నీటి ప్రవాహం లేదని సంబంధిత శాఖల అధికారులు ధ్రువీకరించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు స్పందించలేదు. అలాగే కల్యాణ మండపం సమీపంలో మంచినీటి బావి వద్ద ఉద్యానవనం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినప్పటికీ స్థల వివాదం తలెత్తడంతో విరమించుకున్నారు. అలాగే, దుబ్బాక మున్సిపాలిటీలో బృహత్‌ పట్టణ ప్రకృతివనానికి స్థలం ఎంపిక ఇబ్బందిగా మారింది. దర్మాజీపేట శివారులో 4 ఎకరాల భూమిని సేకరించారు. కానీ దానిపై వివాదం తలెత్తడంతో పక్కన పెట్టారు. మరెక్కడా అంత స్థలం లేకపోవడంతో బహత్‌ వనం ఏర్పాటు సాధ్యం కావడం లేదు. 


నెరవేరని సీఎం బోటానికల్‌ గార్డెన్‌ హామీ

సీఎం కేసీఆర్‌ 2015లో దుబ్బాక పర్యటన సందర్భంగా పట్టణంలో 60 ఎకరాల్లో బొటానికల్‌ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అవసరమైన స్థలం సేకరించాలని అధికారులను ఆదేశించారు. కానీ అధికారులు మాత్రం అడుగు ముందుకు వేయలేదు. స్థల సేకరణకు ప్రయత్నించిన దాఖలాలు లేవు. 


వెంచర్లలోనూ అదే నిర్లక్ష్యం

దుబ్బాకలో పలు వెంచర్లలో ఉద్యానవనాల ఏర్పాటును పట్టించుకోవడం లేదు. డీటీసీపీ నిబందనల ప్రకారం వెంచర్లలో పార్కులకు 15 శాతం స్థలం కేటాయించాల్సి ఉంటుంది.  ఇందులో యాదాద్రి-మియావాకి తరహా ప్లాంటేషన్‌ చేయాలని పురపాలిక శాఖ ఆదేశాలిచ్చింది. కానీ దుబ్బాకలో కనీసం ప్రతిపాదనలు కూడా సిద్ధంగా లేవు. సప్తగిరి వెంచర్‌లో ఎకరా స్థలం ఉండగా దానిని ప్రకృతివనం ఏర్పాటుకు కేటాయించారు. విశ్వం శ్రీనివాస టౌన్‌షి్‌పలో ఎకరా స్థలం ఉన్నా ప్రకృతి వనం ఏర్పాటు చేయడంలేదు. కేవలం నర్సరీ ఏర్పాటు చేశారు. అలాగే, పలు వెంచర్లలో స్థలం ఉన్నా ఉద్యానవనాల నిర్మాణం చేపట్టలేదు. 

Updated Date - 2022-05-22T05:30:00+05:30 IST